సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చిరుధాన్యాల సాగుకు మరింత ప్రాధాన్యమిస్తామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో పోషక విలువలు అధికంగా అందించగల వీటిని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
హైదరాబాద్‌లో శుక్రవారం మొదలైన నాలుగో నేషనల్ న్యూట్రీ సీరల్ కన్వెన్షన్‌లో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాల సాగుభూమి ఉండగా 1.46 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని, వీటిలో చిరుధాన్యాల విస్తీర్ణం కొంచెం తక్కువగా ఉందన్నారు. ఆరోగ్యానికి పోషకాలను అందించే చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత చొరవ తీసుకోవాలని, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా వీటిని అన్నివర్గాల వారికి అందివ్వగలిగితే డిమాండ్ పెరిగి ఎక్కువమంది రైతులు సాగు చేపట్టే అవకాశం ఉందని వివరించారు.
చిరుధాన్యాల సాగుకు అత్యంత ప్రాధాన్యమివ్వడం భవిష్యత్తులో ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కారం కాగలదని సీనియర్ ఐఏఎస్ అధికారి, నేషనల్ రెయిన్‌ఫెడ్ ఏరియా అథారిటీ సీఈవో డాక్టర్ అశోక్ దళవాయి అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రస్తుతం 28 కోట్ల టన్నుల ధాన్యాలు పండుతుండగా, ఇందులో కనీసం మూడోవంతు చిరుధాన్యాలు ఉండేలా చేయగలిగితే భవిష్యత్తు అవసరాలను అందుకోగలమని చెప్పారు. కేంద్రప్రభుత్వ సంయుక్త కార్యదర్శి శోభాఠాకూర్, ఐకార్ అడిషనల్ డీజీ డాక్టర్ ఆర్.కె.సింగ్, ఐఐఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ రత్నావతి, ఐఐఎంఆర్ న్యూట్రి హబ్ సీఈవో డాక్టర్ దయాకర్‌రావు, సమున్నతి సంస్థ అనిల్ కుమార్, వ్యవసాయశాఖ అదనపు కమీషనర్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు.
కొత్త పుంతలు తొక్కుతున్న చిరుధాన్య ఉత్పత్తులు...
నేషనల్ న్యూట్రీ సీరల్ కన్వెన్షన్ 4.0 సందర్భంగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో ఏర్పాటు చేసిన చిరుధాన్యాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఉత్కర్ ఫుడ్స్ అనే బెంగళూరు కంపెనీ చిరుధాన్యాలతో చేసిన వడియాలకు ఆయుర్వేద మూలికలైన శతావరి, నన్నారి (ఇండియన్ సార్స్ పరిల్లా)లను జోడించింది.
నన్నారి కీళ్లనొప్పులను తగ్గించేందుకు ఉపయోగపడుతుందన్న విషయం తెలిసిందే. శతావరి విషయానికొస్తే ఇది హార్మోన్ల సమతౌల్యానికి, మెనోపాజ్ సమస్యల పరిష్కారానికి అక్కరకొస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. మిబిల్స్ మురుకులు, మిక్స్చర్, లడ్డూలు, గోల్డెన్ మిల్లెట్స్, క్వికీలు నూడుల్స్, పాస్తాలను సిద్ధం చేసి అమ్ముతున్నాయి. వైస్ మామా చిరుధాన్యాలకు పండ్లు, కాయగూరలు, డ్రైఫ్రూట్స్‌లు జోడిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment