బలిసిందా? తంతా!
బలిసిందా? తంతా!
Published Thu, May 25 2017 7:43 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
► సీఐని తిట్టేసిన మంత్రి సోమిరెడ్డి
► ఇది మర్యాద కాదని నిలదీసిన సీఐ
నెల్లూరు: మంత్రి వస్తే రావాలని తెలీదా ? బలిసిందా? తంతాను జాగ్రత్త అంటూ నెల్లూ రు నాలుగో టౌన్ సీఐ సీతా రామయ్యపై వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చిందులేశారు. తానేం తప్పు చేశానని కొడతారు? ఇదేం బాగా లేదని మంత్రిని సీఐ నిలదీశారు. ఈ వ్యవహారంపై మంత్రి సోమిరెడ్డి ఆగ్రహించడంతో సీఐని వీఆర్‌కు పంపుతూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
విశ్వసనీయ సమాచారం మేరకు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్లో పూలు, పండ్ల వ్యాపారులకు షెడ్ల నిర్మాణం కోసం ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఓ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అదే సమయంలో తన పరిధిలోని ఒక ప్రాంతంలో గొడవ జరుగుతోందని ఎస్పీ విశాల్‌గున్నీకి సమాచారం అందింది. ఎస్పీ ఆదేశం మేరకు ఇద్దరు ఎస్‌ఐలను డ్యూటీలో ఉంచి సీఐ గొడవ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు.
ఈలోపు మార్కెట్‌కు వచ్చిన మంత్రి సోమిరెడ్డి ఎస్‌ఐలను చూసి మంత్రి వస్తే సీఐ రావాలని తెలీదా? మీకేం బలిసిందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. మంత్రి ఆగ్రహించిన విషయాన్ని ఎస్‌ఐలు సీఐకి చేరవేశారు. సీఐ సీతారామయ్య వెంటనే కూరగాయల మార్కెట్ వద్దకు వచ్చి కార్యక్రమం ముగిశాక మంత్రికి కనిపించారు. సీఐని చూడటంతోనే సోమిరెడ్డి ఆయన మీద మండి పడుతూ మంత్రి వస్తే రావాలని తెలీదా? బలిసిందా? నిన్ను తంతాను అని దుర్భాషలాడారని సమాచారం. ఈ సంఘటనతో తీవ్ర ఆవేదన చెందిన సీఐ సీతారామయ్య తానేం తప్పు చేశానని తంతారని, మర్యాదగా మాట్లాడాలని ఎదురు తిరిగారు. మంత్రి తనను దూషించారని సీఐ అదే రోజు జిల్లా ఎస్పీకి, ఐజీకి ఫిర్యాదు చేశారు.
ప్రజల ముందు సీఐ తనకు ఎదురు తిరిగారని, అతడి మీద చర్యలు తీసుకోవాలని మంత్రి సోమిరెడ్డి గుంటూరు ఐజీ సంజయ్ మీద ఒత్తిడి తెచ్చారని తెలిసింది. మంత్రి ఒత్తిడి మేరకు సీతారామయ్యను వీఆర్‌కు పంపుతూ బుధవారం రాత్రి ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన స్థానంలో సీసీఎస్ సీఐ సుధాకర్‌రెడ్డిని నియమించారు. ఈ వ్యవహారంపై పోలీసు అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఐని మంత్రి దూషిస్తే, తిరిగి ఆయన్ను వీఆర్‌కు పంపుతూ ఐజీ ఉత్తర్వులు జారీ చేయడాన్ని వారు తప్పు పడుతున్నారు.
Advertisement
Advertisement