తడారిన నేల.. ఎడారిన రైతు!
తడారిన నేల.. ఎడారిన రైతు!
Published Tue, Nov 8 2016 12:12 AM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM
- 40 రోజులుగా వర్షాభావం
- అరకొర రబీ సాగు
- ఎండుతున్న పైర్లు
- అమ్మకానికి విత్తనాలు
- పట్టించుకోని ప్రభుత్వం
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్ రైతులకు కష్టాలు, కన్నీళ్లు, అప్పులను మిగిల్చింది. రబీ అయినా ఆదుకుందనుకుంటే రైతుల కొంప ముంచింది. వర్షాభావ పరిస్థితులతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. విత్తనం పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. సాగు చేసి పైర్లు సైతం వాడుముఖం పట్టాయి. ఎన్నడూ లేనివిధంగా రబీ కూడా ఎత్తిపోయిందని వ్యవసాయాధికారులే పేర్కొంటుండం గమనార్హం.
రబీ సాధారణ సాగు 3,54,341 హెక్టార్లు ఉంది. నవంబర్ 7వ తేదీ నాటికి 1,44,762 హెక్టార్లలో సాగు చేశారు. గత ఏడాది ఇదే సమయానికి 1,98,715 హెక్టార్లలో సాగు ఉండేది. ఈ సారి బాగా తగ్గిపోయింది. దాదాపు 40 రోజులుగా వర్షాలు లేకపోవడం, భూమిలో తేమ పూర్తిగా పడిపోవడం, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల సాగు చేసిన రబీ పైర్లు దెబ్బతింటున్నాయి. అక్టోబర్ నెలలో వర్షాలు కురిస్తే ఖరీఫ్‌లో సాగైన కంది, వరి, పత్తి, మొక్కజొన్న పంటల్లో దిగుబడి బాగా వచ్చేవి.. రబీ సాగుకు అవకాశం ఏర్పడేది. అక్టోబర్ నెల సాధారణ వర్షపాతం 114.5 మి.మీ ఉండగా.. 8.9 మి.మీ మాత్రమే నమోదు అయింది. నవంబర్ నెలలో చినుకే పడలేదు.
పెట్టుబడి మట్టిపాలు..
భూమిలో తేమ లేకపోవడం, వర్షాలు లేకపోవడంతో రబీలో వేసిన శనగ, జొన్న, మినుము, ధనియాలు తదితర పైర్లు పూర్తిగా ఎండిపోయాయి. వ్యవసాయంలో కనీసం పెట్టిన పెట్టుబడులైనా దక్కితే రైతు ఊరట చెందుతాడు. పెట్టుబడిలో సగం కూడా దక్కకపోతే ఆ రైతు ఏడాది కష్టం మొత్తం వృథా అయినట్లే. ఈ ఏడాది వ్యవసాయం చేసిన రైతులందరూ పెట్టుబడులు దక్కక అప్పుల ఊబిలో కూరుకుపోయారు. రబీలో శనగ.. 1,06,526 హెక్టార్లలో వేశారు. ఇందులో 50శాతం ఇప్పటికే ఎండిపోయింది. మరో నాలుగైదు రోజుల్లో వర్షాలు లేకపోతే ఇప్పటి వరకు సాగు చేసిన పంటలు పూర్తిగా ఎండిపోయో ప్రమాదం ఉంది.
అమ్మకానికి శనగ విత్తనాలు...
సెప్టంబరు నెల చివరిలో ఆశాజనకంగా వర్షాలు పడటంతో సబ్సిడీపై తీసుకున్న శనగ విత్తనాలను అమ్ముకుంటున్నారు. ఆదోని, కర్నూలు డివిజన్‌లలో వర్షాధారంపైనే రబీ పంటలు ఎక్కువగా సాగు చేస్తారు. వర్షాలు లేక భూమి బండ మాదిరిగా తయారవడంతో రైతులు విత్తనం వేయలేకపోతున్నారు. సబ్సిడీపై తీసుకున్న విత్తనాలను అమ్మేసుకుంటున్నారు.
కంది పంట పూర్తిగా ఎండిపాయె: పెద్ద చెంచన్న, నేరడుచెర్ల, ప్యాపిలి మండలం
మాకున్న ఐదుఎకరాలకు తోడు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని..కంది పంట వేసినాం. ఎకరానికి రూ.10వేలకు పైగా పెట్టుబడి పెట్టినాం. వానల్లేక కంది పంట పూర్తిగా ఎండి పాయె. అదిగో రెయిన్‌గన్‌లు.. ఇదిగో రెయిన్‌గన్‌లు అంటుండ్రి. ఏదీ లేకపాయె. మా కష్టం దేవుడి కెరుక.
Advertisement