
సాక్షి, రాజమండ్రి : వ్యవసాయ కళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో ప్రొటోకాల్ వివాదం ఏర్పడింది. శంకుస్థాపన శిలాఫలకంపై నగర మేయర్ రజనీశేషసాయి పేరు లేదు. దీనిపై మేయర్ రజనీ శేషసాయి ఆవేదన వ్యక్తం చేశారు. కంటతడి పెట్టుకున్నారు. తనను కార్యక్రమానికి ఆహ్వానించి అధికారులు అవమానించాంటూ ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. తనను పిలవకపోయినా బాధపడేదానిని కాదని, కానీ ఇలా పిలిచి అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈవిషయంపై కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం కార్యక్రమం ప్రారంభం కాకముందే సభా వేదిక నుంచి మేయర్ వెళ్లిపోయారు. అయితే కార్యక్రమం నుంచి మేయర్ వెళ్లిపోవడం అక్కడకు వచ్చిన పార్టీ నేతల్లోను ఒకింత ఆలోచనను కలిగించింది. అవసరం తీరాక అందరినీ వదిలించకోవడం, గిట్టని వారిని అవమానించడం పార్టీలో మామూలే కదా, అయినా మేయర్ పరిస్థితే ఇలా ఉంటే సాధారణ, చిన్న స్థాయి నేతల పరిస్థితి ఏంటో అని అనుకుంటున్నారు.