ఆరోజు ఆమె ముందు రెండు మార్గాలు.. చదువు, చావు! | Jalandhar: Neha Sells Tiffins by Roadside to Lead a Life of Dignity | Sakshi
Sakshi News home page

ఆశయానికి తొలి మార్గం.. శ్రమైకజీవన సౌందర్యం

Published Sat, Jan 22 2022 3:18 PM | Last Updated on Sat, Jan 22 2022 3:18 PM

Jalandhar: Neha Sells Tiffins by Roadside to Lead a Life of Dignity - Sakshi

ఆరోజు ఆమె ముందు రెండు మార్గాలు ఉన్నాయి.
ఒకటి చదువు, రెండవది చావు.

చదువుకన్నా ముందు ‘చావు’కు సంబంధించిన ఆలోచనలు పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన నేహాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
‘ఇక ఈలోకంలో నేను ఉండలేను’ అనుకుంది ఆమె గట్టిగా.

అదే సమయంలో తన బాల్యంలోని  కొన్ని సంఘటనలు గుర్తుకొచ్చాయి.

‘మీ అమ్మాయి తెలివైనది. బాగా చదివించండి’ అని టీచర్లు తన తల్లిదండ్రులతో చెప్పేవాళ్లు.
లాయర్‌ కావాలనేది తన కల.
 
అయితే చిన్న వయసులోనే నేహకు పెళ్లి కావడంతో ఆ కల చెదిరిపోయింది. కొన్ని సంవత్సరాల తరువాత భర్త వేరే అమ్మాయితో సహజీవనం చేస్తూ తనను ఒంటరి చేశాడు. అత్తవారి నుంచి కూడా తనకు మద్దతు కరువైంది. పైగా సూటిపోటి మాటలు.

పుట్టింటికి వెళదామా అంటే... పాపం వారి పరిస్థితి అంతంత మాత్రమే. వారికి తాను భారంగా ఉండదల్చుకోలేదు. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనల్లోకి వెళ్లింది. అయితే ఈ ప్రతికూల ఆలోచనలు కొద్దిసేపే.

‘నాకో కల ఉంది. ఆ కలను నెరవేర్చుకోవడానికి బతకాలి’ అని గట్టిగా అనుకుంది నేహ

చిన్నాచితకా పనులు చేస్తూ ఆగిపోయిన చదువును కొనసాగించింది. దూరవిద్యా విధానంలో డిగ్రీ పూర్తి చేసింది.

ఆ తరువాత... ఎల్‌ఎల్‌బీలో అడ్మిషన్‌ పొందింది.
ఆరోజు తన జీవితంలో మరిచిపోలేని రోజు. ఎంత సంతోషించిందో!
అయితే ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు.

ఒక కంపెనీలో ఉద్యోగం చేసేది నేహ. అయితే కోవిడ్‌ వేవ్‌లో ఉద్యోగాన్ని కోల్పోవలసి వచ్చింది. వేరే కంపెనీలో ఉద్యోగం వెదుక్కోవడానికి కాలికి బలపం కట్టుకొని తిరిగింది. (క్లిక్‌: జీవితాన్ని మలుపు తిప్పిన కెమెరా: మాయ ముక్తై)

‘ఉన్న ఉద్యోగులనే వద్దంటున్నాం. కొత్త ఉద్యోగాలు ఎక్కడివి’ అనే మాటలు వినిపించాయి.
ఒకవైపు తాను చదువుకోవాలి, దానికి ముందు తాను బతకాలి!

ఒకరోజు తనకు ఒక మార్గం తోచింది.
బజ్జీ, దోసె, పరోటా... ఇలా రకరకాల టిఫిన్లు తయారుచేసి అమ్మాలని నిర్ణయించుకుంది. నిజానికి వాటి తయారీ, రుచుల గురించి తనకు పెద్దగా తెలియదు. తెలిసిన వారి దగ్గరకు వెళ్లి ఓపిగ్గా నేర్చుకుంది. జలంధర్‌లోని ఒక ఆస్పత్రికి సమీపంలో చిన్నగా టిఫిన్‌ స్టాల్‌ మొదలుపెట్టింది.
ఉల్లిగడ్డలు తరగడం నుంచి పాత్రలు తోమడం వరకు అన్నీ తానే చేసేది.
కొద్దిరోజులలోనే టిఫిన్‌ సెంటర్‌ పాపులర్‌ అయింది. 

ఇప్పుడు తాను ఎక్కడికో  వెళ్లి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగంతో వచ్చే జీతం కంటే ఇప్పుడే ఆదాయం ఎక్కువగా వస్తుంది.
‘లా’ పూర్తి చేసి మంచి న్యాయవాదిగా పేరు తెచ్చుకోవాలనేది నేహ ఆశయం.
‘స్త్రీలు రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి లాయర్‌గా అండగా నిలవాలనుకుంటున్నాను’ అంటుంది నేహ.            

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement