Black gram farmers
-
మినుము సాగుకు అదును ఇదే..
విజయనగరం ఫోర్ట్: మినుము పంట సాగుకు అదును ఇదేనని విజయనగరం మండల వ్యవసాయ అధికారి గాలి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మినుము సాగు విధానం, అధిక దిగుబడుల సాధనపై పలు సూచనలిచ్చారు. ఆయన మాటల్లోనే... సాగుకు అనువైన నేలలు.. మాగాణి, మెట్ట భూములు మినుము పంటకు అనుకూలం. వరి మాగాణుల్లో నవంబర్, డిసెంబర్ నేలల్లో మినుము పంటను వేసుకోవాలి. విత్తడం ఇలా.. మరి మాగాణాల్లో అయితే వరి కోయటానికి 4, 5 రోజుల ముందు విత్తనాలను వెదజల్లుకోవాలి. ఈ పద్ధతిలో భూమిని దుక్కి చేయడం, ఎరువులు వేయడం వంటివి చేయరాదు. అధిక మోతాదులో విత్తనాన్ని వాడాలి. మెట్ట భూముల్లో అయితే తేమను నిలుపుకోగలిగి మురుగునీరు పోయేనేలలు మినుముకు అనుకూలం. భూమిని బాగా దుక్కిచేయాలి. విత్తనం దుక్కిలో 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు వేసి భూమిలో కలియదున్నాలి. వరి మాగాణాల్లో అయితే విత్తనాలను వెదజల్లాలి. మెట్ట భూముల్లో అయితే వరుసల మ«ధ్య 30 సెంటీ మీటర్లు, మొక్కలు మధ్య 10 సెం.మీ అంతరంతో గొర్రుతో గాని సీడ్ డ్రిల్‌తో గాని విత్తాలి. రకాలు... ఎల్ఐజీ–645: ఈ రకం పంట కాలం 85 నుంచి 90 రోజులు. హెక్టారుకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. లావుపాటి పాలిసీ రకం. ఎండు తెగులను తట్టుకుట్టుంది. ఎల్.బి.జి –402: ఈ రకం పంట కాలం 90 నుంచి 95 రోజులు. గింజలు లావుగా సాదాగా ఉంటాయి. హెక్టారుకు 8 నుంచి 9 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎండు తెగులును తట్టుకుంటుంది. ఎత్తుగా పెరిగి కలుపును అణిచి వేస్తుంది. చౌడును కొంత వరకు తట్టుకుట్టుంది. ఎల్బీజీ 22: ఈ పంట రకం 85 రోజులు. హెక్టారుకు 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎండు తెగులును తట్టుకుంటుంది. ఆలస్యంగా విత్తేందుకు అనుకూలం. ఎల్బీజీ–17: ఈ రకం పంట కాలం 80 నుంచి 85 రోజులు. బూడిద తెగులను తట్టుకుంటుంది. కొమ్మలు విస్తరించి పెరుగుతాయి. ఎల్బీజీ– 752: ఈ రకం పంటకాలం 75 నుంచి 80 రోజులు. పల్లాకు, ఎండు తెగులను తట్టుకుంటుంది. విత్తన మోతాదు: వరి మాగాణాల్లో అయితే ఎకరాకు 16 కేజీలు, మెట్ట భూముల్లో అయితే ఎకరాకు 10 కిలోల విత్తనం అవసం అవుతుంది. కిలో విత్తనానికి 30 గ్రాముల కార్పోసల్ఫాన్, 2.5 థైరమ్ లేదా కాప్టాన్ మందును వాడి విత్తన శుద్ధి చేయాలి. నీటి యాజమాన్యం: వర్షాభావ పరిస్థితి ఎర్పడినప్పుడు ఒకటి రెండు నీటి తడులు పెట్టాలి. వరి మాగాణుల్లో నీటి తడి ఇవ్వవచ్చు. ఒకటి రెండు తేలిక తడులు, 30 రోజులకు, 55 రోజుల తర్వాత ఇస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. కలుపు నివారణ: పెండి మిథాలిన్ ద్రావణం ఎకరాకు లీటరు నుంచి లీటరన్నర ఎకరాకు విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారీ చేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చేయాలి. సస్యరక్షణ: మరకా మచ్చల పురుగు: ఈ పురుగు మొగ్గ, పూత, పిందె దశల్లో ఆశించి ఎక్కువ నష్టం కలుగజేస్తుంది. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్థాలను తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడు కాయలను దగ్గరగా చేర్చి గూడుగా కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తినడం వల్ల పంటకు ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. దీని నివారణకు క్లోరిఫైరిపాస్ 2.5 మి.లీ లీటరు నీటిలో కలిపి ఎకరాకు 200 లీటర్లు పిచికారీ చేయాలి. ఎండు తెగులు: ఈ తెగులు ఆశించిన మొక్కలు వడిలి, ఎండిపోతాయి. పంటకు అధిక నష్టం కలుగుతుంది. ఈ తెగులు భూమిలో ఉన్న శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది. పైరుపై మందులను వాడి నివారించడం లాభసాటి కాదు. తెగులను తట్టుకునే రకాలు వేసుకోవాలి. పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పల్లాకు తెగులు: ఇది జెమిని వైరస్ జాతి వల్ల వచ్చే తెగులు. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు, కాయల మీద పసుపుపచ్చ మచ్చలు ఏర్పడతాయి. తొలిదశలో ఈ వైరస్ తెగులు ఆశించినట్టయితే పైరు గిడసబారిపోయి , పూతపూయక ఎండిపోతుంది. ఈ వైరస్ తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీని నివారణకు పొలంలో పల్లాకు తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. మోనోక్రోటోపాస్ 1.6 మి.లీ లీటరు నీటిలో కలిపి ఎకరాకు 200 లీటర్ల నీటిని పిచికారీ చేయాలి. -
మినుము రైతుకు ‘మద్దతు’ కరువు
పీసీ పల్లి, న్యూస్‌లైన్ : మినుము రైతుకు ప్రభుత్వం, అధికారులు, వ్యాపారుల నుంచి మద్దతు కరువైంది. ఆరుగాలం శ్రమించి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పండించిన పంటకు రెండేళ్లుగా మద్దతు ధర లేకపోవడంతో పాటు పెట్టుబడులు పెరగడం, దిగుబడి తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించకుంటే తమ పరిస్థితి దారుణంగా ఉంటుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీసీ పల్లి మండలంలోని గుంటుపల్లి, తురకపల్లి, శంకరాపురం, మూలవారిపల్లి, పెదయిర్లపాడు, విఠలాపురం, చింతగుంపల్లి, లక్ష్మక్కపల్లి తదితర గ్రామాల్లో మినుము పంటను అధికంగా సాగు చేస్తారు. మండలంలో సాధారణంగా 1,278 హెక్టార్లలో మినుము సాగుచేయాల్సి ఉండగా, ఈ ఏడాది 1,118 ెహ క్టార్లలో సాగుచేశారు. కాగా, సకాలంలో వర్షాలు పడకపోవడంతో పంట ఏపుగా పెరగలేదు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పంట చేతికిరాగా, దిగుబడి ఆశించిన స్థాయిలో లేకుండా పోయింది. దీనికితోడు రెండేళ్లుగా మినుము పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. క్వింటా 8 వేల రూపాయలైతేగానీ రైతుకు గిట్టుబాటు కాని పరిస్థితి. కానీ, రెండేళ్లుగా క్వింటా 6 వేల రూపాయల ధర మాత్రమే పలుకుతోంది. ఈ ఏడాదైతే 4,800 రూపాయలకు పడిపోయింది. అసలే దిగుబడి తగ్గి, పెట్టుబడులు పెరిగి అప్పుల భారంతో అల్లాడుతున్న రైతుకు ఈ ఏడాది ఒకేసారి 1,200 రూపాయలు తగ్గిన మద్దతు ధర నిద్రలేకుండా చేస్తోంది. ఎకరాకు రూ.15 వేల వరకూ పెట్టుబడి... ఎకరా పొలంలో మినుము పంట సాగుచేసేందుకు ప్రస్తుతం 15 వేల రూపాయల వరకూ ఖర్చవుతోంది. గత ఏడాది ఎకరాకు 2 వేల రూపాయలున్న కౌలు ప్రస్తుతం 3 వేల రూపాయలకు పెరిగింది. అదే విధంగా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలి ఖర్చులన్నీ పెరిగాయి. కానీ, వాతావరణం అనుకూలించక ఎకరాకు రెండు నుంచి మూడు క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదు. దానిప్రకారం రైతులకు కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. 5 క్వింటాళ్లకుపైగా దిగుబడి వస్తే తప్ప పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. దీనికితోడు ఈ ఏడాది గిట్టుబాటు ధర కూడా పడిపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రైతుల ఇళ్లలోనే పంట... రెండేళ్లుగా మద్దతు ధరలు లేకపోవడంతో మినుము రైతులు పండించిన పంటను అమ్మకుండా ఇళ్లలోనే ఉంచుకున్నారు. కొంతమంది మాత్రం అప్పుల బాధ తాళలేక తక్కువ ధరకే అమ్ముకున్నప్పటికీ మిగిలినవారు మాత్రం ఈ ఏడాదైనా గిట్టుబాటు ధర వస్తుందన్న ఆశతో ఇళ్లలోనే ఉంచుకున్నారు. కానీ, మద్దతు ధర రాకపోగా, గతేడాది ఉన్న ధర కూడా 1,200 రూపాయలు తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడుల కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మద్దతు ధర కల్పించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.