
సాక్షి, అమరావతి : ఎన్టీ రామారావు జీవిత చరిత్ర కథాంశంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించ తలపెట్టిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాపై బుధవారం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సినీ దర్శకుడి మధ్య విమర్శల యుద్ధం జరిగింది. సినిమాలో లక్ష్మీ పార్వతినే హీరోయిన్‌గా పెట్టుకొండని మంత్రి సోమిరెడ్డి ఎద్దేవా చేయగా.. ‘లక్ష్మీపార్వతి పక్కన మిమ్మల్నే హీరోగా పెట్టుకుంటా’ అంటూ రాంగోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చారు.
సినిమా నిర్మాణంపై మంత్రి సోమిరెడ్డి బుధవారం వెలగపూడి సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘రాంగోపాల్ వర్మ ఎప్పుడూ వివాదాలతో సంచలనం అవ్వాలనుకుంటారు. పనీ పాట లేని వాళ్లే ఇలాంటి పనులు చేస్తారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో లక్ష్మీపార్వతినే హీరోయిన్‌గా పెట్టుకోండి.
ఈ సినిమా వెనుక వైసీపీ నేతలు ఉన్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రకు భంగం కలిగేలా సినిమా ఉంటే ఆయన అభిమానులు రాంగోపాల్ వర్మకు బుద్ధి చెబుతారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు జగన్ నిర్మాతగా ఉండి, లక్ష్మీపార్వతిని హీరోయిన్‌గా, జబర్దస్త్ నటులను సినిమాలో కో ఆర్టిస్టులుగా పెట్టుకుంటే మరీ మంచిది’ అని వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలుసని చెప్పారు. మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యలపై రాంగోపాల్ వర్మ వెంటనే స్పందించారు. ‘మీ ఉచిత సలహాకు ధన్యవాదాలు. మీరు ఓకే అంటే లక్ష్మీపార్వతి పక్కన మిమ్మల్నే హీరోగా పెట్టుకుంటా’ అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment