brown bread
-
బ్రౌన్ బ్రెడ్ తింటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
ఈ మధ్యకాలంలో చాలామంది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం బ్రౌన్ బ్రెడ్‌ను వినియోగిస్తుంటారు.గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో బ్రెడ్ వినియోగం విపరీతంగా పెరగిపోయింది. అల్పాహారం, శాండ్విచ్, పాన్కేక్.. ఇలా ఒకటేమిటి చాలా రకాలుగా బ్రెడ్‌ను వాడుతున్నారు. మరి బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యానికి ఎంత వరకు మంచిది? వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యకరమైనదా? ఇప్పుడు చూద్దాం. బిజీ లైఫ్ కారణంగా చాలామంది టిఫిన్‌గా బ్రెడ్ టోస్ట్ లేదా ఆమ్లెట్‌తో సరిపెట్టుకుంటారు. అయితే ఇదంత మంచిది కాదు. బ్రెడ్‌లో మైదా ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు శరీరంలో పిండిపదార్థం, ఉప్పు కూడా పెరిగి అధిక రక్తపోటు, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బ్రెడ్‌లో పిండి పదార్థం కారణంగా తిన్న వెంటనే రక్తంలో కలిసిపోతుంది. ఇది చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఎక్కువగా బ్రెడ్ తినేవారిలో ఊబకాయానికి కూడా దారితీస్తుంది. బ్రౌన్ బ్రెడ్‌తో పోలిస్తే వైట్ బ్రెడ్ అంత మంచిది కాదు. దీనిలో విటమిన్లు, మినరల్స్, పోషకాలు పెద్దగా ఏమీ ఉండవు. కాబట్టి ఇది తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వైట్ బ్రెడ్ తయారీకి వాడే పిండిలే ఫైబర్ అస్సలు ఉండదు. ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. దీంతో పాటు అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు కూడా వస్తాయి. బ్రౌన్ బ్రెడ్ మంచిదేనా? ►వైట్ బ్రెడ్‌తో పోలిస్తే బ్రౌన్ బ్రెడ్ మంచిది. అయితే నార్మల్ పిండితో కాకుండా మల్టీగ్రెయిన్ బ్రౌన్ బ్రెడ్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఇందులో కల్తీ జరగడానికి ఆస్కారం ఎక్కువ. మైదా బ్రెడ్కే కలర్ వేసి బ్రౌన్ బ్రెడ్‌గా విక్రయిస్తుంటారు. అందుకే ప్యాకెట్ వెనుక భాగంలో ఉండే ఇంగ్రీడియన్స్ను చెక్ చేసుకోవాలి. ► బ్రౌన్ బ్రెడ్‌ను గోధుమలు, నీళ్లు, ఉప్పు, చక్కెర, ఈస్ట్ ఉపయోగించి తయారుచేస్తారు. ► బ్రౌన్ బ్రెడ్‌లో ఐరన్, జింక్, కాపర్, మెగ్నిషియం వంటి పోషకాలు ఉంటాయి. ► బ్రౌన్ బ్రెడ్‌లో 28 గ్రాముల ధాన్యపు పోషకాలను అందిస్తుందట. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది. ► ప్రతి రోజూ బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల శరీరానికి విటమిన్ కే, ఈ, బీ, కార్భోహైడ్రేట్లు, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు లభిస్తాయి. బ్రౌన్ బ్రెడ్ బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్. ► రోజూ 1-2 బ్రౌన్‌బ్రెడ్ ముక్కలను తీసుకోవడం వల్ల సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ విడుదల అవుతుందని ఓ సర్వేలో వెల్లడైంది. ఈ హార్మోన్ మంచి నిద్రకు ప్రేరేపించడమే కాకుండా, అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ► మల్టీ గ్రైన్ బ్రెడ్ లో ధాన్యం గింజలు గ్లైసెమిక్ ఇండెక్స్‌ను తక్కువగా ఉండేలా చేస్తాయి. వీటి వల్ల మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు వంటి రిస్క్ తగ్గుతుంది. ► మల్టీ గ్రైన్ బ్రెడ్ లో ఫ్యుతోన్యూట్రియన్ అనే యాంటి ఆక్సిడెంట్ ఉంటుంది. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షించటానికి సహాయపడతాయి. -
Hair Care: వాల్నట్స్ తింటున్నారా.. ఇందులోని ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ వల్ల
Hair Care Tips In Telugu: జుట్టు పొడవుగా... ఒత్తుగా పెరగడంలో క్షారం ఉన్న ఆహార పదార్థాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఆల్కలైన్ లేదా క్షారం శరీర పీహెచ్ స్థాయులను సమతులంగా ఉంచి జీర్ణక్రియ సవ్యంగా జరిగేలా చేసి, శరీరానికి పోషకాలను అందిస్తుంది. ఫలితంగా కురులకు పోషకాలు అంది ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ ఆహార పదార్థాలు తింటే మేలు ►తెల్లగా ఉన్న బ్రెడ్ కంటే బ్రౌన్బ్రెడ్ను తినాలి. ►తెల్లగా ఉండే పిండి కాకుండా రాగి, జొన్న, సజ్జ, బార్లీ పిండిలను కలిపి రొట్టె చేసుకుని తినాలి. ►దోసకాయ, పాలకూర, బ్రకోలి, కాకరకాయ, బీన్స్‌ను ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలో విటమిన్ కే, ఫోలేట్లు పుష్కలంగా ఉంటాయి. ►తులసి ఆకులు, బెల్లంతో చేసిన టీ, తులసి, పుదీనా, సొరకాయలను కలిపి చేసిన జ్యూస్ కూడా జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది. ►వాల్‌నట్స్‌లోని ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. ఫలితంగా రక్తప్రసరణ చక్కగా జరిగి జుట్టు పెరుగుదలకు దోహద పడుతుంది. ►వాల్నట్స్ తినలేనివారు కనీసం వాల్నట్స్ ఆయిల్‌ను జుట్టుకు పట్టించి మసాజ్ చేసుకోవాలి. ►బొప్పాయి హెయిర్ మాస్క్ కూడా కేశాల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. చదవండి👉🏾Mango Health Benefits: సీజన్ కదా అని మామిడి పండ్లు లాగించేస్తున్నారా? ఇందులోని క్వార్సెటిన్ వల్ల.. -
Belly Fat: క్యారెట్, మెంతులు, జామ, బెర్రీస్.. కొవ్వు, బరువు రెండూ తగ్గుతాయి!
Belly Fat: పొట్ట, బరువు తగ్గి, చక్కగా స్లిమ్‌గా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అలా తగ్గేవారు మాత్రం తక్కువే. కారణం... తగ్గడానికి సరైన ఆహారాన్ని ఎంచుకోకపోవడం, ఒకవేళ ఎంచుకున్నా, ఆ నియమాలను పాటించకపోవడం. కొన్ని వ్యాయామాలు పొట్టలో నిల్వ ఉన్న కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి, కానీ కేవలం వ్యాయామం మాత్రమే చేయడం వల్ల లేదా కేవలం ఆహార నియమాలు మాత్రమే పాటించడం వల్ల పొట్ట తగ్గదు. ఆహార నియమాలతోపాటు వ్యాయామాలు కూడా చేయాలి. అప్పుడే ప్రయత్నంలో సఫలమవుతాం. ఆ మార్గాలేమిటో చూద్దాం. చలికాలంలో మనకు తెలియకుండానే బరువు పెరిగిపోతాం. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలి. కఠిన వ్యాయామాలతో శరీరాన్ని శిక్షించడానికి మనసు ఒప్పుకోదు. అలాగే ఈ శీతాకాలంలో ఫ్రైలు, మసాలాలు, కరకరలాడే చిరుతిళ్లు తినాలని మనసు తహతహలాడుతుంది. అయితే బరువు తగ్గాలన్నా, పొట్ట తగ్గి ఫిట్‌గా కనిపించాలన్నా వీటికి బదులుగా పోషకాలు ఉండే తాజా ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది. ఉదయానే నిద్రలేవడం: కొన్ని అధ్యయనాల ప్రకారం తేలిందేమంటే ఆలస్యంగా నిద్ర లేవడం బరువు పెరిగేందుకు దోహదం చేస్తుంది. అందువల్ల వీలైనంత వరకు తొందరగా నిద్ర లేవడం మంచిది. రన్నింగ్ : రోజూ ఉదయమే రన్నింగ్ చేయడం చాలా మంచిది. దీని వల్ల త్వరగా ఫలితాలు వస్తాయి. త్వరగా కొవ్వు తగ్గడానికి రన్నింగ్ బాగా ఉపయోగపడుతుంది. రన్నింగ్ చేయలేకపోతే కనీసం వేగంగా నడవడం మంచిది. దీనివల్ల త్వరగా బరువు తగ్గుతారు. క్యారెట్: క్యారెట్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. కాబట్టి వాటిని స్మూతీ, సలాడ్, జ్యూస్‌గా తినవచ్చు. మీ డైట్ చార్ట్‌లో క్యారెట్లను చేర్చండి, ఇది మీ బరువును సమర్థవంతంగా తగ్గిస్తుంది. మెంతులు: సహజంగా రక్తంలో చక్కెర స్థాయులను మెరుగుపరచడంలో మెంతులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మధుమేహం ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది అద్భుతమైన ఔషధం. ఈ ప్రత్యేక ఔషధ గుణాలు మీ జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఆహార పానీయాలలో మొలకెత్తిన మెంతులను ఉపయోగించడం మంచి ఫలితాలనిస్తుంది. జామ: పేదల యాపిల్‌గా పేరుగాంచిన జామకాయకు అనేక వ్యాధులను నయం చేసే శక్తి ఉంది. ఇది చలికాలంలో పుష్కలంగా లభించే పండు. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండు జీర్ణవ్యవస్థను సమర్థవంతంగా మెరుగుపరుస్తుంది. అలాగే, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బెర్రీస్: బెర్రీస్ ఆరోగ్యానికి చాలా మంచివి. బెర్రీలు తినడం ద్వారా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు తగ్గిపోతుంది. బెర్రీల్లో చాలా రకాలుంటాయి. అన్నిరకాల బెర్రీలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్, బ్లాక్బెర్రీస్ వంటి వాటిని ఉదయం లేచిన వెంటనే తినడం మంచిది. వేపుళ్లు, పాక్డ్ ఫుడ్ వద్దు: ఆయిల్‌తో డీప్ ఫ్రై చేసి తయారు చేసే ఆహారపదార్థాలను తినకండి. ఆయిల్‌తో తయారు చేసే పదార్థాలను తినడం వల్ల కొవ్వు పేరుకు పోతుంది. అలాగే గుండె జబ్బులకు గురవుతారు. అధిక కొలెస్ట్రాల్ తో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందువల్ల ఆయిల్స్‌తో తయారు చేసిన ఆహారపదార్థాలను తినకండి. వివిధ ధాన్యాలతో తయారు చేసిన బ్రెడ్: మనకు మార్కెట్లో తెల్లగా నిగనిగలాడే బ్రెడ్ దొరుకుతూ ఉంటుంది. అయితే దాన్ని తినకపోవడం మంచిది. కొన్ని రకాల బ్రెడ్ లు గోధుమ రంగులో ఉంటాయి. అలాంటి బ్రెడ్ తినడం మంచిది. వీటిలో న్యూట్రిషన్ ఎక్కువగా ఉంటుంది. మీ నడుము చుట్టూ ఉన్న కొవ్వు తగ్గడానికి, అసలు కొవ్వు పేరుకుపోకుండా ఉండేందుకు ఈ బ్రెడ్ ఉపయోగపడుతుంది. చదవండి: Health Tips: చేదుగా ఉందని బెల్లం, చింతపండుతో వండిన కాకరకాయ కూర తింటే.. -
ఆ ‘శక్తి’కీ ఓ లెక్కుంది!
90 నిమిషాల పాటు విశ్రాంతి లేకుండా పరిగెడుతూనే ఉండాలి.... ప్రత్యర్థి ఆటగాళ్లు కావాలని కాళ్లు అడ్డుపెట్టి పడేసినా లేచి బంతిని అందుకోవాలి. నిజానికి ఫుట్‌బాల్ మైదానంలో ఉన్నంతసేపు ఆటగాళ్లు మొరటుగా, బండల్లా కనిపిస్తారు. మరి వాళ్లకి అంత శక్తి ఎలా వస్తుంది? అంటే... దీనికీ ఓ లెక్కుంది. ఎంత పడితే అంత... ఎలా పడితే అలా తింటామంటే కుదరదు. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడిగా మారాలంటే కచ్చితంగా ఓ లెక్క ప్రకారం తినాల్సిందే. ఫుట్‌బాల్‌లో రాణించాలంటే శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడంతోపాటు అది తనకు అడ్డంకి కాకుండా కూడా చూసుకోవాల్సివుంటుంది. వేగం, చురుకుదనం కోల్పోకుండా నియంత్రించుకోవాల్సివుంటుంది. మైదానంలో చివరి నిమిషం దాకా పోరాడగలగాలంటే అందుకు తగ్గట్లుగానే ఆహారం తీసుకోవాలి. అందుకే ఈ విషయంలో ఆటగాళ్లు అత్యంత శ్రద్ధతో ఉంటారు. డైటీషియన్ల సూచనలకు అనుగుణంగా నడచుకుంటూ.. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు ఎక్కువగా లభించే ఆహారం తీసుకుంటుంటారు. అయితే వీరి ఆహారంలో అత్యధికంగా 55 నుంచి 60 శాతం కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. శరీర బరువుకు తగినట్లుగా.. మ్యాచ్ ఆడే రోజైనా, సాధనలో పాల్గొనేందుకైనా ఫుట్‌బాల్ ఆటగాళ్లు కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లను వారి శరీర బరువుకు తగినట్లుగా సమతుల్యంగా తీసుకుంటుంటారు. ఇందుకు ప్రతి పౌండ్ శరీర బరువుకు 2.7 గ్రాముల కార్బోహైడ్రేట్లు లభించేలా ఆహారం తీసుకుంటారు. కఠోర సాధనలో పాల్గొనాల్సిన సందర్భంలో గరిష్టంగా 4 గ్రాముల వరకు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అల్పాహారంగా తీసుకునే తృణ ధాన్యాలు, వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్లలో ఈ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా లభిస్తాయి. వీటితోపాటు స్పోర్ట్స్, సాఫ్ట్ డ్రింక్స్‌లోనూ, చక్కెర, జామ్, తేనె వంటి తీపి పదార్థాల్లోనూ పళ్లు, పళ్ల రసాల వంటి వాటిలోనూ ఇవి సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఆటగాళ్లు ఇలాంటి పదార్థాలతో కూడిన ఆహారాన్నే ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇక పౌండ్ శరీర బరువుకు రోజుకు 0.7 నుంచి 0.8 గ్రాముల ప్రొటీన్లు, 0.45 గ్రాముల కొవ్వు పదార్థాలు లభించే ఆహార పదార్థాలు తీసుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్.. ఫుట్‌బాల్ క్రీడాకారుల ఆహార నియమాలు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ నుంచి రాత్రి భోజనం దాకా పూర్తిగా వారి డైటీషియన్ల సూచనల మేరకు ఉంటాయి. మ్యాచ్ ఆడాల్సిన రోజు బరిలోకి దిగేందుకు రెండు గంటల ముందే అల్పాహారం చేస్తారు. వేయించిన కేక్‌లు, ఎగ్ శాండ్విచ్లు, ఉడికించిన గుడ్లు, చక్కెర కలిపిన గోధుమలు వంటి పదార్థాలతోపాటు ద్రాక్ష, అరటి, యాపిల్, నారింజ వంటి పండ్లు, గ్లాసు పాలు తీసుకుంటారు. అయితే అన్నింట్లోనూ కొవ్వు శాతం ఎక్కువ లేకుండా జాగ్రత్త పడతారు. తేలికైన లంచ్ మ్యాచ్‌లో ఆడాల్సివున్నా, శిక్షణలో పాల్గొనాల్సివున్నా అతిగా భోజనం చేయడం అడ్డంకిగా మారే అవకాశం ఉన్నందున తేలికైన లంచ్ మాత్రమే తీసుకుంటారు. అయితే ఇదే సమయంలో తగినంత శక్తి కూడా అవసరమైనందున కొద్దిమోతాదులో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లతో కూడిన భోజనానికి ప్రాధాన్యత ఇస్తారు. కూరగాయలతోపాటు బీన్స్, బీట్స్, క్యారెట్ వంటి వాటితో చేసిన సలాడ్లు తీసుకుంటారు. శాండ్విచ్లు వెజిటబుల్ సూప్‌లు, మాంసంతోగానీ, మాంసం లేకుండా గానీ పాస్తాలు, ఉడికించిన మాంసం భుజిస్తారు. ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్లలో భోజనం చేయాల్సివస్తే.. గ్రిల్డ్ చికెన్ శాండ్విచ్లు, రోస్ట్ బీఫ్ శాండ్విచ్లు, బేక్ చేసిన ఆలుగడ్డలు, సలాడ్ బార్స్ వంటివి తీసుకుంటారు. రాత్రి భోజనం పుష్టిగా... మ్యాచ్‌లో ఆడి అలసిపోయిన శరీరానికి తిరిగి శక్తినిచ్చే విధంగా రాత్రిభోజనం ఉంటుంది. ఉడికించిన లేదా బేక్ చేసిన మాంసం, నత్తలతో కూడిన టమాటో సాస్, చికెన్ వంటి మాంసాహారం తీసుకుంటారు. నూనెలు ఎక్కువగా లేని కూరగాయలతో కూడిన ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇస్తారు. లంచ్‌కు రాత్రి భోజనానికి మధ్య స్నాక్స్ తీసుకుంటారు. వీటిలో ఎండిన రోస్టెడ్ నట్స్, బ్రెడ్, తాజా పండ్లు, పళ్ల రసాలు ఎక్కువగా ఉంటాయి.