మాట్లాడుతున్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు(సెంట్రల్): వెంకటాచలం మండలం రామదాసు కండ్రికలో నకిలీ పట్టాల సృష్టి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అండతోనే జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న సోమిరెడ్డికి కనీసం సీజేఎఫ్‌ఎస్, డీకేటీ పట్టాలకు తేడా తెలియకుండా సంతకాలు పెట్టడం సిగ్గు చేటని, ఇటువంటి వ్యక్తి ప్రభుత్వంలో మంత్రిగా ఉండటం దౌర్భాగ్యంగా ఉందని ఎద్దేవా చేశారు. నెల్లూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో బాధితులతో కలిసి బుధవారం విలేకరుల సమావేశంలో కాకాణి మాట్లాడారు. రామదాసుకండ్రిక ప్రాంతంలో మందల చెంచయ్య, మందల వెంకయ్య, మందల రామయ్య, మందల జయరామయ్యల పేరు మీద ఒక్కొక్కరికి 2.4 ఎకరాల చొప్పున మొత్తం 8.16 ఎకరాలు భూమి ఉందన్నారు. ఈ భూమిని కొన్నేళ్లుగా వీరే సాగు చేసుకుంటున్నారన్నారు. కానీ అధికార పార్టీ నాయకులు, మంత్రి చంద్రమోహన్‌రెడ్డి అనుచరులు వాకా నారయ్య, సండి వెంకటసుబ్బయ్య, మల్లి రమణయ్య, సండి రమణయ్య ఈ పొలంలోని కొంత బాగానికి సంబంధించి నకిలీ పట్టాలు సృష్టించి ప్రభుత్వం నుంచి పరిహారం కోసం మంత్రి సోమిరెడ్డితో నకిలీ పట్టాలపై సంతకాలు కూడా పెట్టించుకున్నారన్నారు. అంతకు ముందు మరికొంత పొలానికి గుమ్మా జయరామయ్య, దుర్గం శ్రీనివాసులు, మల్లి అంకయ్య, చల్లా తిరుపాలు, బూడిత శేషయ్య నకిలీ పట్టాలు సృష్టించి మంత్రి సోమిరెడ్డి వద్ద కూడా సంతకాలు పెట్టించుకున్నారన్నారు.
చిత్తశుద్ధి ఉంటే వారిపై చర్యలు తీసుకునేవారు
నిత్యం తన కంటే నీతిమంతుడు లేరని గప్పాలు కొట్టుకునే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నకిలీ పట్టాలు సృష్టించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలన్నారు. మంత్రి పాత్ర లేకుంటే నకిలీ పత్రాలపై మంత్రి సోమిరెడ్డితో ఎవరు సంతకాలు పెట్టించారో సమాధానం చెప్పాలన్నారు. మంత్రికి సంబంధం లేనప్పుడు నకిలీ పట్టాలు సృష్టించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రావెల్ నుంచి రైతురథం వరకు, మట్టి నుంచి నీరు– చెట్టు వరకు..ఇలా ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా అవినీతికి పాల్పడింది నిజం కదా అని నిలదీశారు. నకిలీ ఎరువులతో రైతుల కడుపు కొట్టిన చరిత్ర రైతాంగం ఎన్నటికి మరువదని గుర్తుచేశారు. చివరకు పేదల భూములకు నకిలీ పట్టాలు సృష్టించి పరిహారం కాజేసేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. పేదల కడుపులు కొట్టడం సిగ్గు చేటన్నారు. నకిలీ పత్రాలు సృష్టించి పరిహారం కాజేయాలనుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీల దృష్టికి తీసుకు పోతామన్నారు. ఈ సమావేశంలో వెంకటాచలం జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌గౌడ్, బాధితులు మందల కృష్ణయ్య, మందల వెంకటకృష్ణయ్య, మందల రవి, జి సుధాకర్ పాల్గొన్నారు.
వామపక్షాలకు వైఎస్సార్‌సీపీ మద్దతు
ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జిల్లాలో వామపక్ష పార్టీలు గురువారం తలపెట్టిన జాతీయరహదారుల దిగ్బంధం కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు సైతం వామపక్షాలు చేస్తున్న దిగ్బంధం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక హోదా ఆకాంక్షను చాటాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment