ఆ ‘శక్తి’కీ ఓ లెక్కుంది! | That 'a calculated sakti! | Sakshi
Sakshi News home page

ఆ ‘శక్తి’కీ ఓ లెక్కుంది!

Published Fri, Jul 18 2014 11:52 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

ఆ ‘శక్తి’కీ ఓ లెక్కుంది! - Sakshi

ఆ ‘శక్తి’కీ ఓ లెక్కుంది!

90 నిమిషాల పాటు విశ్రాంతి లేకుండా పరిగెడుతూనే ఉండాలి.... ప్రత్యర్థి ఆటగాళ్లు కావాలని కాళ్లు అడ్డుపెట్టి పడేసినా లేచి బంతిని అందుకోవాలి. నిజానికి ఫుట్‌బాల్ మైదానంలో ఉన్నంతసేపు ఆటగాళ్లు మొరటుగా, బండల్లా కనిపిస్తారు. మరి వాళ్లకి అంత శక్తి ఎలా వస్తుంది? అంటే... దీనికీ ఓ లెక్కుంది. ఎంత పడితే అంత... ఎలా పడితే అలా తింటామంటే కుదరదు. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడిగా మారాలంటే కచ్చితంగా ఓ లెక్క ప్రకారం తినాల్సిందే.
 
ఫుట్‌బాల్‌లో రాణించాలంటే శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడంతోపాటు అది తనకు అడ్డంకి కాకుండా కూడా చూసుకోవాల్సివుంటుంది. వేగం, చురుకుదనం కోల్పోకుండా నియంత్రించుకోవాల్సివుంటుంది. మైదానంలో చివరి నిమిషం దాకా పోరాడగలగాలంటే అందుకు తగ్గట్లుగానే ఆహారం తీసుకోవాలి. అందుకే ఈ విషయంలో ఆటగాళ్లు అత్యంత శ్రద్ధతో ఉంటారు. డైటీషియన్ల సూచనలకు అనుగుణంగా నడచుకుంటూ.. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు ఎక్కువగా లభించే ఆహారం తీసుకుంటుంటారు. అయితే వీరి ఆహారంలో అత్యధికంగా 55 నుంచి 60 శాతం కార్బోహైడ్రేట్లు లభిస్తాయి.  

శరీర బరువుకు తగినట్లుగా..

మ్యాచ్ ఆడే రోజైనా, సాధనలో పాల్గొనేందుకైనా ఫుట్‌బాల్ ఆటగాళ్లు కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లను వారి శరీర బరువుకు తగినట్లుగా సమతుల్యంగా తీసుకుంటుంటారు. ఇందుకు ప్రతి పౌండ్ శరీర బరువుకు 2.7 గ్రాముల కార్బోహైడ్రేట్లు లభించేలా ఆహారం తీసుకుంటారు. కఠోర సాధనలో పాల్గొనాల్సిన సందర్భంలో గరిష్టంగా 4 గ్రాముల వరకు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అల్పాహారంగా తీసుకునే తృణ ధాన్యాలు, వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్‌లలో ఈ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా లభిస్తాయి. వీటితోపాటు స్పోర్ట్స్, సాఫ్ట్ డ్రింక్స్‌లోనూ, చక్కెర, జామ్, తేనె వంటి తీపి పదార్థాల్లోనూ పళ్లు, పళ్ల రసాల వంటి వాటిలోనూ ఇవి సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఆటగాళ్లు ఇలాంటి పదార్థాలతో కూడిన ఆహారాన్నే ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇక పౌండ్ శరీర బరువుకు రోజుకు 0.7 నుంచి 0.8 గ్రాముల ప్రొటీన్లు, 0.45 గ్రాముల కొవ్వు పదార్థాలు లభించే ఆహార పదార్థాలు తీసుకుంటారు.
 
బ్రేక్‌ఫాస్ట్..
 
ఫుట్‌బాల్ క్రీడాకారుల ఆహార నియమాలు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ నుంచి రాత్రి భోజనం దాకా పూర్తిగా వారి డైటీషియన్ల సూచనల మేరకు ఉంటాయి.  మ్యాచ్ ఆడాల్సిన రోజు బరిలోకి దిగేందుకు రెండు గంటల ముందే అల్పాహారం చేస్తారు. వేయించిన కేక్‌లు, ఎగ్ శాండ్‌విచ్‌లు, ఉడికించిన గుడ్లు, చక్కెర కలిపిన గోధుమలు వంటి పదార్థాలతోపాటు ద్రాక్ష, అరటి, యాపిల్, నారింజ వంటి పండ్లు, గ్లాసు పాలు తీసుకుంటారు. అయితే అన్నింట్లోనూ కొవ్వు శాతం ఎక్కువ లేకుండా జాగ్రత్త పడతారు.
 
తేలికైన లంచ్
 
మ్యాచ్‌లో ఆడాల్సివున్నా, శిక్షణలో పాల్గొనాల్సివున్నా అతిగా భోజనం చేయడం అడ్డంకిగా మారే అవకాశం ఉన్నందున తేలికైన లంచ్ మాత్రమే తీసుకుంటారు. అయితే ఇదే సమయంలో తగినంత శక్తి కూడా అవసరమైనందున కొద్దిమోతాదులో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లతో కూడిన భోజనానికి ప్రాధాన్యత ఇస్తారు. కూరగాయలతోపాటు బీన్స్, బీట్స్, క్యారెట్ వంటి వాటితో చేసిన సలాడ్‌లు తీసుకుంటారు. శాండ్‌విచ్‌లు వెజిటబుల్ సూప్‌లు, మాంసంతోగానీ, మాంసం లేకుండా గానీ పాస్తాలు, ఉడికించిన మాంసం భుజిస్తారు. ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్లలో భోజనం చేయాల్సివస్తే.. గ్రిల్డ్ చికెన్ శాండ్‌విచ్‌లు, రోస్ట్ బీఫ్ శాండ్‌విచ్‌లు, బేక్ చేసిన ఆలుగడ్డలు, సలాడ్ బార్స్ వంటివి తీసుకుంటారు.
 
రాత్రి భోజనం పుష్టిగా...
 
మ్యాచ్‌లో ఆడి అలసిపోయిన శరీరానికి తిరిగి శక్తినిచ్చే విధంగా రాత్రిభోజనం ఉంటుంది. ఉడికించిన లేదా బేక్ చేసిన మాంసం, నత్తలతో కూడిన టమాటో సాస్, చికెన్ వంటి మాంసాహారం తీసుకుంటారు. నూనెలు ఎక్కువగా లేని కూరగాయలతో కూడిన ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇస్తారు. లంచ్‌కు రాత్రి భోజనానికి మధ్య స్నాక్స్ తీసుకుంటారు. వీటిలో ఎండిన రోస్టెడ్ నట్స్, బ్రెడ్, తాజా పండ్లు, పళ్ల రసాలు ఎక్కువగా ఉంటాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement