పోలవరంపై వాస్తవాలు గోదాట్లో కలిపిన ‘ఈనాడు’ | Fake news of Eenadu On Polavaram Project | Sakshi
Sakshi News home page

వరదార్పణం నిర్వాకం ఎవరి‘డయా’?

Published Thu, Mar 11 2021 3:20 AM | Last Updated on Thu, Mar 11 2021 10:19 AM

Fake news of Eenadu On Polavaram Project - Sakshi

బీటలు వారిన డయాఫ్రమ్‌ వాల్‌పై ఫొటోలతో 2019 ఏప్రిల్‌ 9న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం

సాక్షి, అమరావతి: నానాటికీ దిగజారిపోతున్న చంద్రబాబుకు, టీడీపీకి గాలి కొట్టే ప్రయత్నంలో రామోజీరావు అన్నీ గాలికొదిలేస్తున్నారు. బాబు చేసిన తప్పుల్ని కప్పి పుచ్చటమే కాక... వాటిని నిస్సిగ్గుగా వేరే వారిపైకి నెట్టడానికి ఏ మాత్రం వెనకాడటం లేదు. ‘డయాఫ్రం వాల్‌ వర దార్ప ణం’ అంటూ బుధవారం ‘ఈనాడు’ వండి వార్చిన కథనం దీనికి ప్రత్యక్ష నిదర్శనం.

2018 జూన్‌లో పూర్తైన డయాఫ్రమ్‌ వాల్‌... అదే ఏడాది సీజన్‌లో వచ్చిన వరదలకు కోతకు గురై కొంతభాగం కూలిపోతే... చంద్రబాబు హయాంలో జరిగిన ఆ తప్పుల్ని కప్పిపుచ్చేసి... అదేదో హఠాత్తుగా ఇప్పుడే జరిగినట్లు ప్రజల్లో అపోహలు సృష్టించేలా కథనాన్ని సృష్టించడం ద్వారా తనకు బాబు ప్రయోజనాలు తప్ప ఏవీ పట్టవని రామోజీ మరోసారి నిరూపించుకున్నారు. ఇక ఈ కథనాన్ని పట్టుకుని టీడీపీ నేతలు కొందరు మాట్లాడిన తీరు చూస్తే... వీళ్లకు బుర్ర ఏ కాల్లో ఉందో ఎవ్వరికీ అర్థంకాదు. డయాఫ్రం వాల్‌ అప్పట్లోనే దెబ్బతిన్న విషయం గానీ... అసలెందుకు దెబ్బ తిందన్న విషయంగానీ కనీసమాత్రంగా ప్రస్తావించకపోవటమే అసలు చిత్రం. 

గోదావరి వరదను మళ్లించేలా తొలుత స్పిల్‌ వే పూర్తి చేయకుండా కమీషన్ల దాహంతో చంద్రబాబు సర్కారు డయా ఫ్రమ్‌ వాల్‌ పనులు చేపట్టడమే అది కూలిపోవడానికి ప్రధాన కారణం. టీడీపీ అధికారంలో ఉండగా కమీషన్ల కోసం పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోదీయే వ్యాఖ్యానించారంటే చంద్రబాబు అవినీతి ఏ స్థాయిలో వినుతికెక్కిందో అర్థంకాక మానదు. కేంద్రమే నిర్మిస్తే కమీషన్లు దక్కవని భావించిన చంద్రబాబు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ 2016 సెప్టెంబరు 7న పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకుని జీవనాడికి తూట్లు పొడిచారు.

కేంద్ర జలసంఘం చెప్పింది ఇదీ..
దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన పోలవరం నిర్మాణ ప్రతిపాదనలకు 2004లో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవం పోసి చిరకాల స్వప్నం సాకారం దిశగా పనులను వేగవంతం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా రామయ్యపేట, తూర్పు గోదావరి జిల్లా అంగుళూరు మధ్య గోదావరిలో వంద మీటర్ల మేర ఇసుక పొరలు మేటలు వేయడంతో కాంక్రీట్‌ నిర్మాణం చేపట్టడం కష్టమని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తేల్చింది. రామయ్యపేట సమీపంలో రాతినేల వైపు కాంక్రీట్‌ నిర్మాణం(స్పిల్‌ వే) చేపట్టి గోదావరి ప్రవాహాన్ని ఆవైపు మళ్లించి ఇసుక పొరలపై ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌(ఈసీఆర్‌ఎఫ్‌)ను నిర్మించేలా పోలవరం జలాశయం ఆకృతిని (డిజైన్‌) ఖరారు చేసింది.

ఊట నీటికి అడ్డుకట్ట వేస్తే ఈసీఆర్‌ఎఫ్‌ అత్యంత పటిష్టంగా ఉంటుందని తేల్చింది. పూర్తి స్థాయిలో ఊట నీటికి అడ్డుకట్ట వేయాలంటే ఈసీఆర్‌ఎఫ్‌కు పునాదిగా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించాలని స్పష్టం చేసింది. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా తొలుత స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ను పూర్తి చేయాలని పేర్కొంది. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను నిర్మించి వరదను స్పిల్‌ వే మీదుగా మళ్లించాలని సూచించింది. కాఫర్‌ డ్యామ్‌ల మధ్యన డయాఫ్రమ్‌ వాల్‌ వేసి దానిపై ఈసీఆర్‌ఎఫ్‌ను నిర్మించడం ద్వారా జలాశయాన్ని పూర్తి చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రాజెక్టు డిజైన్ల రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన డీడీఆర్‌పీ(డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌) కూడా ఇదే అంశాన్ని పునరుద్ఘాటించింది.

కమీషన్ల దాహంతో చంద్రబాబు చేసింది ఇదీ..
పోలవరం బాధ్యతలు దక్కించుకున్నాక రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ని అడ్డంపెట్టుకుని పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించి భారీగా కమీషన్ల వసూలుకు చంద్రబాబు పథక రచన చేశారు. సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ మార్గదర్శకాలను తుంగలో తొక్కి కమీషన్లు అధికంగా వచ్చే పనులనే ప్రాధాన్యంగా చేపట్టారు. స్పిల్‌ వే పునాది పనులు చేస్తూనే.. ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌–2లో 1450 మీటర్ల పొడవున డయా ఫ్రమ్‌ వాల్‌ పనులను జర్మనీకి చెందిన బావర్, ఎల్‌ అండ్‌ టీ సంస్థలకు సబ్‌ కాంట్రాక్టు కింద అప్పగించారు. 2017లో డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణాన్ని ప్రారంభించారు. నదిలో గరిష్టంగా 99.8 మీటర్ల నుంచి కనిష్టంగా 40 మీటర్ల లోతు వరకూ డయాఫ్రమ్‌ వాల్‌ను 2018 జూన్‌ 11న బావర్, ఎల్‌ అండ్‌ టీ పూర్తి చేయడంతో ఇక అంతటితో ప్రాజెక్టు పూర్తైనట్లుగా భ్రమింపజేస్తూ చంద్రబాబు భారీ ఎత్తున రియాలిటీ షో నిర్వహించారు.

2018లో గోదావరి వరద ఉధృతికి ఇసుక పొరలు కోతకు గురై అంగులూరు వైపు వంద మీటర్ల కంటే ఎక్కువ పొడవున డయా ఫ్రమ్‌ వాల్‌ కోతకు గురైంది. ఇదే అంశాన్ని అప్పట్లో ‘సాక్షి’ ఫోటోలతో సహా ప్రచురిస్తే... పోలవరం ప్రాజెక్టుపై విషం చిమ్ముతున్నారంటూ శాసనసభ, బహిరంగ సభల్లోనూ చంద్రబాబు, అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా దుమ్మెత్తిపోశారు. నాటి కేంద్ర జలసంఘం సభ్యులు వైకే శర్మ నేతృత్వంలో నిపుణుల కమిటీ 2018 సెప్టెంబరు 6న పోలవరాన్ని పరిశీలించి ప్రాజెక్టు పనుల్లో నాణ్యత లేదని స్పష్టం చేసింది. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్‌ వే పూర్తి చేయకుండా డయా ఫ్రమ్‌ వాల్‌ పనులు ఎలా చేపట్టారని నాటి సర్కారును నిలదీసింది.

వైకే శర్మ కమిటీ మార్గదర్శకాలను పట్టించుకోని చంద్రబాబు 2019 ఎన్నికలకు ముందు ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను చేపట్టి వాటిని పూర్తి చేయలేక చేతులెత్తేశారు. ప్రవాహానికి ఎగువ కాఫర్‌ డ్యామ్‌ అడ్డంకిగా మారడంతో వరద పెరిగి ఆ ఉద్ధృతి డయాఫ్రమ్‌ వాల్‌పై తీవ్రంగా ప్రభావం చూపిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. పునరావాసం కల్పించకుండా కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టి చివరకు వాటిని చేయలేక చేతులెత్తేయడంతో 2019, 2020లో వరద నీరు ముంపు గ్రామాల్లోకి చేరి నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ ఇవేవీ ‘ఈనాడు’కు అప్పుడూ ఇప్పుడూ కనిపించకపోవడం విడ్డూరం. చివరకు డయాఫ్రం వాల్‌ పనులు చేసిన బావర్‌ – ఎల్‌అండ్‌టీకి రూ.89.91 కోట్లు చెల్లించకుండా గత ప్రభుత్వ పెద్దలు మింగేశారు. బావర్‌ ఈ వ్యవహారంపై జర్మనీ రాయబారి ద్వారా  ప్రధానమంత్రి కార్యాలయానికి సైతం ఫిర్యాదు చేసింది.

ప్రణాళికాయుతంగా పూర్తి చేస్తుంటే విషం చిమ్ముతారా?
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక 2019 జూన్‌ 20న పోలవరం పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. చంద్రబాబు అస్తవ్యస్తంగా మార్చేసిన ప్రాజెక్టును పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. వైకే శర్మ కమిటి సిఫారసుల మేరకు పనుల్లో నాణ్యత పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గోదావరి వరదను మళ్లించే స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ను పూర్తి చేశాక.. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను నిర్మించాలని నిర్ణయించారు.

వరదను స్పిల్‌ వే మీదుగా మళ్లించాక కాఫర్‌ డ్యామ్‌ల మధ్యన ఈసీఆర్‌ఎఫ్‌ను చేపట్టి పూర్తి చేసేలా ప్రణాళిక వేశారు. ఆ ప్రణాళికను నిక్కచ్చిగా అమలు చేస్తున్నారు. మే నాటికి స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ పూర్తవుతాయి. జూన్‌ నాటికి ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల పనులు పూర్తవుతాయి. ఆ తర్వాత గోదావరి వరదను స్పిల్‌ వే మీదుగా మళ్లించి కాఫర్‌ డ్యామ్‌ల మధ్య డయాఫ్రమ్‌ వాల్‌ను పూర్తి స్థాయిలో సిద్ధం చేసి ఈసీఆర్‌ఎఫ్‌ పనులు చేపడతారు. పోలవరం పనులను ఇటీవల పరిశీలించిన డీడీఆర్‌పీ, పీపీఏ బృందం షెడ్యూల్‌ ప్రకారం పనులు నాణ్యంగా జరుగుతున్నాయని స్పష్టం చేయడం ఎల్లో మీడియాకు మింగుడు పడినట్లు లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement