Andhra Pradesh: లంక భూములు గట్టెక్కాయి | Ground report by representative of Sakshi from lands of Lanka | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: లంక భూములు గట్టెక్కాయి

Published Tue, Nov 14 2023 4:18 AM | Last Updated on Tue, Nov 14 2023 10:38 AM

Ground report by representative of Sakshi from lands of Lanka

బాపట్ల జిల్లా కొల్లూరు మండలం చింతల్లంక గ్రామంలోని లంక భూములు

మా తాత నుంచి నాకు అర ఎకరం పొలం వచ్చింది. కాగితాలు లేకపోవడంతో ఆ భూమిపై మాకు ఎలాంటి హక్కు లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇందు­కోసం చాలా డబ్బు ఖర్చు చేశాం. జగన్‌ ప్రభుత్వం వచ్చాక పైసా ఖర్చు లేకుండా మా భూమికి పట్టా ఇస్తు­న్నారు. ఆయనకు రుణపడి ఉంటాం. 
– తోడేటి నాంచారయ్య, చింతల్లంక, కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా

((బాపట్ల జిల్లా కొల్లూరు, భట్టిప్రోలు నుంచి సాక్షి ప్రతినిధి బి.ఫణికుమార్‌)): ఇది నిన్న, మొన్నటిది కాదు.. కొన్ని దశాబ్దాలు, తరాల సమస్య. గోదావరి, కృష్ణా నదుల పరీవాహక ప్రాంతాల్లో లంక భూములను సాగు చేసుకుంటున్న రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఏడాదికి మూడు పంటలు పండే ఈ భూములు ఎంతో విలువైనవి. అయితే వాటికి కాగితాలు, పాస్‌ బుక్‌లు లేకపోవడంతో రైతులు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. వ్యవసాయ రుణాలు, రైతులకు అందే ఇతర ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు లభించేవి కావు. తమ సమస్యను పరిష్కరించాలని రైతులు దశాబ్దాల నుంచి ప్రజాప్రతినిధులను, అధికారులను కలుస్తూనే ఉన్నారు.

అయితే ప్రయోజనం శూన్యం. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక లంక రైతుల సమస్యపై దృష్టి సారించింది. మొత్తం 8 జిల్లాల్లో ఏకంగా 9,062 ఎకరాలకు పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయంతో 17,768 మంది లబ్ధిదారుల కుటుంబాల్లో వెలుగులు ప్రసరించనున్నాయి.

వీరు సాగుచేసుకుంటున్న భూములకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ నెల 17న పట్టాలివ్వనున్నారు. సాక్షి బృందం బాపట్ల జిల్లా కొల్లూరు, భట్టిప్రోలు మండల్లాలోని దోనేపూడి, జువ్వలపాలెం, సుగ్గునలంక, చింతల్లంక, చిలుమూరు లంక, వెల్లటూరు, పెదపులివర్రు, పెదలంక, ఓలేరు తదితర లంక గ్రామాల్లో పర్యటించినప్పుడు అక్కడి రైతులు ఇన్నేళ్లుగా తాము పడిన బాధలను పంచుకున్నారు.

తమ జీవితకాలంలో ఈ సమస్య పరిష్కారమవుతుందని అనుకోలేదని.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దీన్ని సులువుగా పరిష్కరించారని కొనియాడారు. ఆయన మేలును మరిచిపోలేమని భావోద్వేగానికి గురయ్యారు. దళితులంటే ఆయనకు ఎంత అభిమానమో లంక భూముల సమస్య పరిష్కారంలోనే అర్థమవుతోందని కన్నీటి పర్యంతమయ్యారు. కాగా ఒక్క కొల్లూరు మండలంలోనే 710 మంది రైతులకు 295 ఎకరాలకు సంబంధించి సీఎం వైఎస్‌ జగన్‌ పట్టాలు అందించనున్నారు.  

లంక భూముల కథ ఇది.. 
కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో ఒండ్రు మట్టి ఒక చోటకు చేరడంతో ఏర్పడ్డ సారవంతమైన భూములే.. లంక భూములు. కృష్ణా, ఎనీ్టఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో తరతరాలుగా రైతులు వాటిని సాగు చేసుకుంటున్నారు. అయితే ఈ భూములకు సంబంధించి వేలాది మంది రైతులకు పట్టాలు లేవు. తమకు పట్టాలు ఇవ్వాలని కొన్ని దశాబ్దాలుగా అక్కడి రైతులు ప్రభుత్వాలను కోరుతూ వచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షణలు చేసినా ఫలితం శూన్యం.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు సిద్ధమైంది. వివాదాల్లేకుండా సాగు చేసుకుంటున్న అర్హులకు పట్టాలు ఇచ్చేందుకు వీలుగా లంక భూముల అసైన్డ్‌ నిబంధనలు సవరించింది. ఈ భూములను మూడు కేటగిరీలుగా గతంలోనే విభజించింది. గట్టుకు దగ్గరగా ఉండి వరద వచ్చినా కొట్టుకుపోని భూమిని ఏ కేటగిరీగా, ఏ కేటగిరీకి ఆనుకుని కొంత నదిలోకి ఉన్న భూమిని బి కేటగిరీగా, ఏ, బీ కేటగిరీకి ఆనుకుని వరదలు వస్తే పూర్తిగా మునిగిపోయే భూమిని సీ కేటగిరీగా వర్గీకరించింది. ఏ, బీ కేటగిరీ భూములకు పట్టాలు, సీ కేటగిరీ భూములకు లీజు పట్టాలు ఇవ్వనుంది.  

మా ఇంటికి వెలుగు తెచ్చారు.. 
50 ఏళ్లకు ముందు నుంచి ఎకరం భూమిని లంకలో సాగు చేసుకుంటున్నాం. కానీ కాగితాల్లో మాత్రం అది మా భూమి కాదని ఉంది. దానిపై కనీసం బ్యాంకు రుణం ఇమ్మన్నా ఇచ్చేవారు కాదు. ప్రజాప్రతినిధులను, అధికారులను ఎన్నోసార్లు కలిసి న్యాయం చేయాలని అడిగినా పట్టించుకోలేదు. ఇప్పుడు జగనన్న వచ్చాక మా ఇంటికి వెలుగు తెచ్చారు. మా భూమికి పట్టా ఇస్తున్నారు. 
– తోడేటి రత్నాకరరావు, చింతల్లంక, కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా 

నాలాంటి ఎంతోమంది కష్టాలను తీర్చారు.. 
నాకున్న ఎకరం భూమికి కాగితాలు, పాస్‌బుక్‌లు ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు జగనన్న నా భూమికి పట్టా ఇస్తున్నారు.. ఎంతో ఆనందంగా ఉంది. లంకల్లో నాలాంటి ఎంతో మంది కష్టాలను తీరుస్తున్నారు. ఆయన మేలు మర్చిపోలేం  
– ఈపూరి ఏబేలు, చింతల్లంక, కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా  

ఎప్పటికీ మా బాధ తీరదనుకున్నాం.. 
మేం సాగు చేసుకుంటున్న లంక భూములంటే అందరూ చిన్నచూపు చూసేవారు. ఎంతో విలువైన భూమి ఉన్నా దానికి కాగితాలు లేవు. ఎప్పటికీ మా బాధ తీరదనుకున్నాం. జగన్‌ సీఎం అయ్యాకే లంక భూముల సమస్యపై దృష్టి పెట్టారు. ఆయన వచ్చినప్పటి నుంచి మా సమస్య పరిష్కారమవుతుందనే నమ్మకం ఉండేది. మేం ఆశించినట్లుగానే ఎవరూ చేయని పనిని ఆయన చేసి మాకు న్యాయం చేశారు.  
– బొజ్జా రమేశ్, వెల్లటూరు, భట్టిప్రోలు మండలం, బాపట్ల జిల్లా 

పేదల దేవుడినని నిరూపించారు.. 
మేం జీవించి ఉండగా ఈ సమస్య పరిష్కారమవుతుందని అనుకోలేదు. ఇంత క్లిష్టమైన సమస్యను సీఎం జగన్‌ చాలా తేలిగ్గా పరిష్కరించారు. లంక భూములకు దారి చూపించి తాను పేదల దేవుడినని నిరూపించారు.  
– ఏలూరి శేషగిరిరావు, వెల్లటూరు, భట్టిప్రోలు మండలం, బాపట్ల జిల్లా  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement