సాక్షి, అమరావతి: అన్నదాత ఇంట చిరుధాన్యాలు సిరులు కురిపించనున్నాయి. ప్రజలకు ఆరోగ్య భాగ్యాన్ని చేకూర్చనున్నాయి. అటు రైతులకు రొక్కం ఇటు ప్రజలకు ఆరోగ్యం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘మిషన్ మిల్లెట్’కు శ్రీకారం చుట్టింది. సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా చిరుధాన్యాల సాగును ప్రోత్సహించి సరికొత్త వ్యవసాయ విప్లవం దిశగా కార్యాచరణ చేపట్టింది. విత్తనాల సరఫరా నుంచి 100 శాతం పంట కొనుగోలు బాధ్యత స్వీకరించడం ద్వారా రైతులకు భరోసా కల్పించనుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చిరుధాన్యాలను సరఫరా చేయడంతోపాటు పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం.. ప్రభుత్వ హాస్టళ్లలో పోషక విలువలతో కూడిన ఈ ఆహారాన్ని అందించడం ద్వారా భావితరం ఆరోగ్య పరిరక్షణకు నడుం బిగించింది. లక్ష్య సాధనకు రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ ఇదీ...
10 లక్షల ఎకరాల్లో సాగుకు సన్నద్ధం...
రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును రెట్టింపు చేయడమే లక్ష్యంగా ‘మిల్లెట్స్ మిషన్’కు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా 5.79 లక్షల ఎకరాల్లో చిరు ధాన్యాలను పండిస్తున్నారు. మేజర్ మిల్లెట్స్‌గా పరిగణించే సజ్జలు, జొన్నలు, మైనర్ మిల్లెట్స్‌గా పరిగణించే రాగులు, కొర్రలు, వరిగ, ఊద, సామలు, అరిక పంటలను సాగు చేయడం ద్వారా ఏటా 4.40 లక్షల టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. రానున్న ఐదేళ్లలో చిరు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని అదనంగా మరో 5 లక్షల ఎకరాలు పెంచనున్నారు. రాగుల సాగును 3,45,625 ఎకరాలకు, కొర్రల సాగును 1,54,375 ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇతర చిరు ధాన్యాలైన సజ్జ, జొన్న, వరిగ, ఊద, సామ, అరిక సాగును కూడా ప్రోత్సహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
అనువైన ప్రాంతాల మ్యాపింగ్...
చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు మండలాల వారీగా కార్యాచరణకు వ్యవసాయ శాఖ సిద్ధమవుతోంది. అనువైన ప్రాంతాలను మండలాల వారీగా మ్యాపింగ్ చేస్తున్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో కనీసం 50 ఎకరాల చొప్పున చిరు ధాన్యాల సాగును ప్రోత్సహిస్తారు. అందుకోసం రూ.82.95 కోట్లతో 17,282 ఎకరాల్లో రాగులు, రూ.30.88 కోట్లతో 7,720 ఎకరాల్లో కొర్రలను ‘క్లస్టర్ డెమో’గా గుర్తించి సాగు చేపడతారు. చిరుధాన్యాలను సాగు చేసే రైతులకు రూ.103.69 కోట్లతో 69,125 తుంపర సేద్యం యూనిట్లు అందచేస్తారు. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా రూ.8.13 కోట్లతో 650 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తారు. దిగుబడుల్లో నాణ్యతను పెంచేందుకు రూ.15.07 కోట్ల అంచనాతో ఎంపిక చేసిన చిరుధాన్యాల క్షేత్రాల్లో 13,825 పొలం బడులు నిర్వహిస్తారు.
ఉత్తమ యాజమాన్య పద్ధతులతో..
చిరుధాన్యాల సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించే రైతులకు జీఏపీ (గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్) గుర్తింపునిస్తారు. వీటి సాగు రైతులకు అన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. కొండలు, గిరిజన ప్రాంతాలతో పాటు మెట్ట భూములు వీటికి అనుకూలం. వర్షాభావ పరిస్థితులను సమర్థంగా తట్టుకుంటాయి. కందులు, ఆముదం లాంటి ఇతర పంటల్లో అంతర పంటగా సాగు చేయవచ్చు. ఎకరం వరి సాగుకు వినియోగించే నీటితో నాలుగెకరాల్లో చిరుధాన్యాలను పండించొచ్చు. తక్కువ విద్యుత్, పరిమితంగా ఎరువుల వినియోగం, తక్కువ కాలపరిమితితో సాగు చేయడం ద్వారా భూమిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. సజ్జలు, జొన్నలు, రాగులకు కేంద్రం మద్దతు ధర ప్రకటించగా మిగిలిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తోంది. మార్కెట్‌లో గిట్టుబాటు ధర దక్కని ప్రతీసారి ప్రభుత్వం జోక్యం చేసుకొని చిరు ధాన్యాలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది. చిరుధాన్యాలను సాగు చేస్తే ఎకరాకు రూ.10 వేల లోపే ఖర్చు అవుతుంది. మార్కెట్‌లో ధర బాగుంటే ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఆదాయం వస్తుంది. పైగా వీటి సాగు కాలం చాలా తక్కువ.
విత్తు నుంచి కొనుగోలు దాకా ప్రభుత్వమే..
చిరుధాన్యాల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుంది. పంట రుణాలు, కొనుగోలు, పంపిణీ బాధ్యతలన్నీ చేపడుతుంది. 90 శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేస్తుంది. ‘మిషన్ మిల్లెట్’ ద్వారా రైతులకు పంట రుణాలు అందచేసి ఉచిత పంటల బీమా పరిధిలోకి తీసుకొస్తారు. ఇన్‌పుట్ సబ్సిడీ వర్తింపజేస్తారు. మార్కెటింగ్ లింకేజ్ కల్పిస్తారు. పంటలను ప్రాసెస్ చేయడం ద్వారా రైతులకు రెట్టింపు ఆదాయం వచ్చేలా ప్రభుత్వం సహకరిస్తుంది. ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. తద్వారా చిరుధాన్యాల సాగు లాభదాయకమని, అనుకూలమని రైతులకు భరోసా కల్పిస్తారు.
హాస్టళ్లు, ప్రభుత్వ క్యాంటీన్లలో..
కొనుగోలు చేసిన చిరు ధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తుంది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, వైద్యశాఖ ద్వారా గర్భిణీలకు పంపిణీ చేస్తారు. పాఠశాలల్లో వారానికోసారి మధ్యాహ్న భోజనంలో మిల్లెట్స్ వంటకాలను అందిస్తారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు మిల్లెట్ ఆహారంతో పాటు వారానికి రెండుసార్లు వాటితో చేసిన బిస్కెట్స్, స్నాక్స్ అందిస్తారు. అన్ని ప్రభుత్వ క్యాంటీన్ల మెనూల్లో వీటితో తయారైన వంటకాలను చేరుస్తారు. మిల్లెట్ల ఆహారంపై అవగాహన కల్పించేందుకు జిల్లా, రాష్ట్రస్థాయిలో ఫుడ్ మేళాలు నిర్వíహిస్తారు. మిల్లెట్ వంటకాలు, చిట్కాలపై ఆర్బీకేలు, ఆర్బీకే చానల్ ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పిస్తారు. ప్రత్యేక ప్యాకేజింగ్, బ్రాండింగ్‌తో రైతుబజార్లతో పాటు డీమార్ట్, జియో మార్ట్, స్పెన్సర్స్, మోర్ లాంటి సూపర్ మార్కెట్ల ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు ఐటీసీ, ఎఫ్‌పీఓలతో అవగాహన ఒప్పందం చేసుకుంటారు. ఇలా చిరుధాన్యాల సాగు అటు రైతులకు ప్రయోజనకరంగా ఇటు సామాన్యులకు ఉపయుక్తంగా ఉండేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది.
ఉన్నతస్థాయి పర్యవేక్షణ కమిటీ..
చిరుధాన్యాల సాగు కార్యాచరణను పక్కాగా పర్యవేక్షించేందుకు ‘స్టేట్ మిల్లెట్ గ్రూప్’ పేరుతో ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం నియమించింది. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఈ కమిటీలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. వచ్చే ఖరీఫ్ నుంచి చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేలా కమిటీ కార్యాచరణను వేగవంతం చేసింది.
వరికి ప్రత్యామ్నాయంగా..
రాష్ట్రాన్ని చిరుధాన్యాల హబ్‌గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం మేరకు మిషన్ మిల్లెట్ కార్యాచరణ రూపొందించాం. రానున్న ఐదేళ్లలో వరికి ప్రత్యామ్నాయంగా పెద్ద ఎత్తున చిరు ధాన్యాల సాగును ప్రోత్సహిస్తాం. వీటిని సాగు చేసే రైతులకు అన్ని రకాలుగా చేయూతనందిస్తాం. వారు పండించిన పంటను ఆర్బీకేల ద్వారా నేరుగా కొనుగోలు చేస్తాం.
– పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ
నిదానంగా అరుగుదల..
ప్రస్తుతం మనం తింటున్న పాలీష్ పట్టిన బియ్యం, ఇతర పప్పులు తిన్న వెంటనే అరిగిపోతాయి. దీంతో రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరుగుతాయి. పాలీష్ చేయని చిరుధాన్యాలు తీసుకుంటే అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్‌తో పాటు విటమిన్స్ కూడా సమపాళ్లలో అందుతాయి. ఫోర్టిఫైడ్ రైస్‌తో చిరుధాన్యాలు తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. ప్రజలకు చిరుధాన్యాలను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం శుభపరిణామం.
– డాక్టర్ కె.సుధాకర్, అదనపు డీఎంఈ
సాగుకు ప్రోత్సాహం
► ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా 5.79 లక్షల ఎకరాల్లో చిరు ధాన్యాలను పండిస్తున్నారు. రానున్న ఐదేళ్లలో అదనంగా మరో 5 లక్షల ఎకరాలు పెంచనున్నారు. రాగుల సాగును 3,45,625 ఎకరాలకు, కొర్రల సాగును 1,54,375 ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
► చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ అనువైన ప్రాంతాలను మండలాల వారీగా మ్యాపింగ్ చేస్తోంది. ఎంపిక చేసిన గ్రామాల్లో కనీసం 50 ఎకరాల చొప్పున చిరు ధాన్యాల సాగును ప్రోత్సహిస్తుంది.
► రైతులకు 69,125 తుంపర సేద్యం యూనిట్లు అందజేస్తారు. రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా 650 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తారు. దిగుబడుల్లో నాణ్యతను పెంచేందుకు చిరుధాన్యాల క్షేత్రాల్లో 13,825 పొలం బడులు నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment