సాక్షి, అమరావతి : కేవలం రూ.9.21కోట్లతో పూర్తయ్యే పని అది. కానీ, రూ.26.63కోట్లకు అంచనాలు పెంచారు. అంతటితో ఆగలేదు.. ఆయకట్టుకు చుక్క నీరు ఇవ్వకుండానే పంటలు సాగుచేసినట్లు, చివరి భూములు కావడంతో నీళ్లందక పంటలు ఎండిపోతున్నట్లు మాయమాటలు చెప్పారు. వాటిని రక్షించాలంటే కాల్వ పనులు పూర్తిచేయాలని స్కెచ్ వేశారు. అంతే.. ఆఘమేఘాలపై చక్రం తిప్పారు. ఆ పనులను తమ అనుకూల సంస్థ అయిన ‘మేఘా’కు నామినేషన్‌పై అప్పగించాలని తెలుగుగంగ సీఈపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆయన అంగీకరిస్తూ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. కానీ, అక్కడ కథ అడ్డం తిరిగింది. టెండర్లు తప్పనిసరి కావడంతో అందుకు తగ్గట్టుగా వ్యూహం మార్చారు. మరోసారి తమ అనుకూల సంస్థకే పనులు దక్కేలా నిబంధనలు రూపొందించారు. అంతే.. ఇక అక్కడ నుంచి అనుకున్నవన్నీ చకచకా జరిగిపోయాయి. రూ.17కోట్లకు పైగా కమీషన్లు రాబట్టుకోడానికి చిన్న స్కీం ముసుగులో పెద్ద స్కామ్‌కు తెరలేపిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అక్రమాల బాగోతం ఇదిగో ఇలా జరిగింది...
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలో కనుపూర్ కెనాల్ కింద 12,500 ఎకరాల చివరి ఆయకట్టు భూములకు సక్రమంగా నీళ్లందడంలేదు. డేగపూడి–బండేపల్లి లింక్ కెనాల్ పనులు పూర్తిచేసి.. కనుపూర్ కెనాల్ చివరి ఆయకట్టుకు నీళ్లందిస్తేనే 2019 ఎన్నికల్లో ప్రచారానికి వస్తానని పొదలకూరు మండలంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి 2014 ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాకాని గోవర్ధన్‌రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అనంతరం సోమిరెడ్డి ఎమ్మెల్సీ అయి మంత్రి అయ్యారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లపాటు లింక్ కెనాల్ పనులను పట్టించుకోని ఆయన తాజాగా ఎన్నికలు ముంచుకొస్తుండటంతో ఆ పనుల ద్వారా కమీషన్లు దండుకునేందుకు వాటికి పరిపాలన అనుమతి వచ్చేలా చక్రం తిప్పారు. అందుకు అవసరమైన భూసేకరణకు రూ.10.29 కోట్లను విడుదల చేయడానికి సర్కార్ అంగీకరించింది. ఆ తర్వాత కండలేరుపై ఆనకట్ట, డేగపూడి–బండేపల్లి లింక్ కెనాల్‌ను రూ.31.40కోట్లతో తవ్వే పనులకు నవంబరు 11న సర్కార్ అనుమతిచ్చింది.
నిబంధనలు అడ్డుపెట్టుకుని..
నామినేషన్ ఎత్తుగడను జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ చిత్తు చేయడంతో మళ్లీ మేఘా సంస్థకు పనులు దక్కేలా నిబంధనలు రూపొందించి ఈనెల 17న టెండర్ నోటిఫికేషన్ జారీచేసి జనవరి 4న ప్రైస్ బిడ్ తెరిచేలా మంత్రి సోమిరెడ్డి చక్రం తిప్పారు. అంతేకాదు.. పనులు చేసేటప్పుడు వాటికి అనుబంధంగా ఏవైనా అదనపు పనులు చేయాల్సి వస్తే వాటిని టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థకే నామినేషన్‌పై కట్టబెట్టాలన్న షరతు విధించారు. వాస్తవంగా కండలేరుపై ఆనకట్టను రూ.3.50 కోట్లతో.. 250 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో 9.275 కి.మీల కెనాల్‌ను, వాటిపై బ్రిడ్జిలతో కలిపి 5.71 కోట్లతో, మొత్తం రూ.9.21కోట్లతో పూర్తిచేయవచ్చునని జలవనరుల శాఖ అధికారులే చెబుతున్నారు. కానీ.. మంత్రి సోమిరెడ్డి ఒత్తిడి మేరకు అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా రూ.26.63 కోట్లకు పెంచేశారు. నిజానికి.. 2017–18 ధరల ప్రకారం ఎం–20 కాంక్రీట్ క్యూబిక్ మీటర్‌కు అయ్యే వ్యయం రూ.5143.23 మాత్రమే. కానీ.. ఈ పనుల్లో దాన్ని రూ.8247.88కు ఇష్టారాజ్యంగా పెంచేశారు. మట్టి పనుల నుంచి కాంక్రీట్ పనుల వరకూ అన్నింటా ఇదే కథ. అనుకూల సంస్థకు పనులు కట్టబెట్టేస్తే రూ.17 కోట్లకు పైగా కమీషన్లు వసూలు చేసుకోవడానికి సోమిరెడ్డి పావులు కదుపుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీన్ని బట్టి చూస్తే, ఈ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టడంలో రైతుల ప్రయోజనాల కంటే.. సోమిరెడ్డి కమీషన్ల యావే ఎక్కువగా ఉందన్నది స్పష్టమవుతోందని టీడీపీ వర్గాలే ఆరోపిస్తున్నాయి.
కమీషన్ల కోసం వ్యూహం
ఈ నేపథ్యంలో.. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆ పనులను నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్‌పై కట్టబెట్టి భారీఎత్తున కమీషన్లు రాబట్టుకోవడానికి మంత్రి సోమిరెడ్డి పథక రచన చేశారు. అందులో భాగంగా కండలేరు ఆనకట్ట, 9.275 కిమీల పొడవున డేగపూడి–బండేపల్లి కెనాల్ తవ్వకం పనులను మేఘా సంస్థకు నామినేషన్ పద్ధతిలో అప్పగించాలని తెలుగుగంగ సీఈ ఆర్.మురళీనాథ్‌రెడ్డిపై సోమిరెడ్డి ఒత్తిడి తెచ్చారు. మంత్రి సూచనలతో.. ఆ పనులు రూ.26.63 కోట్లకు తమకు నామినేషన్‌పై అప్పగిస్తే.. మూడు నెలల్లో పూర్తిచేస్తామని ఈనెల 12న సీఈకి మేఘా సంస్థ లేఖ రాసింది. అలాగే, మంత్రి ఒత్తిడి చేయడంతో.. ఆ పనులను సదరు సంస్థకు నామినేషన్‌పై అప్పగించేందుకు అనుమతివ్వాలని సీఈ తన ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. కానీ, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ వాటిని తోసిపుచ్చారు. కండలేరు ఎడమ కాలువ ఎత్తిపోతల పథకాన్ని మేఘా సంస్థ ఇటీవలే పూర్తిచేసిందని.. యంత్రాలు, సామగ్రి అందుబాటులో ఉండటంవల్ల ఆ సంస్థ తక్షణమే పనులు పూర్తిచేసి, పంటలను రక్షించగలుగుతుందని తన ప్రతిపాదనల్లో సీఈ పేర్కొనడాన్ని శశిభూషణ్ తప్పుబట్టారు. నీటినే విడుదల చేయనప్పుడు పంటలు ఎలా సాగుచేశారని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అంతేకాక.. అంచనా వ్యయం రూ.మూడు లక్షలకు మించి ఉన్న పనులను నామినేషన్‌పై అప్పగించడం నిబంధనలకు విరుద్ధమని.. ఆ పనులకు టెండర్లు పిలవాల్సిందేనని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment