ఎర్రగుంట్ల వద్ద వర్షాభావంతో ఎండిన బుడ్డశనగను మేస్తున్న గొర్రెలు(ఫైల్‌ఫొటో)
కడప అగ్రికల్చర్ : రబీ సీజన్‌లో సాగు చేసిన పంటల నివేదికను పంపాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినా ఆ దిశగా మెజార్టీ ప్రభుత్వ శాఖలు నివేదికలు పంపలేదు. దీంతో కరువు ప్రకటన వెలువడలేదనే సమాధానం వినిపిస్తోంది. జిల్లాలో మొత్తం 11 శాఖలు తమకు ఇచ్చిన అంశాలను పొందుపరుస్తూ ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ తగు నివేదికలు పంపాలని విపత్తులశాఖ జనవరి నెల 9వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. నెల రోజులు గడచినా ఇంతవరకు కొన్ని శాఖలు జిల్లా కేంద్రమైన కలెక్టరేట్‌లోని విపత్తుల నిర్వహణ విభాగానికి వివరాలు పంపలేదని ఆ విభాగం అధికారులు పెదవి విరుస్తున్నారు. ప్రధానంగా వర్షపాతం, వర్ష విరామం, వాతావరణ పరిస్థితులు, భూగర్భజలాల స్థితిగతులు, , తాగునీటి వనరులు, గ్రామాల్లో తాగునీటి సరఫరా, పంటల సాగు, పంట దిగుబడులు, పంటకోత ప్రయోగాల వివరాలు, ఉపాధి హామీ, కూలీలకు కల్పిస్తున్న పనుల నివేదిక, పాడిపరిశ్రమ, పశుపోషణ, పశుగ్రాసం నిల్వలు, గ్రాసం కొరత, పశువుల, జీవాల వలసలు, మత్స్యకారుల జీవన స్థితిగతులు తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని 11 శాఖలు నివేదిక తయారు చేయాలని ఆదేశాలు జారీ చేసి నెల రోజులు గడచిపోయింది. ఈ విషయంలో కొన్ని శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలున్నాయి. అయితే జిల్లా వ్యవసాయశాఖ అధికారులు మాత్రం తమ నివేదికను తయారు చేసి ఇచ్చినట్లు పేర్కొంటున్నారు.
రెండు సీజన్లలోనూ నష్టమే..
ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలోని 51 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. ఆ సీజన్‌కుగాను పంటలు దెబ్బతినగా ఇన్‌పుట్ సబ్సిడీ కోసం రూ.15.58 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం నివేదిక పంపింది. మామూలుగా అయితే ఒక్క సీజన్ పంటలకే ఇన్‌పుట్ చెల్లించే విధంగా విపత్తుల నిర్వహణ మార్గదర్శకాలు ఉన్నాయి. అయితే 2018–19లో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్, రబీ పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విపత్తుల నిర్వహణను, మార్గదర్శకాలను సడలిస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీని ఆధారంగా ఇటీవల జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు జె.మురళీకృష్ణ రబీలో సాగు చేసిన పంటలకు సంబంధించిన ప్రాథమిక అంచనాల నివేదికను తయారు చేసి ఇన్‌పుట్ సబ్సిడీ రూ.71.36 కోట్లు అవసరమవుతుందని జిల్లా కలెక్టర్‌కు నివేదికను అందజేశారు. అయితే మారిన నిబంధనల ప్రకారం విపత్తుల విభాగం అధికారులు పలు అంశాలను జోడించి ఆయా అంశాల వారీగా నివేదికలు తయారు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ నెల రోజులు కావస్తున్నా ఆయా శాఖలు మాత్రం నివేదికలు ఇవ్వలేదు.
మరో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని, షెడ్యూల్ విడుదల చేస్తే కరువు ప్రకటన వెలువడే అవకాశం ఉండదని రైతు సంఘాలు అంటున్నాయి. రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని చెబుతున్నారు. జిల్లా నుంచి నివేదికను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థకు ఇంతవరకు పంపలేదు. దీంతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ జోక్యం చేసుకుని వెంటనే నివేదికను పంపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడా ఆయా శాఖలలో చలనం లేకపోవడం గమనార్హం. రబీలో ఏర్పడిన కరువు, పంటల పరిస్థితి, దిగుబడులు, వర్షపాతం, భూగర్భజలాల స్థితి తదితర అంశాలను లెక్కలోకి తీసుకుని నివేదిక పంపాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు పంపింది. ఇది ఇలా ఉండగా జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ముందు జాగ్రత్తగా పంటల సాగు, విస్తీర్ణం, ఆయా పంటల స్థితిగతులపై నివేదికలు తయారు చేసి సిద్ధంగా ఉంచారు. ఈ రబీలో సాధారణ పంటల సాగు 1,72,929 హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు 1,37,154 హెక్టార్లలో ప్రధాన పంటలైన బుడ్డశనగ, వేరుశనగ, జొన్న, పొద్దుతిరుగుడు, ఉలవ, మొక్కజొన్న, మినుము పంటలున్నాయి. అయితే ఈ పంట దిగుబడులను (క్రాప్ కటింగ్) జిల్లా వ్యవసాయ గణాంక అధికారులు, ఫసల్ బీమా కంపెనీ ప్రతినిధులు లెక్కకడుతున్నారు. కానీ పంటకోత ప్రయోగంలో దిగుబడులు ఏ మాత్రం రాలేదని స్పష్టం చేశారు. పంట సాగు కోసం చేసిన పెట్టుబడులు కూడా తీరలేదని పంటకోత ప్రయోగాలు చెబుతున్నాయి. రబీ సీజన్‌లో కరువు మండలాలను ప్రకటిస్తే ఈ పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించే అవకాశం ఉందని అ«ధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment