
సాక్షి, అమరావతి: టీడీపీ సర్కార్ పాపాల వల్ల.. గోదావరి వరదల ఉధృతికి దెబ్బతిన్న పోలవరం ప్రధాన డ్యామ్ డయాఫ్రమ్‌వాల్ (పునాది) భవితవ్యాన్ని తేల్చే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. డయాఫ్రమ్‌వాల్ సామర్థ్యాన్ని తేల్చేందుకు గతనెల 26 నుంచి ఈనెల 10వ తేదీ వరకూ ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) నిపుణుల బృందం హైరిజల్యూషన్ జియోఫిజికల్ రెసిస్టివిటీ ఇమేజింగ్, సీస్మిక్ టోమోగ్రఫీ విధానాలలో పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షల ఫలితాలను విశ్లేషించి.. ఈనెల 28లోగా రాష్ట్ర జలవనరుల శాఖ, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)లకు ఆ బృందం నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక ఆధారంగా సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) రిటైర్డ్ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలోని డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్(డీడీఆర్పీ) బృందం పోలవరం ప్రధాన డ్యామ్ డయాఫ్రమ్‌వాల్‌ను మార్చి 4న క్షేత్ర స్థాయిలో పరిశీలించనుంది.
డయాఫ్రమ్‌వాల్ సామర్థ్యం బాగున్నట్లు ఎన్‌హెచ్‌పీసీ నివేదిక ఇస్తే.. ప్రధాన డ్యామ్ పనులకు డీడీఆర్పీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఒకవేళ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఎన్‌హెచ్‌పీసీ తేల్చితే.. దాన్ని సరిదిద్దాలా? లేదంటే పాతదానికి సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్‌వాల్ నిర్మించాలా? అనే అంశాలపై సీడబ్ల్యూసీ, ఐఐటీ(ఢిల్లీ, తిరుపతి, హైదరాబాద్) ప్రొఫెసర్లతో మార్చి 5న డీడీఆర్పీ బృందం మేధోమథనం జరుపుతుంది. ఇందులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా డయాఫ్రమ్‌వాల్ భవితవ్యాన్ని తేల్చుతుంది.