బీజేపీ ఎంపీ బండి సంజయ్
వడగళ్ల బాధిత రైతులకు పరామర్శ
ముస్తాబాద్/గంభీరావుపేట(సిరిసిల్ల): వడగళ్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న పంటలకు రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని, ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో సర్వేలు, సమీక్షలు, నివేదికల పేరుతో కాలయాపన చేయొద్దన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట, ముస్తాబాద్, పోతుగల్, గన్నెవారిపల్లెల్లో ఇటీవల వడగళ్లు, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను బండి సంజయ్ బుధవారం పరిశీలించి, రైతులను ఓదార్చారు.
గత ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని అమలుచేసి ఉంటే ఇప్పుడు అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడేవారు కాదని అభిప్రాయపడ్డారు. పంటల బీమా పేరుతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందన్నారు. ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పుడయినా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయకుండా నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.25 వేల పరిహారం చెల్లించాలని కోరారు.
ఎన్నికల కోడ్ వచ్చిందన్న కారణం చెప్పకుండా.. రైతులను ఆదుకునేందుకు ఎన్నికల కమిషన్‌తో మాట్లాడి సాయం చేయాలని సూచించారు. కాగా, ఈ ప్రభుత్వమైనా ఫసల్‌బీమాను అమలు చేస్తుందో.. లేదో చెప్పాలని కోరారు. కౌలు రైతులకు రూ.12 వేల సాయంపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ స్తంభం కూలి మృతిచెందిన ముస్తాబాద్‌కు చెందిన రైతు ఎల్సాని ఎల్లయ్య కుటుంబాన్ని పరామర్శించి, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సిరిసిల్ల బీజేపీ ఇన్‌చార్జి రాణిరుద్రమ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి, పలువురు స్థానిక నేతలు బండి సంజయ్ వెంట ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment