సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నదాతలకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే ఆదర్శవంతంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంలో మరింత మంది రైతులకు మేలు చేకూర్చేలా మరిన్ని సంస్కరణలు తెచ్చారు.
నోటిఫై చేసిన పంటలు ఏ కేటగిరీ కింద సాగైనా ఒకే రీతిలో బీమా రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టారు. మరో వైపు కొన్ని జిల్లాల్లో పెరిగిన సాగు విస్తీర్ణాన్నిబట్టి కొత్త పంటలను బీమా పరిధిలోకి తెచ్చారు. ఈ మేరకు మార్గదర్శకాల్లో మార్పులు చేయడమే కాకుండా, ప్రస్తుత వ్యవసాయ సీజన్ నుంచే అమల్లోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రైతులపై పైసా భారం పడకుండా ఈ క్రాప్‌లో నమోదే ప్రామాణికంగా నోటిఫై చేసిన పంటలకు యూనివర్సల్ బీమా కవరేజ్‌ను కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఒక సీజన్‌కు సంబంధించిన బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ప్రారంభానికి ముందే చెల్లిస్తోంది. ఇలా 2019లో శ్రీకారం చుట్టిన ఈ పథకం ద్వారా గడిచిన 4 ఏళ్లలో 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్ల పరిహారం చెల్లించింది.
పరిహారం లెక్కింపులో పారదర్శకత కోసమే
సాధారణంగా ఇరిగేటెడ్, నాన్ ఇరిగేటెడ్ కేటగిరీల్లో పంటలు సాగవుతుంటాయి. పూర్వం నుంచి ఇరిగేటెడ్ (నీటి వసతి కల్గిన) విభాగంలో సాగయ్యే పంటలను దిగుబడి ఆధారితంగా, నాన్ ఇరిగేటెడ్ (వర్షాధారం) కేటగిరిలో సాగయ్యే పంటలను వాతావరణ ఆధారితంగా పరిగణనలోకి తీసుకొని బీమా కవరేజ్ కల్పిస్తున్నారు. దిగుబడి ఆధారిత పంటలకు వాస్తవ, హామీ దిగుబడిలోని వ్యత్యాసాల ఆధారంగా, వాతావరణ ఆధారిత పంటలకు ప్రతికూల, సాధారణ వాతావరణ పరిస్థితుల్లోని వ్యత్యాసాలను బట్టి బీమా పరిహారం లెక్కిస్తారు.
స్థానికంగా ఉండే నీటి వసతినిబట్టి కొన్ని జిల్లాల్లో ఒకే పంట రెండు కేటగిరిల్లోనూ సాగవుతుంటుంది. దీంతో ఒకే జిల్లాలో ఒకే పంటకు సాగయ్యే విధానాన్ని బట్టి రెండు విధాలుగా బీమా కవరేజ్ కల్పిస్తూ నోటిఫై చేయాల్సి వచ్చేది. ఫలితంగా పక్క పక్క సర్వే నంబర్లలో సాగయ్యే ఒకే పంటకు ఒకే పంట కాలంలో కొంత వాతావరణ, మరికొంత దిగుబడి ఆధారంగా లెక్కించి పరిహారం చెల్లించాల్సి వచ్చేది. ఫలితంగా జరిగిన పంట నష్టం ఒకటే అయినా, పరిహారంలో వ్యత్యాసాలు ఉండేవి.
ఉదాహరణకు నోటిఫైడ్ జిల్లాల్లో ప్రధానంగా పత్తి, వేరుశనగ పంటలు 95 శాతం విస్తీర్ణంలో వర్షాధారం, 5 శాతం నీటి వసతి కింద, మిరప 85 శాతం నీటి వసతి, 15 శాతం వర్షాధారం కింద సాగవడం వలన ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిలో పరిహారం ఉండేది. ఖరీఫ్‌లో నోటిఫై చేసిన పసుపు పంటకు కృష్ణా జిల్లాలో వాతావరణ ఆధారంగా, అల్లూరి సీతారామరాజు, వైఎస్సార్ జిల్లాల్లో దిగుబడి ఆధారంగా పరిగణించేవారు.
ఇలా మిరప, పత్తి, పసుపు, జొన్న, వేరుశనగ వంటి పంటల విషయంలో పూర్వం నుంచి రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పరిహారం లెక్కింపు, పంపిణీలో అసమానతలు తొలగించడమే లక్ష్యంగా పంటల బీమా మార్గదర్శకాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇక నుంచి నోటిఫై చేసిన జిల్లాల్లో ఖరీఫ్‌లో మిరప, పసుపు జొన్న పంటలు ఏ కేటగిరీ కింద సాగైనా పూర్తిగా దిగుబడి ఆధారంగానే పరిగణిస్తారు. పత్తి, వేరుశనగ పంటలను పూర్తిగా వాతావరణ ఆధారితంగా పరిగణిస్తారు.
అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విస్తారంగా సాగవుతున్న ఆముదం పంటను కొత్తగా పంటల బీమా పరిధిలోకి తెచ్చారు. నోటిఫైడ్ జిల్లాల్లో దానిమ్మ, బత్తాయి, నిమ్మ, జీడిమామిడి పంటలను వాతావరణ ఆధారిత బీమా పరిధిలోకి తీసుకొచ్చారు. నాటిన మూడో ఏడాది నుంచి దానిమ్మకు, నాలుగో ఏడాది నుంచి బత్తాయి పంటకు ఖరీఫ్‌లోనూ, మూడో ఏడాది నుంచి జీడిమామిడి, నాలుగో ఏడాది నుంచి నిమ్మ తోటలకు రబీలోనూ బీమా రక్షణ కల్పిస్తారు.
2023–24 సీజన్ కోసం నోటిఫికేషన్ జారీ
వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక తొలి ఏడాది పీఎంఎఫ్‌బీవైతో కలిసి బీమా పథకం అమలు చేయగా, యూనివర్సల్ కవరేజ్‌కు కేంద్రం విముఖత చూపడంతో ఆ తర్వాత రెండేళ్ల పాటు కంపెనీలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే పరిహారం చెల్లించింది. ఈ క్రాప్ ప్రామాణికంగా యూనివర్సల్ కవరేజ్‌కు కేంద్రం దిగి రావడంతో 2022–23 సీజన్ నుంచి దిగుబడి ఆధారిత పంటలకు పీఎంఎఫ్‌బీవైతో అనుసంధానించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలు చేస్తోంది.
వాతావరణ ఆధారిత పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా బీమా రక్షణ కల్పిస్తోంది. 2023–24 సీజన్ కోసం దేశంలోనే అత్యల్ప ప్రీమియంతో బీమా కవరేజ్‌కు ముందుకొచ్చిన కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. జిల్లాలవారీగా కవరేజ్ కల్పించే కంపెనీలతో పాటు నోటిఫైడ్ పంటల వివరాలతో ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేసింది.
ఖరీఫ్–2023లో 15 పంటలకు దిగుబడి ఆధారంగా, 6 పంటలకు వాతావారణ ఆధారంగా, రబీ 2023–24లో 13 పంటలకు దిగుబడి ఆధారంగా, 4 పంటలకు వాతావరణ ఆధారంగా నోటిఫికేషన్ జారీ చేసింది. దిగుబడి ఆధారిత పంటలకు ఖరీఫ్‌లో గ్రామం, మండల, జిల్లా యూనిట్‌గా బీమా కవరేజ్ కల్పిస్తుండగా, వాతావరణ ఆధారిత పంటలకు మాత్రం మండలం యూనిట్‌గా బీమా కవరేజ్ కల్పిస్తున్నారు.
అసమానతలకు తావులేకుండా..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పంటల బీమా లెక్కింపు, పరిహారం చెల్లింపుల్లో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు పంటల బీమా మార్గదర్శకాల్లో కీలకమైన మార్పులు తీసుకొచ్చాం. నీటి వసతి, వర్షాధారం ప్రాతిపదికన కాకుండా ఇక నుంచి పూర్తిగా వాతావరణ, దిగుబడి ఆధారంగానే పంటలకు బీమా రక్షణ ఉంటుంది. నోటిఫై చేసిన జిల్లాల్లో నోటిఫై చేసిన పంటలు నష్టపోయే రైతులకు ఒకే రీతిలో పరిహారం దక్కు తుంది. లెక్కింపులో, చెల్లింపుల్లో ఎలాంటి అసమానతలు ఉండవు. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ
Comments
Please login to add a commentAdd a comment