సాక్షి, అమరావతి: సీఐడీ నమోదు చేసిన ఐపీసీ సెక్షన్ 467 (వాల్యుబుల్ సెక్యూరిటీ ఫోర్జరీ) తమకు ఎంతమాత్రం వర్తించదన్న టీడీపీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ వాదనను హైకోర్టు ప్రాథమికంగా తోసిపుచ్చింది. ప్రాథమిక ఆధారాలను బట్టి ఆ సెక్షన్ వారికి వర్తిస్తుందని అభిప్రాయపడింది. ప్రయోజనం పొందాలన్న ఉద్దేశంతోనే జల వనరుల శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) పొందారని, అందువల్ల అది వాల్యుబుల్ సెక్యూరిటీ కిందకే వస్తుందని హైకోర్టు పేర్కొంది.
ఈ విషయంలో అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనతో న్యాయస్థానం ప్రాథమికంగా ఏకీభవించింది. అయ్యన్నపాత్రుడు, రాజేష్‌పై సీఐడీ నమోదు చేసిన కేసుకు సంబంధించిన పూర్వాపరాలన్నీ తెలుసుకునేందుకు ఆ కేసు డైరీని తమ ముందుంచాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు.
నర్సీపట్నంలో పంట కాలువకు చెందిన భూమిలో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు జల వనరుల శాఖ ఎన్‌వోసీని ఫోర్జరీ చేశారంటూ ఆ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అయ్యన్నపాత్రుడు, రాజేష్‌లపై సీఐడీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయడంతో పాటు తమకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ అయ్యన్నపాత్రుడు, రాజేష్ అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి విచారణ జరిపారు.
అరెస్ట్ చేయొద్దంటే ఎలా...?
సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే ఎన్‌వోసీని ఫోర్జరీ చేశారని, అందువల్ల అది ఐపీసీ సెక్షన్ 467 కింద వాల్యుబుల్ సెక్యూరిటీ కిందకే వస్తుందన్నారు. ఇందుకు సంబంధించి ఆయన ఐపీసీ సెక్షన్ 30 చదివి వినిపించారు. దీని ప్రకారం న్యాయపరమైన హక్కు కల్పించేది ఏదైనా వాల్యుబుల్ సెక్యూరిటీయే అవుతుందన్నారు.
ఈ సెక్షన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి ఈ అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పును ఉదహరిస్తూ దాని ప్రకారం ప్రస్తుతం పిటిషనర్లు పొందినట్లు చెబుతున్న ఎన్‌వోసీ వాల్యు బుల్ సెక్యూరిటీ కిందకే వస్తుందని ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు. తప్పు చేసిన వ్యక్తులను అరెస్ట్ చేస్తే రాజకీయ కక్ష సాధింపుగా ఆరోపించడం సరికాదని పొన్నవోలు పేర్కొన్నారు. లేని డాక్యుమెంట్ ఆధారంగా భవనం కట్టారని, ఇందుకోసం ఫోర్జరీ ఎన్‌వోసీ సృష్టించారన్నారు.
అసిస్టెంట్ ఈఈని బెదిరించి ఎన్‌వోసీపై సంతకం చేయించి ముద్ర వేయించారని తెలిపారు. నిందితులను ప్రశ్నించి వాస్తవాలను రాబట్టేందుకే వారిని అరెస్ట్ చేశామని నివేదించారు. కేసు నమోదు తరువాత వాస్తవాలను రాబట్టేందుకు నిందితులను అరెస్ట్ చేసే హక్కు దర్యాప్తు అధికారులకు ఉందన్నారు.
ఈ హక్కును ఎవరూ కాలరాయలేరని, అరెస్ట్ చేయవద్దంటే సంబంధిత సెక్షన్‌ను చట్టం నుంచి తొలగించడమే మేలన్నారు. నిందితుల అరెస్ట్‌పై ఏ చట్టంలో కూడా ఎలాంటి నిషేధం లేదన్నారు. అయ్యన్న లాంటి వారి వల్ల దోపిడీ రాజ్యం తయారైందని, అలాంటి వారిని అరెస్ట్ చేసి శిక్ష పడేలా చేస్తే అది రామరాజ్యం అవుతుందన్నారు.
కక్ష సాధింపు...
అంతకు ముందు అయ్యన్న, రాజేష్ తరఫు న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపిస్తూ రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఈ కేసు నమోదు చేశారన్నారు. గతంలో తాము ఎన్‌వోసీ పొందామని, వాటి కాపీలను ఓ కేసులో హైకోర్టు ముందుంచామన్నారు. వాటిని జారీ చేసిన తేదీకి, ఫోర్జరీ తేదీకి పొంతన లేదన్నారు. ఏ రకంగానూ తమకు 467 సెక్షన్ వర్తించదన్నారు. మిగిలినవన్నీ సాధారణ సెక్షన్లేనని, వాటికి సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
లబ్ధి కోసమే ఎన్‌వోసీ!
Published Fri, Nov 4 2022 3:55 AM | Last Updated on Fri, Nov 4 2022 8:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment