ఉపాధి కరువు
ఉపాధి కరువు
Published Wed, Nov 23 2016 12:09 AM | Last Updated on Sat, Aug 25 2018 5:17 PM
453 గ్రామాల్లో ప్రారంభం కాని పనులు
– నందికొట్కూరు, నంద్యాల మండలాల్లో శూన్యం
– అమలు కాని కలెక్టర్ ఆదేశాలు
- వలస బాటన కూలీలు
పనుల్లేక సగం ఊరు ఖాళీ
నెల రోజుల క్రితమే గ్రామంలో వ్యవసాయ పనులు పూర్తిగా ముగిసినాయి. ఈ యేడాది రైతులు సాగుచేసిన పంటలు వర్షాల్లేక ఖరీఫ్‌లో ఎండిపోయాయి. అరకొరగా వచ్చిన వేరుశనగ, పొద్దుతిరుగుడు, సజ్జ, కొర్ర తదితర పంటల దిగుబడులను రైతులు కూలీల చేత ఇంటికి తరలించుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో పనుల్లేవు. మూడు వారాల క్రితమే పనులు లేక సగం ఊరు ఖాళీ అయ్యింది. అధికారులు పనులు కల్పిస్తే స్థానికంగానే ఉపాధి ఉంటుంది.
- అల్లప్ప, ఉపాధి కూలీ, కమ్మరచేడు
కర్నూలు(అర్బన్): జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు అటకెక్కాయి. తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం 36 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కరువు మండలాల్లో ఉపాధి కూలీలకు 150 రోజుల పని కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జిల్లాలోని మెజారిటీ మండలాల్లో.. ప్రధానంగా పడమటి ప్రాంతాలైన ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆదోని నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో ఉపాధి పనులు చేపట్టని కారణంగా వలసలు అధికమయ్యాయి. వలసలను నివారించడంతో పాటు వ్యవసాయ కూలీలకు పనులు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నెల 17న జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ నెల 18వ తేదీ నుంచి కచ్చితంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. జాబ్‌కార్డులు ఉన్న వారందరికీ పనులు కల్పించేలా ఎంపీడీఓలు బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ స్పష్టంగా తెలియజేశారు. అయితే ఈ నెల 21వ తేదీ వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఉపాధి పనులు, హాజరైన కూలీల సంఖ్యను పరిశీలిస్తే ఎంతమేర జిల్లాలో ఉపాధి పనులు జరుగుతున్నాయో తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పెద్ద రైతులు తమ పొలం పనులు పూర్తి అయ్యేంత వరకు ఉపాధి పనులు ప్రారంభించవద్దని అనధికారికంగా ఆజ్ఞలు జారీ చేస్తున్న నేపథ్యంలో కూడా పలు ప్రాంతాల్లో పనులు ప్రారంభం కానట్లు తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ పనులు దాదాపు అయిపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో పనుల్లేక కూలీలు వలస బాట పట్టారు.
453 గ్రామాల్లో ప్రారంభం కాని పనులు
జిల్లాలోని 900 గ్రామాల్లో పనులు చేపట్టాల్సి ఉండగా, 447 గ్రామాల్లో మాత్రమే పనులు ప్రారంభమయ్యాయి. కాగా నందికొట్కూరు, నంద్యాల మండలాల్లో ఒక్క పని కూడా ప్రారంభం కాకపోవడం గమనార్హం. పనులు ప్రారంభం అయిన మండలాల్లో కూడా వందకు లోపు కూలీలు హాజరు కావడం సిబ్బంది పనితీరుకు అద్దం పడుతోంది.
జిల్లాలోని కొన్ని మండలాల్లో ఈనెల 21న కూలీల హాజరు ఇలా..
మండలం, హాజరైన కూలీలు సంఖ్య
మంత్రాలయం 10
గూడూరు 50
వెలుగోడు 37
బండిఆత్మకూరు 84
మహానంది 52
పాములపాడు 54
శిరివెళ్ల 41
సంజామల 53
రుద్రవరం 20
దొర్నిపాడు 18
ఉయ్యాలవాడ 22
Advertisement
Advertisement