సాక్షి, అమరావతి: ప్రజాధనాన్ని ఆదా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం పనులను పరుగులెత్తిస్తుంటే రామోజీ కలం మాత్రం బురద రాతలతో పోటీ పడుతోంది! పోలవరం పనుల టెండర్లకు సంబంధించి ‘మళ్లీ.. మేఘాకే’ శీర్షికన ఈనాడు ప్రచురించిన కథనమే అందుకు నిదర్శనం.
ఈనాడు: పోలవరం ప్రధాన డ్యాంలో రూ.1,626.48 కోట్ల వ్యయంతో నిర్వహించిన లాంఛనప్రాయ టెండర్లలో ఏమాత్రం పోటీ లేకుండా మేఘా దక్కించుకుంది.
వాస్తవం: టీడీపీ హయాంలో కమీషన్ల దాహంతో చంద్రబాబు ప్రణాళికారాహిత్యంగా చేపట్టిన పనుల వల్ల 2019లో గోదావరికి వచ్చిన భారీ వరదలకు ప్రధాన డ్యామ్ గ్యాప్–1, గ్యాప్–2 నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురైన నాలుగు చోట్ల భారీ అగాథాలు ఏర్పడ్డాయి. గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. అగాథాలను పూడ్చి వైబ్రో కాంపాక్షన్‌తో యథాస్థితికి తేవడం, దెబ్బతిన్న చోట కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించి పాతదానితో అనుసంధానం పనులకు రూ.1,615.75 కోట్లతో చేపట్టిన టెండర్ షెడ్యూల్‌ను పోలవరం సీఈ జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపారు. జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదించిన షెడ్యూల్‌తో టెండర్ నిర్వహించారు.
మేఘాతోపాటు చంద్రబాబుకు సన్నిహితుడైన సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థలు టెండర్‌లో షెడ్యూళ్లు దాఖలు చేశాయి. బుధవారం పోలవరం సీఈ ఆర్థిక బిడ్‌ను తెరిచారు. రూ.1,665.84 కోట్లు (3.10 శాతం అధిక ధర)కు కోట్ చేసిన సంస్థ ఎల్–1గా నిలిచింది. ఎల్–1 సంస్థ కోట్ చేసిన రూ.1665.84 కోట్లను కాంట్రాక్టు విలువగా పరిగణించి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఈ ప్రక్రియలో మేఘా, రిత్విక్ పోటాపోటీగా తలపడ్డాయి. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ముగిసేటప్పటికి రూ.1,599.21 కోట్లకు (1.024 శాతం తక్కువ ధర) కోట్ చేసిన మేఘా సంస్థ పనులను దక్కించుకుంది. దీనివల్ల ఖజానాకు రూ.66.63 కోట్లు ఆదా అయ్యింది.
ఇంత పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ జరగడం రామోజీరావుకు కంటగింపుగా మారిందేమో! టీడీపీ హయాంలో పోలవరం హెడ్ వర్క్స్ ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్‌ట్రాయ్ నుంచి రూ.2,917.78 కోట్ల విలువైన పనులను 60–సీ కింద తొలగించి తన కుమారుడి వియ్యంకుడికి చెందిన నవయుగ సంస్థకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టినప్పుడు రామోజీ కిమ్మనలేదు. ఎందుకంటే డీపీటీ పద్ధతిలో దోచుకున్నారు కాబట్టి. 2019 మే నాటికి నవయుగ చేయగా మిగిలిన రూ.1,771.44 కోట్ల పనులను తొలగించి రివర్స్ టెండరింగ్ నిర్వహించగా రూ.1,548 కోట్లకే చేసేందుకు మేఘా సంస్థ ముందుకొచి్చంది. ఖజానాకు రూ.223 కోట్లను ఆదా చేయడం ద్వారా చంద్రబాబు–రామోజీ దోపిడీని సీఎం వైఎస్ జగన్ నిరూపించారు.
ఈనాడు: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రూ.4,623 కోట్ల విలువైన పనులను మేఘాకే అప్పగించారు.
వాస్తవం: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జ్యుడీషియల్ ప్రివ్యూ ఆమోదించిన షెడ్యూళ్లతో ఈ–ప్రొక్యూర్‌మెంట్ వెబ్‌సైట్ ద్వారా రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తున్నారు. అత్యంత పారదర్శకమైన ఈ విధానంలో నిర్వహిస్తున్న టెండర్లలో పాల్గొనేందుకు కాంట్రాక్టర్లు పోటీ పడుతున్నారు. అతి తక్కువ ధరకు పనులు చేయడానికి ముందుకొచ్చిన సంస్థకే పనులు అప్పగిస్తున్నారు. ఇదే విధానంలో మేఘా సంస్థ పనులు దక్కించుకుందేగానీ నామినేషన్ పద్ధతిలో
కాదన్నది రామోజీకి తెలియదా?
ఈనాడు: ప్రభుత్వం చెబుతున్న ప్రకారం రూ.1,548 కోట్లకే పోలవరం ప్రధాన డ్యామ్‌లో మిగిలిన పనులు పూర్తి చేయాలి. కానీ అదనంగా రూ.మూడు వేల కోట్ల విలువైన పనులను చేపట్టి మేఘాకే అప్పగించారు.
వాస్తవం: కేంద్ర జలసంఘం ఆమోదించిన డిజైన్ల ప్రకారం పోలవరం స్పిల్‌వేకి ఎగువన గైడ్ బండ్, ఇరువైపులా కొండచరియలు విరిగిపడకుండా పటిష్టం చేసేందుకు రూ.683 కోట్లతో ప్రభుత్వం టెండర్లు నిర్వహించింది. రివర్స్ టెండరింగ్‌లో వాటిని రెండు శాతం తక్కువ ధరకు మేఘా సంస్థ దక్కించుకుంది. గోదావరి వరదను మళ్లించే పనులు పూర్తి చేయకుండా కాఫర్ డ్యామ్‌ను చేపట్టిన చంద్రబాబు అనాలోచిత చర్యల వల్ల 2019లో వరదలకు ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై నాలుగు చోట్ల భారీ అగాథాలు ఏర్పడ్డాయి. దీంతో గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది.
సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ మార్గదర్శకాల మేరకు చంద్రబాబు పాపాలను సరిదిద్దే పనులను రూ.1,615.75 కోట్లతో ప్రభుత్వం చేపట్టింది. రివర్స్ టెండరింగ్‌లో వాటిని మేఘా దక్కించుకుంది. పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల దాహార్తి తీర్చడానికి పోలవరం కనీస నీటి మట్టం దిగువ నుంచి నీటిని తరలించడానికి రూ.776.94 కోట్లతో ఎత్తిపోతలను ప్రభుత్వం చేపట్టింది. వాటిని రివర్స్ టెండరింగ్‌లో మేఘా దక్కించుకుంది. వీటిని పరిగణలోకి తీసుకుంటే ఈనాడు ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నది స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment