సాక్షి, అమరావతి: అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన అన్నదాతలకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. పంట నష్టపోయిన రైతుల్లో ఏ ఒక్కరికీ పరిహారం అందలేదన్న మాటే రాకూడదని, పంటలు కొనుగోలు చేయడం లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదని స్పష్టం చేశారు.
రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతోపాటు రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ముమ్మరంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్దేశించారు. ఆర్బీకేల స్థాయిలో నిశితంగా పర్యవేక్షణ జరగాలని స్పష్టం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై గురువారం ఉదయం క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన సీఎం జగన్ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు.
సచివాలయాల్లో రైతుల జాబితాలు
వర్షాల వల్ల పంటలు సహా ఇతర నష్టాలకు సంబంధించి గ్రామ సచివాలయాల స్థాయిలోనే ఎప్పటికప్పుడు వివరాలను సేకరించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత నష్టపోయిన రైతుల జాబితాలను సామాజిక తనిఖీల కోసం సచివాలయాల్లో ప్రదర్శించాలని సూచించారు. తద్వారా ఎవరైనా మిగిలిపోతే వెంటనే అధికారుల దృష్టికి తెచ్చేందుకు వీలుంటుందన్నారు.
వేగంగా రబీ ధాన్యం కొనుగోలు
రబీ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. పంటను కొనుగోలు చేయడం లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదని స్పష్టం చేశారు.
ఫిర్యాదులకు ట్రోల్ ఫ్రీ నెంబర్
రైతులకు ఏమైనా ఇబ్బందులుంటే ఫిర్యాదు చేసేందుకు ట్రోల్ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు చేపట్టాలన్నారు. రైతన్నల ముఖంలో చిరునవ్వు కనిపించేలా అధికారుల చర్యలు ఉండాలని స్పష్టం చేశారు. రానున్న రోజులకు సంబంధించి వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు వివరాలు తెప్పించుకుంటూ వర్ష ప్రభావిత ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ప్రతి జిల్లాకు వ్యవసాయ శాస్త్రవేత్త
రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి సమీక్షలో అధికారులు వివరించారు. రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా సాగుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే 4.75 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. పంట కోతలు పూర్తి కాని ప్రాంతాల్లో ఏం చేయాలన్న అంశంపై రైతులకు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు.
పంటలు కోసిన చోట పనలు తడిస్తే ఉప్పు ద్రావణం చల్లడం లాంటి విధానాలను పాటించడంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక వ్యవసాయ శాస్త్రవేత్తను అందుబాటులో ఉంచి స్థానిక అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ధాన్యం భద్రంగా గోడౌన్లకు తరలింపు
వివిధ కొనుగోలు కేంద్రాలు, ఆర్బీకేలు, రైతుల వద్ద ఉన్న ధాన్యం నిల్వలను భద్రంగా ప్రభుత్వ భవనాలు, గోడౌన్లలోకి తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు ఊపందుకున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్స్ తెరిచామని, యంత్రాంగం అంతా అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment