ఎటుచూసినా ఎండిపోయిన పంటలు.. బీడుపడిన భూములే! | Deficit rainfall in all districts except Srikakulam | Sakshi
Sakshi News home page

కరువు గుప్పిట్లో రాష్ట్రం..

Published Mon, Oct 22 2018 3:29 AM | Last Updated on Mon, Oct 22 2018 11:18 AM

Deficit rainfall in all districts except Srikakulam - Sakshi

కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం వీరాపురం గ్రామంలో నీరులేక ఎండిపోయిన వరి పైరు

సాక్షి, అమరావతి: కనుచూపు మేరలో ఎటు చూసినా ఎండిపోయిన పంటలు.. బీడుపడిన భూములే. చిన్న కొండల్లా గడ్డివాములుండాల్సిన రైతుల కళ్లాలన్నీ బోసిపోతున్నాయి. మేతలేక లారీల్లో కబేళాలకు తరలుతున్న పశువులు.. చినుకు జాడలేక, బతుకుతెరువు కనిపించక కంటతడి పెట్టుకుంటున్న రైతన్నలు... రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు ఇతర జిల్లాల్లో కనిపిస్తున్న హృదయవిదారక దృశ్యాలివీ. రాష్ట్రంలో కరువు విలయతాండవానికి ప్రత్యక్ష నిదర్శనాలవీ. రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్షం వల్ల పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఖరీఫ్‌ ఆరంభంలో జూన్‌లో కురిసిన వర్షాలను చూసి రైతులు శ్రమకోర్చి విత్తిన పంటలు తదుపరి చినుకు జాడలేక పూర్తిగా ఎండిపోయాయి. రాష్ట్రంలో దాదాపు 80 శాతం మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని అనధికారిక గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ పంట చేతికి రాకుండాపోయింది. పత్తి, కంది, ఉల్లి, సజ్జ, మొక్కజొన్న తదితర పంటలతోపాటు టమోటా, మిరప తదితర కూరగాయల తోటలు మాడిపోయాయి. పంటల సాగుకోసం అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన అన్నదాతలు కుంగిపోతున్నారు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక దిక్కులు చూస్తున్నారు. సెప్టెంబరుతో ముగిసిన ఖరీఫ్‌లోనే కాకుండా ప్రస్తుత రబీ సీజన్‌లోనూ తీవ్ర దుర్బిక్ష పరిస్థితులే కొనసాగుతున్నాయి.  

కురవాల్సిన దాంట్లో సగం వర్షమే 
ఖరీఫ్‌లో వరుస కరువుల వల్ల సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోతోంది. అధికారిక గణాంకాల ప్రకారమే.. రాష్ట్రంలో జూన్‌ 1తో ఆరంభమైన ఖరీఫ్‌ సీజన్‌లో ఇప్పటిదాకా(అక్టోబరు 21) కురవాల్సిన కనీస సగటు వర్షం కంటే 27.4 శాతం తక్కువ కురిసింది. వైఎస్సార్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో కనీసం కురవాల్సిన దానిలో సగం వర్షమే కురవడం గమనార్హం. రాష్ట్రంలో 689.4 మిల్లీమీటర్ల కనీస సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 500.8 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. జూన్‌ 1 నుంచి ఇప్పటివరకూ  శ్రీకాకుళం జిల్లా మినహా అన్ని జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలోనూ లోటు వర్షపాతమే ఉండేది. అక్టోబర్‌ రెండోవారంలో తిత్లీ తుపాన్‌ వల్ల కురిసిన భారీ వర్షంతో అక్కడ 7.3 శాతం అధిక వర్షపాతం నమోదైంది.  

ముప్పావు ప్రాంతంలో దుర్భిక్షమే 
అధికారిక వర్షపాత గణాంకాల ప్రకారం... రాష్ట్రంలో ముప్పావు ప్రాంతంలో తీవ్ర కరువు నెలకొంది. రాష్ట్రంలో మొత్తం 670 మండలాలుండగా, 470 మండలాల్లో కురవాల్సిన కనీస వర్షం కంటే 19  నుంచి 52.9 శాతం తక్కువ వర్షం పడింది. శ్రీకాకుళం మినహా అన్ని జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉన్నప్పటికీ.. సాధారణం కంటే 19 శాతం మించి తక్కువ వర్షం కురిస్తేనే ప్రభుత్వం లోటు వర్షపాత మండలాలుగా గుర్తిస్తుంది. అందువల్లే వర్షాభావ మండలాల జాబితాలో 470 మండలాలే ఉన్నాయని, లేకపోతే 600కు పైగా ఉండేవని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో కేవలం 19 మండలాల్లోనే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. 

రైతుల కష్టాలపై కనికరం లేని సర్కారు 
రాష్ట్రంలో 470 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఖరీఫ్‌ సీజన్‌లో కేవలం 296 మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించి చేతులు దులుపుకుంది. కరువు వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తోంది. గత ఏడాది రెయిన్‌గన్లతో ఒక్క సెంటు కూడా పంటలు ఎండిపోకుండా కాపాడామని ప్రచారం చేసుకున్న ప్రభుత్వం ఈ ఏడాది రెయిన్‌ గన్ల ఊసే ఎత్తడం లేదు.  

రూ.2,250 కోట్ల పెట్టుబడి మట్టిపాలు 
ఎకరా పొలంలో వేరుశనగ సాగుకు సగటున రూ.15,000 ఖర్చవుతుంది. సెప్టెంబరుతో ముగిసిన ఖరీఫ్‌ సీజన్‌లో 16.50 లక్షల ఎకరాల్లో రైతులు వేరుశనగ పంట వేయగా, 15 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. దీనివల్ల రైతులు ఈ పంట సాగు కోసం పెట్టిన రూ.2,250 కోట్ల పెట్టుబడి మట్టిపాలైంది. 
- 2016 ఖరీఫ్‌లో 450 మండలాల్లో వర్షాభావ పరిస్థితి ఉండగా ప్రభుత్వం 301 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. 
- 2017 ఖరీఫ్‌ సీజన్‌లో ఆగస్టు మూడో వారం వరకూ 241 మండలాల్లో వర్షాభావ పరిస్థితి ఉండేది. ఆగస్టు చివరల్లోనూ, సెప్టెంబరులోనూ అల్పపీడనాల వల్ల వర్షం కురవడంతో లోటు వర్షపాత మండలాల సంఖ్య 93కు తగ్గింది. అయితే ప్రభుత్వం ఒక్క మండలాన్ని కూడా కరువు ప్రాంతంగా ప్రకటించలేదు. 
- 2018లో 470 మండలాల్లో  వర్షాభావ పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం 296 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. 
- 2016లో 38.62 లక్షల హెక్టార్లలో పంటలు సాగుకాగా, 301 మండలాలను దుర్భిక్ష ప్రాంతాలుగా ప్రకటించారు. ఈ ఏడాది 3 లక్షల హెక్టార్లలో పంటల సాగు తగ్గినా కరువు మండలాలను పెంచాల్సిందిపోయి తగ్గించడం గమనార్హం. 

రబీలో 12 జిల్లాల్లో లోటు వర్షపాతమే 
రాష్ట్రంలో ప్రస్తుత రబీ సీజన్‌లో (అక్టోబరు 1 నుంచి 20వ తేదీ మధ్య) ఏకంగా 65 శాతం సగటు లోటు వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్రలో 61 శాతం, రాయలసీమలో 74 శాతం లోటు వర్షపాతం రికార్డయ్యింది. ఖరీఫ్‌లో కంటే రబీలో కరువు తీవ్రత మరింత అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 21 రోజుల్లో కురవాల్సిన దానికంటే 65 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కోస్తాలోని తొమ్మిది జిల్లాల్లో సగటున 109.6 మిల్లీమీటర్ల సాధారణ వర్షం కురవాల్సి ఉండగా, 43.2 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. రాయలసీమ జిల్లాల్లో 78 మిల్లీమీటర్ల కనీస వర్షం కురవాల్సి ఉండగా. 20.1 మిల్లీమీటర్లు (74 శాతం లోటు) కురిసింది. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాన్‌ వల్ల భారీ వర్షం కురవడంతో సాధారణం కంటే 66 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన 12 జిల్లాల్లో కురవాల్సిన దానికంటే చాలా తక్కువ వర్షం కురవడం గమనార్హం.  

పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదు 
‘‘వరుసగా నాలుగేళ్లు కరువు వల్ల పంటలు పండక పెట్టుబడులు కూడా చేతికి రాలేదు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో మూడు ఎకరాల్లో వేరుశనగ వేశా. వర్షాల్లేక మొక్కలు గిడసబారి పోయాయి. పెట్టిన పెట్టుబడులు పోయాయి. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి’’ 
– భాస్కర్‌రెడ్డి, రైతు, వేపలపల్లె, చిత్తూరు జిల్లా

పంటల బీమా, పెట్టుబడి రాయితీ ఇవ్వాలి
‘‘వేరుశనగ పంటే కాదు మిగిలిన పంటలూ కరువు వల్ల ఎండిపోయాయి. ఎకరాకు 15 నుంచి 20 బస్తాల వేరుశనగ రావాల్సి ఉండగా ఒకటి రెండు బస్తాలు కూడా రావడం లేదు. ప్రభుత్వం తక్షణమే పంటల బీమా, పెట్టుబడి రాయితీ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి’’  
– సరస్వతి, మహిళా రైతు, కురబలకోట, చిత్తూరు జిల్లా 

చివరకు అప్పులే మిగిలాయి
‘‘నాకున్న రెండు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశా. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చు కలిపి రెండెకరాలకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టా. జూన్‌లో కురిసిన వానకు విత్తనాలు వేశా. ఆ తరువాత వానల్లేక పైరంతా ఎండిపోయింది. రూపాయి కూడా ఆదాయం రాలేదు. చివరకు అప్పులే మిగిలాయి’’ 
– దుగ్గిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, దేవలంపల్లి, లక్కిరెడ్డిపల్లె మండలం, వైఎస్సార్‌ జిల్లా

ఇంతటి కరువు ఎన్నడూ చూడలేదు 
‘‘నాలుగేళ్లుగా పశ్చిమ ప్రకాశంలో వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోయి తీవ్రంగా నష్టపోయాం. ఈ ఏడాది కూడా వర్షాలు లేకపోవడంతో పత్తి, మిర్చి పంటలు ఎండిపోయాయి. నేను ఎకరా మిర్చి సాగు చేయగా రూ.25 వేలు పెట్టుబడి అయింది. పత్తికి రూ.12 వేల ఖర్చు వచ్చింది. వానల్లేక పంటలు ఎండిపోయాయి. పొట్టకూటి కోసం వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇంతటి కరువు గతంలో ఎన్నడూ చూడలేదు’’ 
– కె.వెంకటరెడ్డి, రైతు, వేములపేట, మార్కాపురం మండలం, ప్రకాశం జిల్లా

కబేళాలకు పశువులు.. రైతన్నల వలసలు 
దుర్బిక్షం ప్రభావం వ్యవసాయంతోపాటు పశు సంపదపైనా పడింది. పశువులకు మేత, నీరు సమకూర్చే పరిస్థితి కూడా లేక రైతన్నలు వాటిని నిస్సహాయంగా కబేళాలకు అమ్మేస్తున్నారు. కన్నబిడ్డల్లా పెంచుకున్న పాడిపశువులను కోతకు ఇవ్వడం ఇష్టంలేని కొందరు గోశాలలకు తరలిస్తున్నారు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో నీటి ఎద్దడి భయం గొలుపుతోంది. కందుకూరు, కొండెపి, వై.పాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ ఐదు నియోజకవర్గాల్లోని 320 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తేనే ప్రజలు గొంతు తడుపుకోగలుగుతున్నారు. వరుణుడి కరుణ లేక పంటలు పండక, సొంత ఊళ్లల్లో పనులు లేక రైతులు వలసబాట పడుతున్నారు. బెంగళూరు, చెన్నై, సూరత్‌ నగరాలకు చేరుకుని, కూలీ పనులు చేసుకుంటున్నారు. చాలామంది రైతులు తిరుపతి, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement