Minister Somireddy
-
చిన్న స్కీమ్‌లో పెద్ద స్కామ్!
సాక్షి, అమరావతి : కేవలం రూ.9.21కోట్లతో పూర్తయ్యే పని అది. కానీ, రూ.26.63కోట్లకు అంచనాలు పెంచారు. అంతటితో ఆగలేదు.. ఆయకట్టుకు చుక్క నీరు ఇవ్వకుండానే పంటలు సాగుచేసినట్లు, చివరి భూములు కావడంతో నీళ్లందక పంటలు ఎండిపోతున్నట్లు మాయమాటలు చెప్పారు. వాటిని రక్షించాలంటే కాల్వ పనులు పూర్తిచేయాలని స్కెచ్ వేశారు. అంతే.. ఆఘమేఘాలపై చక్రం తిప్పారు. ఆ పనులను తమ అనుకూల సంస్థ అయిన ‘మేఘా’కు నామినేషన్‌పై అప్పగించాలని తెలుగుగంగ సీఈపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆయన అంగీకరిస్తూ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. కానీ, అక్కడ కథ అడ్డం తిరిగింది. టెండర్లు తప్పనిసరి కావడంతో అందుకు తగ్గట్టుగా వ్యూహం మార్చారు. మరోసారి తమ అనుకూల సంస్థకే పనులు దక్కేలా నిబంధనలు రూపొందించారు. అంతే.. ఇక అక్కడ నుంచి అనుకున్నవన్నీ చకచకా జరిగిపోయాయి. రూ.17కోట్లకు పైగా కమీషన్లు రాబట్టుకోడానికి చిన్న స్కీం ముసుగులో పెద్ద స్కామ్‌కు తెరలేపిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అక్రమాల బాగోతం ఇదిగో ఇలా జరిగింది... నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలో కనుపూర్ కెనాల్ కింద 12,500 ఎకరాల చివరి ఆయకట్టు భూములకు సక్రమంగా నీళ్లందడంలేదు. డేగపూడి–బండేపల్లి లింక్ కెనాల్ పనులు పూర్తిచేసి.. కనుపూర్ కెనాల్ చివరి ఆయకట్టుకు నీళ్లందిస్తేనే 2019 ఎన్నికల్లో ప్రచారానికి వస్తానని పొదలకూరు మండలంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి 2014 ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాకాని గోవర్ధన్‌రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అనంతరం సోమిరెడ్డి ఎమ్మెల్సీ అయి మంత్రి అయ్యారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లపాటు లింక్ కెనాల్ పనులను పట్టించుకోని ఆయన తాజాగా ఎన్నికలు ముంచుకొస్తుండటంతో ఆ పనుల ద్వారా కమీషన్లు దండుకునేందుకు వాటికి పరిపాలన అనుమతి వచ్చేలా చక్రం తిప్పారు. అందుకు అవసరమైన భూసేకరణకు రూ.10.29 కోట్లను విడుదల చేయడానికి సర్కార్ అంగీకరించింది. ఆ తర్వాత కండలేరుపై ఆనకట్ట, డేగపూడి–బండేపల్లి లింక్ కెనాల్‌ను రూ.31.40కోట్లతో తవ్వే పనులకు నవంబరు 11న సర్కార్ అనుమతిచ్చింది. నిబంధనలు అడ్డుపెట్టుకుని.. నామినేషన్ ఎత్తుగడను జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ చిత్తు చేయడంతో మళ్లీ మేఘా సంస్థకు పనులు దక్కేలా నిబంధనలు రూపొందించి ఈనెల 17న టెండర్ నోటిఫికేషన్ జారీచేసి జనవరి 4న ప్రైస్ బిడ్ తెరిచేలా మంత్రి సోమిరెడ్డి చక్రం తిప్పారు. అంతేకాదు.. పనులు చేసేటప్పుడు వాటికి అనుబంధంగా ఏవైనా అదనపు పనులు చేయాల్సి వస్తే వాటిని టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థకే నామినేషన్‌పై కట్టబెట్టాలన్న షరతు విధించారు. వాస్తవంగా కండలేరుపై ఆనకట్టను రూ.3.50 కోట్లతో.. 250 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో 9.275 కి.మీల కెనాల్‌ను, వాటిపై బ్రిడ్జిలతో కలిపి 5.71 కోట్లతో, మొత్తం రూ.9.21కోట్లతో పూర్తిచేయవచ్చునని జలవనరుల శాఖ అధికారులే చెబుతున్నారు. కానీ.. మంత్రి సోమిరెడ్డి ఒత్తిడి మేరకు అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా రూ.26.63 కోట్లకు పెంచేశారు. నిజానికి.. 2017–18 ధరల ప్రకారం ఎం–20 కాంక్రీట్ క్యూబిక్ మీటర్‌కు అయ్యే వ్యయం రూ.5143.23 మాత్రమే. కానీ.. ఈ పనుల్లో దాన్ని రూ.8247.88కు ఇష్టారాజ్యంగా పెంచేశారు. మట్టి పనుల నుంచి కాంక్రీట్ పనుల వరకూ అన్నింటా ఇదే కథ. అనుకూల సంస్థకు పనులు కట్టబెట్టేస్తే రూ.17 కోట్లకు పైగా కమీషన్లు వసూలు చేసుకోవడానికి సోమిరెడ్డి పావులు కదుపుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీన్ని బట్టి చూస్తే, ఈ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టడంలో రైతుల ప్రయోజనాల కంటే.. సోమిరెడ్డి కమీషన్ల యావే ఎక్కువగా ఉందన్నది స్పష్టమవుతోందని టీడీపీ వర్గాలే ఆరోపిస్తున్నాయి. కమీషన్ల కోసం వ్యూహం ఈ నేపథ్యంలో.. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆ పనులను నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్‌పై కట్టబెట్టి భారీఎత్తున కమీషన్లు రాబట్టుకోవడానికి మంత్రి సోమిరెడ్డి పథక రచన చేశారు. అందులో భాగంగా కండలేరు ఆనకట్ట, 9.275 కిమీల పొడవున డేగపూడి–బండేపల్లి కెనాల్ తవ్వకం పనులను మేఘా సంస్థకు నామినేషన్ పద్ధతిలో అప్పగించాలని తెలుగుగంగ సీఈ ఆర్.మురళీనాథ్రెడ్డిపై సోమిరెడ్డి ఒత్తిడి తెచ్చారు. మంత్రి సూచనలతో.. ఆ పనులు రూ.26.63 కోట్లకు తమకు నామినేషన్‌పై అప్పగిస్తే.. మూడు నెలల్లో పూర్తిచేస్తామని ఈనెల 12న సీఈకి మేఘా సంస్థ లేఖ రాసింది. అలాగే, మంత్రి ఒత్తిడి చేయడంతో.. ఆ పనులను సదరు సంస్థకు నామినేషన్‌పై అప్పగించేందుకు అనుమతివ్వాలని సీఈ తన ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. కానీ, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ వాటిని తోసిపుచ్చారు. కండలేరు ఎడమ కాలువ ఎత్తిపోతల పథకాన్ని మేఘా సంస్థ ఇటీవలే పూర్తిచేసిందని.. యంత్రాలు, సామగ్రి అందుబాటులో ఉండటంవల్ల ఆ సంస్థ తక్షణమే పనులు పూర్తిచేసి, పంటలను రక్షించగలుగుతుందని తన ప్రతిపాదనల్లో సీఈ పేర్కొనడాన్ని శశిభూషణ్ తప్పుబట్టారు. నీటినే విడుదల చేయనప్పుడు పంటలు ఎలా సాగుచేశారని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అంతేకాక.. అంచనా వ్యయం రూ.మూడు లక్షలకు మించి ఉన్న పనులను నామినేషన్‌పై అప్పగించడం నిబంధనలకు విరుద్ధమని.. ఆ పనులకు టెండర్లు పిలవాల్సిందేనని ఆదేశించారు. -
మంత్రి సోమిరెడ్డి అండతో నకిలీ పట్టాల సృష్టి
నెల్లూరు(సెంట్రల్): వెంకటాచలం మండలం రామదాసు కండ్రికలో నకిలీ పట్టాల సృష్టి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అండతోనే జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న సోమిరెడ్డికి కనీసం సీజేఎఫ్ఎస్, డీకేటీ పట్టాలకు తేడా తెలియకుండా సంతకాలు పెట్టడం సిగ్గు చేటని, ఇటువంటి వ్యక్తి ప్రభుత్వంలో మంత్రిగా ఉండటం దౌర్భాగ్యంగా ఉందని ఎద్దేవా చేశారు. నెల్లూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో బాధితులతో కలిసి బుధవారం విలేకరుల సమావేశంలో కాకాణి మాట్లాడారు. రామదాసుకండ్రిక ప్రాంతంలో మందల చెంచయ్య, మందల వెంకయ్య, మందల రామయ్య, మందల జయరామయ్యల పేరు మీద ఒక్కొక్కరికి 2.4 ఎకరాల చొప్పున మొత్తం 8.16 ఎకరాలు భూమి ఉందన్నారు. ఈ భూమిని కొన్నేళ్లుగా వీరే సాగు చేసుకుంటున్నారన్నారు. కానీ అధికార పార్టీ నాయకులు, మంత్రి చంద్రమోహన్‌రెడ్డి అనుచరులు వాకా నారయ్య, సండి వెంకటసుబ్బయ్య, మల్లి రమణయ్య, సండి రమణయ్య ఈ పొలంలోని కొంత బాగానికి సంబంధించి నకిలీ పట్టాలు సృష్టించి ప్రభుత్వం నుంచి పరిహారం కోసం మంత్రి సోమిరెడ్డితో నకిలీ పట్టాలపై సంతకాలు కూడా పెట్టించుకున్నారన్నారు. అంతకు ముందు మరికొంత పొలానికి గుమ్మా జయరామయ్య, దుర్గం శ్రీనివాసులు, మల్లి అంకయ్య, చల్లా తిరుపాలు, బూడిత శేషయ్య నకిలీ పట్టాలు సృష్టించి మంత్రి సోమిరెడ్డి వద్ద కూడా సంతకాలు పెట్టించుకున్నారన్నారు. చిత్తశుద్ధి ఉంటే వారిపై చర్యలు తీసుకునేవారు నిత్యం తన కంటే నీతిమంతుడు లేరని గప్పాలు కొట్టుకునే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నకిలీ పట్టాలు సృష్టించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలన్నారు. మంత్రి పాత్ర లేకుంటే నకిలీ పత్రాలపై మంత్రి సోమిరెడ్డితో ఎవరు సంతకాలు పెట్టించారో సమాధానం చెప్పాలన్నారు. మంత్రికి సంబంధం లేనప్పుడు నకిలీ పట్టాలు సృష్టించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రావెల్ నుంచి రైతురథం వరకు, మట్టి నుంచి నీరు– చెట్టు వరకు..ఇలా ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా అవినీతికి పాల్పడింది నిజం కదా అని నిలదీశారు. నకిలీ ఎరువులతో రైతుల కడుపు కొట్టిన చరిత్ర రైతాంగం ఎన్నటికి మరువదని గుర్తుచేశారు. చివరకు పేదల భూములకు నకిలీ పట్టాలు సృష్టించి పరిహారం కాజేసేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. పేదల కడుపులు కొట్టడం సిగ్గు చేటన్నారు. నకిలీ పత్రాలు సృష్టించి పరిహారం కాజేయాలనుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీల దృష్టికి తీసుకు పోతామన్నారు. ఈ సమావేశంలో వెంకటాచలం జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌గౌడ్, బాధితులు మందల కృష్ణయ్య, మందల వెంకటకృష్ణయ్య, మందల రవి, జి సుధాకర్ పాల్గొన్నారు. వామపక్షాలకు వైఎస్సార్సీపీ మద్దతు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జిల్లాలో వామపక్ష పార్టీలు గురువారం తలపెట్టిన జాతీయరహదారుల దిగ్బంధం కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు సైతం వామపక్షాలు చేస్తున్న దిగ్బంధం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక హోదా ఆకాంక్షను చాటాలని పిలుపునిచ్చారు. -
మభ్యపెట్టేందుకే లిఫ్ట్ కెనాల్
మనుబోలు: అధికార పార్టీ చేస్తున్న సాగునీటి రాజకీయాలకు మనుబోలు మండలంలోని బండేపల్లి బ్రాంచ్ కా లువ ఆయకట్టు రైతులు నష్టపోతున్నారు. మండలంలో హైవేకి పడమటి వైపు ఉన్న సుమారు 10 గ్రామాల రైతులు కనుపూరు కాలువకు అనుబంధంగా మండలంలో విస్తరించిన బండేపల్లి బ్రాంచ్ కాలువపై ఆధారపడి ఏటా సుమారు 8 వేల ఎకరాల్లో రైతులు వరిని సాగు చేస్తారు. అయితే కనుపూరు కాలువకు బండేపల్లి బ్రాంచ్ కాలువ చివరిన ఉండడంతో సాగునీరందక ఏటా ఈ ప్రాంతంలో పంటలు ఎండిపోవడం పరిపాటిగా మారిం ది. దీన్ని దృష్టిలో ఉంచుకుని 2014 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్ర స్తుత మంత్రి సోమిరెడ్డి తాము అధికారంలోకి వస్తే డేగపూడి–గొట్లపాలెం లింక్ కెనాల్‌ను పూర్తి చేసి మండలంలోని బ్రాంచ్ కెనాల్ పరిధిలో ఉన్న మెట్ట గ్రామాలను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే నాలుగేళ్లు గడిచినా డేగపూడి–గొట్లపాలెం కాలు వకు ఇంతవరకూ అతి గతి లేదు. మరో వైపు బ్రాంచ్ కాలువకు సక్రమంగా నీరు విడుదల కాక పంటలు ఎండిపోతున్నాయి. దీని కారణంగా రైతుల నుంచి వచ్చే వ్యతిరేకత నుంచి తప్పంచుకునేందుకు ఇటీవల రూ.49 లక్షలతో రాజోలుపాడు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా రాజోలుపాడు వద్ద నుంచి కండలేరు నీటిని లిఫ్ట్ ద్వారా బ్రాంచ్ కాలువలో కలిపి పంటలు ఎండకుండా చూస్తామని చెప్పారు. దీంతో మండల టీడీపీ నాయకులు సోమి రెడ్డిని అపర భగీరథుడంటూ పొగడ్తలు గుప్పిస్తున్నారు. అయితే కండలేరు నీటిని మోటార్ల ద్వారా పంపింగ్ చేసి, ఆపై కాలువ ద్వారా బ్రాంచ్ కాలువలో కలిపే క్రమంలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను ఇంజినీర్లు పట్టించుకోలేదు. రివర్స్ గ్రేడియంట్(దిగువ నుంచి ఎగువకు)లో కేవలం 4 పైపుల ద్వారా కాలువలో నీటిని పంపడంతో నీరు ముందుకు కదలక ఈ పథకం విఫలమైంది. దీంతో సాగునీరందక రైతుల పంటలు ఎండిపోతున్నాయి. వారం రోజుల క్రితం రాజోలుపాడు లిఫ్ట్ పథకాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కాకాణి అందులో ఉన్న లోపాలను ఎండగట్టారు. దీన్ని సహించలేని టీడీపీ నాయకులు రోజూ ప్రెస్ మీట్లు పెడుతూ రాజోలుపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం బ్రహ్మాండమని, బ్రాంచ్ కెనాల్ పరిధిలో ఒక్క ఎకరా కూడా ఎండనివ్వమని హామీలు గుప్పిస్తున్నారు. కాగా వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సందర్భంగా పొదలకూరు వచ్చినప్పుడు ఆయన దృష్టికి మండలంలోని మెట్ట రైతుల దుస్థితిని ఎమ్మెల్యే కాకాణి తీసుకెళ్లారు. దీంతో అధికారంలోకి వచ్చిన ఏడాది లోపు లింక్ కెనాల్ పూర్తి చేసి సాగునీరు ఇస్తామని జగన్ మోహన్‌రెడ్డి బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ఆయన హామీ రైతుల్లో భవిష్యత్తుపై భరోసా నింపుతోంది. తుగ్లక్ పనిలా ఉంది రాజోలుపాడు ఎత్తిపోతల పథకం పిచ్చి తుగ్లక్ పనుల ను తలపిస్తోంది. దిగువ నుంచి ఎగువకు నీటిని పం ప డం ఎక్కడైనా చూశామా. ఒకవేళ అలా చేయాలన్నా వా లును, గురుత్వాకర్షణ శక్తిని కొలతలు వేసుకుని ఎంత నీటిని లిఫ్ట్ చేస్తే వాలును అధికమించి ఎగువకు చేరుతుందో లెక్కలేసుకుని చేయాల్సి ఉంటుంది. అదేమీ లేకుండా రూ.లక్షల ప్రజాధనం వెచ్చించి ఇలాంటి పనులు చేయడం రైతులను వంచించడమే. చెప్పిన ప్రకారం లింక్ కెనాల్‌ను పూర్తి చేయలేక, వచ్చే ఎన్నికల్లో ముఖ మెలా చూపాలో తెలియక రైతుల దృష్టి మళ్లించేందుకు మంత్రి సోమిరెడ్డి వేసిన ఎత్తు ఇది. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే -
గట్టిగా మాట్లాడితే జీతాలు ఇప్పించను
అనకాపల్లి: ‘ఏయ్ ఏంటి గట్టిగా మాట్లాడుతున్నారు.. గట్టిగా మాట్లాడితే జీతాలిప్పించను’ అంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అనకాపల్లిలో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులపై మండిపడ్డారు. 42 నెలలుగా తమకు రావాల్సిన వేతన బకాయిల కోసం అడగడానికి వెళ్లిన కార్మికులపై మంత్రి విరుచుకుపడడంతో వా రు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. సోమవారం విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో జరిగిన 59వ కిసాన్ మేళా సందర్భంగా ఈఘటన జరిగింది. ఈ మేళాకు మంత్రి సోమిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదిక ఎక్కే ముందు కార్మికులు ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్మికులకు 42 నెలలుగా జీతాల్లేవని, ఇటీవల ఎన్ఎంఆర్ కార్మికులను తొలగిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. మంత్రి మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, రైతులకు తాము భరోసా ఇస్తామని చెప్పి ప్రసంగం ముగించారు. మంత్రి ప్రసంగం పూర్తయిన వెంటనే కార్మికుల సమస్యలపై మాట్లాడాలంటూ సీపీఎం నేత బాలకృష్ణ, ప్రజా రాజకీయ ఐక్యవేదిక కన్వీనర్ కనిశెట్టి సురేశ్‌బాబు, ఆమ్ఆద్మీ పార్టీ నేత కొణతాల హరనాథబాబులు నినాదాలు చేశారు. సమస్యలను ప్రస్తావిస్తానంటూనే మంత్రి వేదిక దిగి వెళ్లిపోయారు. మంత్రి తమ గురించి మాట్లాడతారని ఎదురుచూసిన ఎన్ఎంఆర్ కార్మికులు నిరాశ చెంది నినాదాలు చేశారు. స్పందించిన మంత్రి సోమిరెడ్డి ఎన్ఎంఆర్ కార్మిక నేత నర్సింగరావును పిలిచి ఏం అరుస్తున్నావ్ అని అడిగారు. తమ కష్టాల గురించి స్పందించలేదంటూ నర్సింగరావు ఆవేదన వ్యక్తం చేస్తూనే.. జీతాలను ఇప్పించాలని కోరారు. దీంతో గట్టిగా అరిస్తే జీతాలు రానీయకుండా చేస్తాననడంతో కార్మికులు అసంతృప్తికి గురయ్యారు. కార్మికులకు భరోసా ఇచ్చేలా మాట్లాడకుండా మంత్రి వ్యవహరించడం దారుణమని ప్రజా సంఘాల నేతలు అన్నారు. -
పార్టీ మారలేదని...
పొదలకూరు: పార్టీ మారలేదని వేధింపులకు గురిచేస్తూ మంత్రి సోమిరెడ్డి తన చెక్‌పవర్ రద్దు చేయించారని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు సర్పంచ్, వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తెనాలి నిర్మలమ్మ పేర్కొన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కొంతకాలంగా టీడీపీలో చేరాలని మంత్రి పరోక్షంగా సంకేతాలు ఇస్తూ వచ్చారన్నారు. అయితే తాము ఊపిరి ఉన్నంత వరకు పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పామన్నారు. దీంతో దళిత మహిళా సర్పంచ్‌నైన తనపై వేధింపులను మొదలు పెట్టి, టీడీపీకి చెందిన ఎంపీటీసీ, వార్డుసభ్యులతో డీపీఓకు ఫిర్యాదు చేయించి డీఎల్పీఓ వద్ద విచారణ జరిపించారన్నారు. ఎలాంటి అవకతవకలు జరగలేదని అధికారులు తేల్చినా మంత్రి నెలరోజులుగా జిల్లా స్థాయి అధికారిపై ఒత్తిడి తెచ్చి చెక్‌పవర్ రద్దు చేయాల్సిందిగా ఆదేశించారన్నారు. ఈ క్రమంలో డీపీఓ ఉత్తర్వులు ఇచ్చినట్టు తమకు తెలిసిందన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.12 లక్షలు,ఇతర నిధులు రూ. 51 లక్షలు దుర్వినియోగం చేశామని చూపుతూ చెక్‌పవర్ రద్దు చేసినట్టు ఉత్తర్వుల్లో చూపారన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధుల ఖర్చుకు సంబంధించి ప్రతి అంశంపై రికార్డులను చూపామని, తాను ప్రతిదీ పరిశీలించి సంతకం చేశానన్నారు. రూ.51 లక్షల్లో విద్యుత్ బిల్లులు, పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు బ్యాంకు ద్వారా చెల్లించామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఖర్చుచేశారని చూపుతూ చెక్‌పవర్ తొలగించారన్నారు. ఇది రాజకీయకక్ష సాధింపులో భాగమన్నారు. తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తామన్నారు. ఎంపీపీ కోనం బ్రహ్మయ్య మాట్లాడుతూ సర్పంచ్ అవినీతిని నిరూపిస్తే తాను కూడా రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన సర్పంచ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడాల్సిన అవసరం లేదన్నారు. సర్పంచ్ భర్త డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ పొదలకూరులో మూడు దశాబ్దాలుగా తాను పేదల డాక్టర్‌గా పేరు సంపాదించుకున్నట్టు తెలిపారు. తాను సంపాదించుకోవాలంటే ప్రాక్టీసు ద్వారా ఎప్పుడో రూ.కోట్లు ఆర్జించవచ్చన్నారు. పేదలకు సేవచేసిన భాగ్యంతో ప్రజలు 2,300 ఓట్ల మెజారిటీ అందించారన్నారు. ప్రాణత్యాగానికైనా వెనకాడబోమని అవినీతికి పాల్పడే ప్రశ్నేలేదన్నారు. ఉపసర్పంచ్ సోమా అరుణ కూడా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. -
అవమానంతో టీడీపీ మహిళా మేయర్ కంటతడి
-
టీడీపీ మహిళా మేయర్‌కు అవమానం
సాక్షి, రాజమండ్రి : వ్యవసాయ కళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో ప్రొటోకాల్ వివాదం ఏర్పడింది. శంకుస్థాపన శిలాఫలకంపై నగర మేయర్ రజనీశేషసాయి పేరు లేదు. దీనిపై మేయర్ రజనీ శేషసాయి ఆవేదన వ్యక్తం చేశారు. కంటతడి పెట్టుకున్నారు. తనను కార్యక్రమానికి ఆహ్వానించి అధికారులు అవమానించాంటూ ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. తనను పిలవకపోయినా బాధపడేదానిని కాదని, కానీ ఇలా పిలిచి అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిషయంపై కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం కార్యక్రమం ప్రారంభం కాకముందే సభా వేదిక నుంచి మేయర్ వెళ్లిపోయారు. అయితే కార్యక్రమం నుంచి మేయర్ వెళ్లిపోవడం అక్కడకు వచ్చిన పార్టీ నేతల్లోను ఒకింత ఆలోచనను కలిగించింది. అవసరం తీరాక అందరినీ వదిలించకోవడం, గిట్టని వారిని అవమానించడం పార్టీలో మామూలే కదా, అయినా మేయర్ పరిస్థితే ఇలా ఉంటే సాధారణ, చిన్న స్థాయి నేతల పరిస్థితి ఏంటో అని అనుకుంటున్నారు. -
రైతులా మాట్లాడు.. రెబల్‌లా కాదు
సాక్షి, అమరావతి/ప్రత్తిపాడు: ‘రైతులా మాట్లాడు.. రెబల్‌లా కాదు’.. సాక్షాత్తూ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఓ రైతుతో అన్న మాటలివి. మంత్రితో సమస్యలు చెప్పుకోవడమే ఆ రైతు చేసిన పాపం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని తిక్కిరెడ్డిపాలెం, కోయవారిపాలెం గ్రామాల్లో గురువారం మంత్రి సోమిరెడ్డి.. స్థానిక ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు, వ్యవసాయ శాఖ కమిషనర్‌తో కలిసి పత్తి పొలాలను పరిశీలించారు. చివరి భూములకు నీరు రాక పొలాలు ఎండుతున్నాయని, గులాబీ రంగు పురుగులు పంటను నాశనం చేస్తున్నా అవగాహన కల్పించే వారే కరువయ్యారని రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నకిలీ విత్తనాలతో నిలువునా మోసపోయామని, గుడ్డి పత్తికి కనీస ధర కల్పించాలని విన్నవించారు. కొనుగోలు కేంద్రాలను గుంటూరు, పర్చూరులో కాకుండా ప్రత్తిపాడులో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ క్రమంలో మంత్రి సోమిరెడ్డి కలగజేసుకుని ‘ముందు ఒక రైతులాగా మాట్లాడు.. రెబల్‌లా కాదు’ అంటూ సమస్యలు వివరిస్తున్న రైతుపై ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. పత్తి పొలానికి పచ్చ కార్పెట్.. కాగా మంత్రి రాక సందర్భంగా వ్యవసాయ అధికారులు తమ స్వామి భక్తి చాటుకున్నారు. మట్టిపై నడుచుకుంటూ పొలంలోకి వెళ్తే మంత్రి కాళ్లు కమిలిపోతాయనుకున్నారో, మట్టి అంటుకుంటుందనుకున్నారో.. రోడ్డుపై నుంచి పత్తి చేను లోపల వరకు కార్పెట్ పరచగా దీనిపైనే మంత్రి నడుచుకుంటూ వెళ్లారు. లంచాలు ఇస్తే ఏవైనా కొనేస్తారా? వేరుశనగ, శనగ విత్తనాల పుచ్చులపై మంత్రి సోమిరెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచాలు ఇస్తే ఏవైనా కొనేస్తారా? అని ప్రశ్నించారు. ’లక్ష క్వింటాళ్ల విత్తనాలు పుచ్చిపోతున్నాయ్!’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై మంత్రి స్పందించి అధికారుల వివరణ కోరారు. ఈ నెల 15 నుంచి మూడు రోజులపాటు విశాఖలో వ్యవసాయ సాంకేతిక సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి సచివాలయంలో తెలిపారు. -
అయ్యా..రుణాలు మాఫీ కాలేదు
నెల్లూరు(అర్బన్): నగరంలోని కలెక్టరేట్లో రుణమాఫీపై శనివారం గ్రీవెన్స్ నిర్వహించారు. వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో పాటు వ్యవసాయ కమిషనర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇప్పటి వరకు రుణమాఫీ పొందని, మొదటి విడత పొంది, రెండో విడత పొందని రైతులు భారీగా తరలిరావడంతో కలెక్టరేట్ కిక్కిరిసింది. అధి కారులు ఏర్పాట్లలో విఫలమవడంతో గందరగోళం నెలకొంది. మధ్యాహ్న భో జన విరామ సమయానికి సుమారు 1500 మంది రైతులు కలెక్టరేట్ వద్ద పడిగాపులు కాశారు. అధికారులు కేవలం 500 మంది కి టోకన్లు అందజేశారు. మధ్యాహ్నం నుం చి టోకన్లు అందజేసిన రైతుల దరఖాస్తులు మాత్రమే స్వీకరిస్తామని, మిగిలిన వా రు ఆదివారం రావాలని తెలిపారు. దీంతో వందలాది మంది రైతులు నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయం తెలియక మధ్యాహ్నం నుంచి కలెక్టరేట్‌కు చేరుకున్న రైతులకు సమాధానం చెప్పే వారు కరువయ్యారు. రైతుల సంతోషం కోసమే రైతులు సంతోషంగా ఉండాలనే ధ్యేయంతో కష్టతరమైనా ప్రభుత్వం రుణమాఫీ చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో రుణమాఫీ ఫిర్యాదుల విభాగాన్ని ప్రారంభించిన మంత్రి సోమిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. అన్ని బ్యాంకుల నుంచి పంట రుణాల వివరాలు తెప్పించుకుని రుణమాఫీ చేస్తున్నామన్నారు. 2007 నుంచి 2013 వరకు నిల్వ ఉన్న ఖాతాలను పరిశీలించి వడ్డీతో సహారుణమాఫీ చేస్తున్నామన్నారు. మూడో విడతతో కలిపి మొత్తం రూ.14,710 కోట్లు మాఫీ చేశామన్నారు. రైతు సాధికారత సంస్థ 9లక్షల ఫిర్యాదులను పరిశీలించిందని, అందులో 5.72 లక్షల ఫిర్యాదులు న్యాయమని తేల్చిందన్నారు. వీరందరికీ వివిధ దశల్లో రుణమాఫీ చేస్తున్నామన్నారు. ఉద్యానవన పంటల కింద రూ.384.47 కోట్లు, మరణించిన రైతులకు సంబంధించి రూ.51.54 కోట్లు రుణ ఉపశమనం కల్పించామన్నారు. బ్యాంకుల్లో సాంకేతిక కారణాలతో కొందరికి రుణమాఫీ జరగలేదని, వారందరికీ ఇప్పుడు ఇస్తున్నామని తెలిపారు. కలెక్టర్ ముత్యాలరాజు మాట్లాడుతూ అర్హులైన రైతులందరికీ న్యాయం చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, జేసీ2 వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు. బ్యాంకర్లు తిప్పుకుంటున్నారు నాకు రూ.26,321 రుణమాఫీ జరిగినట్లుగా అధికారులు తెలిపారు. యూబీఐ బ్యాంకుకు వెళ్తే రుణమాఫీ జరగలేదన్నారు. విజయవాడ రైతు సాధికారత సంస్థ వద్దకు వెళ్తే వారు ఒకేసారి మొత్తం రుణ మాఫీ చేసినట్టు పది నెలల క్రితం లెటర్ ఇచ్చారు. బ్యాంకు అధికారులకు ఇచ్చే ఆన్లైన్లో చెక్ చేసి ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని చెబుతున్నారు. –వల్లూరు మస్తాన్, సాయిపేట ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మానాన్న పాశం చిన మాలకొండయ్య రూ.20 వేలు క్రాప్‌లోను తీసుకున్నాడు. రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకున్నా ఒక్క రూపాయి ఖాతాలో జమకాలేదు. అధికారులు స్పందించి రుణమాఫీ చేయాలి. –లక్ష్మి, తాళ్లూరు -
రాంగోపాల్ వర్మ వర్సెస్ మంత్రి సోమిరెడ్డి
సాక్షి, అమరావతి : ఎన్టీ రామారావు జీవిత చరిత్ర కథాంశంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించ తలపెట్టిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాపై బుధవారం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సినీ దర్శకుడి మధ్య విమర్శల యుద్ధం జరిగింది. సినిమాలో లక్ష్మీ పార్వతినే హీరోయిన్గా పెట్టుకొండని మంత్రి సోమిరెడ్డి ఎద్దేవా చేయగా.. ‘లక్ష్మీపార్వతి పక్కన మిమ్మల్నే హీరోగా పెట్టుకుంటా’ అంటూ రాంగోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చారు. సినిమా నిర్మాణంపై మంత్రి సోమిరెడ్డి బుధవారం వెలగపూడి సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘రాంగోపాల్ వర్మ ఎప్పుడూ వివాదాలతో సంచలనం అవ్వాలనుకుంటారు. పనీ పాట లేని వాళ్లే ఇలాంటి పనులు చేస్తారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో లక్ష్మీపార్వతినే హీరోయిన్గా పెట్టుకోండి. ఈ సినిమా వెనుక వైసీపీ నేతలు ఉన్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రకు భంగం కలిగేలా సినిమా ఉంటే ఆయన అభిమానులు రాంగోపాల్ వర్మకు బుద్ధి చెబుతారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు జగన్ నిర్మాతగా ఉండి, లక్ష్మీపార్వతిని హీరోయిన్గా, జబర్దస్త్ నటులను సినిమాలో కో ఆర్టిస్టులుగా పెట్టుకుంటే మరీ మంచిది’ అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలుసని చెప్పారు. మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యలపై రాంగోపాల్ వర్మ వెంటనే స్పందించారు. ‘మీ ఉచిత సలహాకు ధన్యవాదాలు. మీరు ఓకే అంటే లక్ష్మీపార్వతి పక్కన మిమ్మల్నే హీరోగా పెట్టుకుంటా’ అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. -
మంత్రి అవతారమెత్తిన సోమిరెడ్డి తనయుడు
- నిబంధనలకు మంగళం - మంత్రి హోదాలో ఎత్తిపోతల పథకానికి పూజలు పొదలకూరు: అధికారాన్ని అడ్డుపెట్టుకుని తెలుగుదేశం నేతలు చెలరేగిపోతున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తనయుడు రాజగోపాల్‌రెడ్డి ఏకంగా మంత్రి అవతారమెత్తారు. నిబంధనలను పట్టించుకోకుండా, అధికారిక హోదా ఏమీ లేకపోయినా శనివారం ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పొదలకూరులో కండలేరు ఎడమ గట్టు కాలువపై రూ.60 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇటీవల రెండుసార్లు తెలుగుగంగ ఇంజనీరింగ్ అధికారులు ట్రయిల్ రన్ వేశారు. పైపుల మధ్య నీరు లీకవడంతో మరమ్మతులు పూర్తి చేయించారు. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తుది ట్రయల్ రన్ కార్యక్రమం నిర్వహించి ఎత్తిపోతల పథకానికి సాగునీటిని అధికారికంగా విడుదల చేస్తారని అధికారులు ప్రకటించారు. అయితే మంత్రికి బదులుగా ఆయన కుమారుడు రాజగో పాల్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై కాలువ తూము వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం నీటిని కూడా విడుదల చేశారు. సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్తగా తన కుమారుడే ఉంటారని ఇటీవల ప్రకటించిన మంత్రి సోమిరెడ్డి శనివారం పార్టీ శ్రేణులను రాజగోపాల్‌రెడ్డి వెంట పంపించి నీటి విడుదల కార్యక్రమం జరిపించారు. ప్రోటోకాల్ వివాదం రాజుకుంటుందని భావించిన ఇంజనీర్లు, అధికారులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు. పార్టీ శ్రేణులే అన్నీ తామై మంత్రి కుమారుడితో ఎత్తిపోతల నుంచి నీరు విడుదల చేయించడంతో ఇది పార్టీ కార్యక్రమమో, ప్రభుత్వ కార్యక్రమమో తెలియక రైతులు తలలు పట్టుకున్నారు. -
బలిసిందా? తంతా!
► సీఐని తిట్టేసిన మంత్రి సోమిరెడ్డి ► ఇది మర్యాద కాదని నిలదీసిన సీఐ నెల్లూరు: మంత్రి వస్తే రావాలని తెలీదా ? బలిసిందా? తంతాను జాగ్రత్త అంటూ నెల్లూ రు నాలుగో టౌన్ సీఐ సీతా రామయ్యపై వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చిందులేశారు. తానేం తప్పు చేశానని కొడతారు? ఇదేం బాగా లేదని మంత్రిని సీఐ నిలదీశారు. ఈ వ్యవహారంపై మంత్రి సోమిరెడ్డి ఆగ్రహించడంతో సీఐని వీఆర్‌కు పంపుతూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. విశ్వసనీయ సమాచారం మేరకు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్లో పూలు, పండ్ల వ్యాపారులకు షెడ్ల నిర్మాణం కోసం ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఓ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అదే సమయంలో తన పరిధిలోని ఒక ప్రాంతంలో గొడవ జరుగుతోందని ఎస్పీ విశాల్‌గున్నీకి సమాచారం అందింది. ఎస్పీ ఆదేశం మేరకు ఇద్దరు ఎస్ఐలను డ్యూటీలో ఉంచి సీఐ గొడవ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు. ఈలోపు మార్కెట్‌కు వచ్చిన మంత్రి సోమిరెడ్డి ఎస్ఐలను చూసి మంత్రి వస్తే సీఐ రావాలని తెలీదా? మీకేం బలిసిందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. మంత్రి ఆగ్రహించిన విషయాన్ని ఎస్ఐలు సీఐకి చేరవేశారు. సీఐ సీతారామయ్య వెంటనే కూరగాయల మార్కెట్ వద్దకు వచ్చి కార్యక్రమం ముగిశాక మంత్రికి కనిపించారు. సీఐని చూడటంతోనే సోమిరెడ్డి ఆయన మీద మండి పడుతూ మంత్రి వస్తే రావాలని తెలీదా? బలిసిందా? నిన్ను తంతాను అని దుర్భాషలాడారని సమాచారం. ఈ సంఘటనతో తీవ్ర ఆవేదన చెందిన సీఐ సీతారామయ్య తానేం తప్పు చేశానని తంతారని, మర్యాదగా మాట్లాడాలని ఎదురు తిరిగారు. మంత్రి తనను దూషించారని సీఐ అదే రోజు జిల్లా ఎస్పీకి, ఐజీకి ఫిర్యాదు చేశారు. ప్రజల ముందు సీఐ తనకు ఎదురు తిరిగారని, అతడి మీద చర్యలు తీసుకోవాలని మంత్రి సోమిరెడ్డి గుంటూరు ఐజీ సంజయ్ మీద ఒత్తిడి తెచ్చారని తెలిసింది. మంత్రి ఒత్తిడి మేరకు సీతారామయ్యను వీఆర్‌కు పంపుతూ బుధవారం రాత్రి ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన స్థానంలో సీసీఎస్ సీఐ సుధాకర్‌రెడ్డిని నియమించారు. ఈ వ్యవహారంపై పోలీసు అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఐని మంత్రి దూషిస్తే, తిరిగి ఆయన్ను వీఆర్‌కు పంపుతూ ఐజీ ఉత్తర్వులు జారీ చేయడాన్ని వారు తప్పు పడుతున్నారు.