సాక్షి, అమరావతి: వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని పెద్దలంటారు. దీనినే స్ఫూర్తిగా తీసుకున్న రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఇదే సిద్ధాంతంతో లక్షలాది అబద్ధాలు ఆడైనా సరే సీఎం వైఎస్ జగన్‌ను గద్దె దించాలని కంకణం కట్టుకున్నాయి. అందుకే నిత్యం ఉన్నవీ లేనివీ పోగేసి ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం మీద నిరంతరం దుమ్మెత్తి పోస్తున్న ఈనాడు దినపత్రిక కథనాల్లోని అంశాలనే తీసుకుని కొన్ని రాజకీయ పార్టీలు పాచిపోయిన ఆరోపణలనే చేస్తున్నాయి. తాజాగా.. రైతుల మద్దతు ధర విషయంలోనూ వాటి రంకెలు తారాస్థాయికి చేరాయి.
రైతులకు అడుగడుగునా అండగా ఉన్నా విపక్షాల ఆర్తనాదాలు మామూలుగా లేవు. ఎందుకంటే.. రైతుకు తాను పండించిన ప్రతీ పంటకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) దక్కేలా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తుంటే వాస్తవాలు తెలుసుకోకుండా విపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి.. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను 99.5 శాతం తుచ తప్పకుండా అమలుచేస్తున్న ప్రభుత్వంపై నిరంతరం బురద జల్లుతూ ఈనాడు అబద్ధాలను అచ్చేస్తోంది. ఈ క్షుద్ర పత్రిక రాసిన అంశాలనే పట్టుకుని కొందరు అవగాహన, అర్థంపర్థంలేకుండా అదే పనిగా ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలపై ‘ఫ్యాక్ట్‌చెక్’ ఏమిటంటే..
మార్కెట్‌లో జోక్యంతో రైతులకు మేలు..
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేయడమే కాదు సీఎం యాప్ ద్వారా మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మద్దతు ధర దక్కేలా సీఎం జగన్ సర్కారు చేస్తోంది. మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ కింద వ్యాపారులతో పోటీపడి కొనుగోలు చేయడం ద్వారా రైతులకు మద్దతు ధర దక్కేలా చేసింది.
పొగాకు, పత్తితో జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు, వేరుశనగ, పసుపు, ఉల్లి, టమాటా తదితర పంట ఉత్పత్తులకు మద్దతు ధర దక్కని ప్రతీసారి మార్కెట్‌లో జోక్యం చేసుకుని కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోంది. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించని మిర్చి, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, చీనీ వంటి పంటలకు దేశంలో మద్దతు ధర ప్రకటించడమే కాదు..ఆ ధరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తగ్గకుండా చూసింది. ఉదా.. మిరపకు రూ.7వేలు, పసుపుకు రూ.6,850, ఉల్లికి రూ.770, చిరుధాన్యాలకు రూ.2,500, అరటికి రూ.800, బత్తాయికి రూ.1,400 వచ్చేలా చూస్తోంది.
మద్దతు ధర కల్పనకు పంచసూత్రాలు..
మద్దతు ధర కల్పించే విషయంలో ధాన్యంతో సహా పంట ఉత్పత్తులను ఆర్బీకేల ద్వారానే రైతుల నుంచి మాత్రమే కొనేలా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ తీసుకోవటం, కొనుగోళ్లలో చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యమివ్వడం, నాణ్యతకు పెద్దపీట వేయడం, నేరుగా రైతు ఖాతాల్లోకే నగదు జమ అనే పంచ సూత్రాలను నిక్కచ్చిగా అమలుచేస్తూ విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది.
ఇలా ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల ఫలితంగా ప్రస్తుతం వ్యవసాయ, వాణిజ్య పంట ఉత్పత్తులకు మార్కెట్‌లో ఎమ్మెస్పీకి మించి ధరలు పలుకుతున్నాయి. దీంతో ఈ ఏడాది కొనుగోలు చేయాల్సిన అవసరం పెద్దగా కన్పించడంలేదు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఈ 57 నెలల్లో ధరలు పడిపోయినపుడు ఈ రకమైన భరోసా ఇవ్వడంతో మార్కెట్లో ధరలు స్థిరపడ్డాయి. చంద్రబాబు హయాంలో రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఐదేళ్లలో ఏ ఒక్క బడ్జెట్‌లోనూ పైసా కూడా ప్రత్యేకంగా కేటాయించిన పాపాన పోలేదు.
గతంలో అరకొరగా ధాన్యం సేకరణ..
నిజానికి.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ గతంలో సేకరణ కేంద్రాలకే పరిమితం అయ్యేది. అవికూడా అరకొరగానే ఉండేవి. దీన్ని పూర్తిగా మారుస్తూ నేరుగా ఫాంగేట్ వద్దే ఆర్బీకేల పర్యవేక్షణలో రైతుల భాగస్వామ్యంతో ధాన్యం కొనుగోలు ఈ ప్రభుత్వంలో హయాంలోనే జరుగుతోంది. రైస్‌మిల్లు ఎంపికలో మిల్లర్లను సంప్రదించాల్సిన అవసరంలేకుండా చేసింది. కొనుగోలు కేంద్రం వారే బ్యాంకు గ్యారంటీ లభ్యత, ధాన్యం రకం, మిల్లు లక్ష్యము, మిల్లు దూరం వంటి అంశాల ఆధారంగా ఆటోమేటిక్ పద్ధతిలో ఎంపిక చేసి రవాణా చేస్తోంది.
బాబు కంటే రెట్టింపు కొనుగోలు..
ఇక పంట ఉత్పత్తుల కొనుగోలు విషయానికి వస్తే టీడీపీ తన ఐదేళ్లలో 3.74 లక్షల మంది రైతుల నుంచి రూ.3,322 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల ఉత్పత్తులు కొనుగోలు చేస్తే.. సీఎం వైఎస్ జగన్ హయాంలోని ఈ 57 నెలల్లో 6.18 లక్షల మంది రైతుల నుంచి రూ.7,757.87 కోట్ల విలువైన 21.61 లక్షల టన్నుల ఉత్పత్తులు కొనుగోలు చేసింది. అంటే.. రెట్టింపు కన్నా అధికం. చరిత్రలో ఎన్నడూలేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన పత్తిని సైతం ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది. పోనీ ధాన్యం రైతులకైనా చంద్రబాబు మేలు చేశాడా అంటే అదీలేదు.
టీడీపీ ఐదేళ్లలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,237 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, ఈ 57 నెలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం రైతు క్షేత్రాల నుంచి ఆర్బీకేల ద్వారా 37.34 లక్షల మంది రైతుల నుంచి 3.38 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు రూ.65 వేల కోట్లు చెల్లించింది. టీడీపీ హయాంలో ధాన్యం, ఇతర పంటల కొనుగోలుకు రూ.43,559 కోట్లు వెచ్చిస్తే, ఈ ప్రభుత్వం ఈ 57 నెలల్లో ఏకంగా రూ.72,445 కోట్లు ఖర్చుచేసింది. అంటే.. సగటున ఏడాదికి చంద్రబాబు హయాంలో రూ.8,711 కోట్లు వెచ్చిస్తే, జగన్ ప్రభుత్వం ఏటా సగటున రూ.16,099 కోట్లు వెచ్చించింది. అంటే.. బాబు ఐదేళ్లతో పోలిస్తే ఈ 57 నెలల్లో రెట్టింపు విలువైన పంట ఉత్పత్తులను వైఎస్ జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది.
‘జీఎల్టీ’ భరిస్తున్న ఏకైక ప్రభుత్వం..
మరోవైపు.. ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతు పొలం నుంచే నేరుగా కొనుగోలుకు అయ్యే జీఎల్‌టీ (గన్నీ బ్యాగ్‌లు, లేబర్, ట్రాన్స్‌పోర్టు) ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది. ధాన్యం కొనుగోలు సందర్భంలో టన్నుకు రూ.2,523 (గోనె సంచులకు రూ.1,750, కూలీలకు రూ.220, రవాణా ఛార్జీలకు రూ.468తో పాటు ఒకసారి వాడిన గోనె సంచులకు రూ.85), ఇతర పంట ఉత్పత్తుల సేకరణ సందర్భంలో క్వింటాకు రూ.418 చొప్పున భరిస్తోంది.
ఇక గోనె సంచుల, హమాలీ, రవాణా చార్జీలకు సంబందించి 2022–23 పంట కాలానికి 15,74,285 మంది రైతుల ఖాతాలకు రూ.237.11 కోట్లు జమచేయగా, ఖరీఫ్ 2023–24 పంట కాలానికి సంబంధించి ఇప్పటివరకు 6,83,825 మంది రైతుల ఖాతాలకు రూ.91.47 కోట్లు జమచేశారు. గతంలో ఈ పరిస్థితిలేదు. ఇలా గోతాలు, కూలీలు, రవాణా ఖర్చుల (జీఎల్‌టీ) రూపంలో ఎకరాకు రూ.10 వేల వరకు ప్రభుత్వమే భరిస్తోంది. కానీ, గతంలో రైతులకు గోనె సంచులను సమకూర్చే పనిని గతంలో మిల్లర్లకు వదిలేసేవారు. అవి సరిపడా దొరక్క రైతులు చాలా ఇబ్బందులు పడేవారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక దీనికి చెక్ పెట్టింది. ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, పీఎస్‌ఏలు రైతులకు గోనె సంచులను సమకూరుస్తున్నాయి. పైగా.. సేకరించిన ధాన్యాన్ని గతంలో రవాణా అనేది గందరగోళంగా ఉండేది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందుల్లేవు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొన్ని ఏజెన్సీలను, రవాణాదారులను నియమించింది. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సజావుగా కొనుగోలు చేసిన ధాన్యం రవాణా కొనసాగుతోంది. ఇంత చేస్తున్నా దీన్ని మొక్కుబడిగా కొనుగోలు, నామమాత్రపు కొనుగోలు అంటారా? ధరల స్థిరీకరణ ద్వారా మద్దతు ధర కల్పన విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తుంటే వాస్తవాలు తెలుసుకోకుండా విపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment