నూతన విత్తనాల వివరాలు వెల్లడిస్తున్న పూనం మాలకొండయ్య
సాక్షి, అమరావతి: రైతులకు కొత్తగా మరో పది వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. ఏపీ ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేస్తున్న వివిధ పరిశోధన కేంద్రాలు వీటిని అభివృద్ధి చేశాయి. వరిలో మూడు, పెసలు, చిరుధాన్యాల్లో రెండు చొప్పున విత్తనాలు వచ్చాయి. మినుము, వేరుశనగ, శనగలో ఒక్కొక్కటి చొప్పున కొత్త వంగడాలు తీసుకొచ్చారు.
మంగళవారం రాష్ట్ర విత్తన సబ్ కమిటీ 40వ సమావేశంలో వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనమ్ మాలకొండయ్య, స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, వీసీ విష్ణువర్ధన్‌రెడ్డి వీటిని విడుదల చేశారు. పూనం మాలకొండయ్య మాట్లాడుతూ మంచి గుణగణాలు కలిగిన కొత్త రకాలను శాస్త్రవేత్తలు, విస్తరణ సిబ్బంది కలిసి రైతులకు పరిచయం చేయాలని సూచించారు.
రాష్ట్రంలో చిరుధాన్యాలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తున్నందున, ఈ రకాల సాగును ప్రోత్సహించాలని చెప్పారు. కొత్త రకాల ప్రత్యేకతలను ఆర్బీకేల్లో ప్రద ర్శించి, రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న తరుణంలో అందుకు అనువైన రకాలను రూపొందించాలని సూచించారు.
కొత్త వంగడాల ప్రత్యేకతలు...
► వరి.. ఎంటీయూ–1318: మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి విడుదల చేసిన ఈ రకం ఎంటీయూ 7029 స్వర్ణ రకానికి బదులుగా అభివృద్ధి చేసింది. మిషన్ కోతకు అనువైనది. ఎక్కువ దిగుబడినిస్తుంది. ముంపును తట్టుకునే శక్తి ఉంటుంది.
► వరి.. ఎంటీయూ1232: ఇది కూడా మార్టేరు పరి శోధన కేంద్రం అభివృద్ధి చేసిందే. నెల రోజుల ముంపును కూడా తట్టుకుంటుంది. 135 నుంచి 140 రోజుల్లో పంట వస్తుంది. అగ్గి, పాముపొడ తెగుళ్లు, సూది దోమను తట్టుకునే రకమిది.
► వరి.. ఎంసీఎం–103 (బందరు సన్నాలు): మచిలీపట్నం వ్యవసాయ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసిన వంగడమిది. ఉప్పు నేలలకు అనువైన రకమిది. అగ్గి తెగులును తట్టుకుంటుంది. సాధారణ నేలల్లో హెక్టార్‌కు 60 నుంచి 65 క్వింటాళ్లు, ఉప్పు నేలల్లో 50 నుంచి 55 క్వింటాళ్లు దిగుబడి ఇస్తుంది.
► రాగులు.. వీఆర్ 1099 (గోస్తనీ): దీన్ని విజయనగరం వ్యవసాయ పరిశోధన సంస్థ అభివృద్ధి చేసింది. అన్ని జిల్లాల్లో సాగుకు అనువైనది. ప్రస్తుతం ఉన్న శ్రీ చైతన్య రకం కంటే 17 నుంచి 22 శాతం అధిక దిగుబడి ఇస్తుంది. అగ్గి తెగులును తట్టుకుంటుంది.
► కొర్రలు.. ఎస్‌ఐఏ–3150 (మహానంది): దీన్ని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసింది. ఖరీఫ్, రబీతో పాటు వేసవి కాలానికి కూడా అనువైనది. హెక్టారుకు 31 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. 20 శాతం ఎక్కువ ప్రొటీన్, కాల్షియం ఉంటాయి.
► పెసర.. ఎల్‌జీజీ–574: గుంటూరు లాంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసింది. మాగాణి, మెట్ట ప్రాంతానికి అనువైనది. మోజాయిక్ వైరస్‌ను తట్టుకుం టుంది. హెక్టార్‌కు 15–16 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. మిషన్ కోతకు అనువైనది.
► పెసర.. ఎల్‌జీజీ–607: గుంటూరు లాంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసిన రకమిది. పంట కాలం 60 నుంచి 65 రోజులు. యెల్లో మోజాయిక్ వైరస్‌ను తట్టుకునే శక్తి ఉంటుంది. హెక్టార్‌కు 15–17 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. ఒకేసారి పరిపక్వతకు వస్తుంది. మిషన్ కోతకు అనువుగా ఉంటుంది.
► మినుములు.. ఎల్‌బీజీ–884: గుంటూరు లాంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అభివృద్ధి చేసింది. మాగాణి, మెట్ట ప్రాంతాలకు అనువైనది. మోజాయిక్ వైరస్‌ను తట్టుకుంటుంది. హెక్టార్‌కు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది.
► శనగలు.. ఎన్‌బీఈజీ 776: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అభివృద్ధి చేసిన రకమిది. ఎండు తెగులు తట్టుకుంటుంది. హెక్టార్‌కు 28 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఎక్కువ కాయలు కలిగి 20.9 శాతం ప్రొటీన్ ఉంటుంది. జేజీ–11 రకానికి బదులుగా సాగుకు అనువైనది. 90 నుంచి 105 రోజుల్లో పంట వస్తుంది. మిషన్ కోతకు అనువుగా ఉంటుంది.
► వేరుశనగ.. టీసీజీఎస్–1694: తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసింది. ఖరీఫ్, రబీ కాలాలకు అనువైన రకం. షెల్లింగ్ పర్సంటేజ్ 72 శాతంగా ఉంటుంది. ఖరఫ్‌లో హెక్టార్‌కు 35 క్వింటాళ్లు, రబీలో 50 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment