విజయనగరం ఫోర్ట్: మినుము పంట సాగుకు అదును ఇదేనని విజయనగరం మండల వ్యవసాయ అధికారి గాలి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మినుము సాగు విధానం, అధిక దిగుబడుల సాధనపై పలు సూచనలిచ్చారు. ఆయన మాటల్లోనే...
సాగుకు అనువైన నేలలు..
మాగాణి, మెట్ట భూములు మినుము పంటకు అనుకూలం. వరి మాగాణుల్లో నవంబర్, డిసెంబర్ నేలల్లో మినుము పంటను వేసుకోవాలి.
విత్తడం ఇలా..
మరి మాగాణాల్లో అయితే వరి కోయటానికి 4, 5 రోజుల ముందు విత్తనాలను వెదజల్లుకోవాలి. ఈ పద్ధతిలో భూమిని దుక్కి చేయడం, ఎరువులు వేయడం వంటివి చేయరాదు. అధిక మోతాదులో విత్తనాన్ని వాడాలి. మెట్ట భూముల్లో అయితే తేమను నిలుపుకోగలిగి మురుగునీరు పోయేనేలలు మినుముకు అనుకూలం. భూమిని బాగా దుక్కిచేయాలి. విత్తనం దుక్కిలో 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు వేసి భూమిలో కలియదున్నాలి. వరి మాగాణాల్లో అయితే విత్తనాలను వెదజల్లాలి. మెట్ట భూముల్లో అయితే వరుసల మ«ధ్య 30 సెంటీ మీటర్లు, మొక్కలు మధ్య 10 సెం.మీ అంతరంతో గొర్రుతో గాని సీడ్ డ్రిల్‌తో గాని విత్తాలి.
రకాలు...
ఎల్‌ఐజీ–645: ఈ రకం పంట కాలం 85 నుంచి 90 రోజులు. హెక్టారుకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. లావుపాటి పాలిసీ రకం. ఎండు తెగులను తట్టుకుట్టుంది. ఎల్.బి.జి –402:
ఈ రకం పంట కాలం 90 నుంచి 95 రోజులు. గింజలు లావుగా సాదాగా ఉంటాయి. హెక్టారుకు 8 నుంచి 9 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎండు తెగులును తట్టుకుంటుంది. ఎత్తుగా పెరిగి కలుపును అణిచి వేస్తుంది. చౌడును కొంత వరకు తట్టుకుట్టుంది.
ఎల్‌బీజీ 22: ఈ పంట రకం 85 రోజులు. హెక్టారుకు 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎండు తెగులును తట్టుకుంటుంది. ఆలస్యంగా విత్తేందుకు అనుకూలం.
ఎల్‌బీజీ–17: ఈ రకం పంట కాలం 80 నుంచి 85 రోజులు. బూడిద తెగులను తట్టుకుంటుంది. కొమ్మలు విస్తరించి పెరుగుతాయి.
ఎల్‌బీజీ– 752: ఈ రకం పంటకాలం 75 నుంచి 80 రోజులు. పల్లాకు, ఎండు తెగులను తట్టుకుంటుంది.
విత్తన మోతాదు: వరి మాగాణాల్లో అయితే ఎకరాకు 16 కేజీలు, మెట్ట భూముల్లో అయితే ఎకరాకు 10 కిలోల విత్తనం అవసం అవుతుంది. కిలో విత్తనానికి 30 గ్రాముల కార్పోసల్ఫాన్, 2.5 థైరమ్ లేదా కాప్టాన్ మందును వాడి విత్తన శుద్ధి చేయాలి.
నీటి యాజమాన్యం: వర్షాభావ పరిస్థితి ఎర్పడినప్పుడు ఒకటి రెండు నీటి తడులు పెట్టాలి. వరి మాగాణుల్లో నీటి తడి ఇవ్వవచ్చు. ఒకటి రెండు తేలిక తడులు, 30 రోజులకు, 55 రోజుల తర్వాత ఇస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు.
కలుపు నివారణ: పెండి మిథాలిన్ ద్రావణం ఎకరాకు లీటరు నుంచి లీటరన్నర ఎకరాకు విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారీ చేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చేయాలి.
సస్యరక్షణ:
మరకా మచ్చల పురుగు: ఈ పురుగు మొగ్గ, పూత, పిందె దశల్లో ఆశించి ఎక్కువ నష్టం కలుగజేస్తుంది. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్థాలను తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడు కాయలను దగ్గరగా చేర్చి గూడుగా కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తినడం వల్ల పంటకు ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. దీని నివారణకు క్లోరిఫైరిపాస్ 2.5 మి.లీ లీటరు నీటిలో కలిపి ఎకరాకు 200 లీటర్లు పిచికారీ చేయాలి.
ఎండు తెగులు: ఈ తెగులు ఆశించిన మొక్కలు వడిలి, ఎండిపోతాయి. పంటకు అధిక నష్టం కలుగుతుంది. ఈ తెగులు భూమిలో ఉన్న శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది. పైరుపై మందులను వాడి నివారించడం లాభసాటి కాదు. తెగులను తట్టుకునే రకాలు వేసుకోవాలి. పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
పల్లాకు తెగులు: ఇది జెమిని వైరస్ జాతి వల్ల వచ్చే తెగులు. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు, కాయల మీద పసుపుపచ్చ మచ్చలు ఏర్పడతాయి. తొలిదశలో ఈ వైరస్ తెగులు ఆశించినట్టయితే పైరు గిడసబారిపోయి , పూతపూయక ఎండిపోతుంది. ఈ వైరస్ తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీని నివారణకు పొలంలో పల్లాకు తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. మోనోక్రోటోపాస్ 1.6 మి.లీ లీటరు నీటిలో కలిపి ఎకరాకు 200 లీటర్ల నీటిని పిచికారీ చేయాలి.
మినుము సాగుకు అదును ఇదే..
Published Mon, Dec 3 2018 2:48 PM | Last Updated on Mon, Dec 3 2018 2:48 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment