కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మంత్రి సోమిరెడ్డి
అనకాపల్లి: ‘ఏయ్ ఏంటి గట్టిగా మాట్లాడుతున్నారు.. గట్టిగా మాట్లాడితే జీతాలిప్పించను’ అంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అనకాపల్లిలో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులపై మండిపడ్డారు. 42 నెలలుగా తమకు రావాల్సిన వేతన బకాయిల కోసం అడగడానికి వెళ్లిన కార్మికులపై మంత్రి విరుచుకుపడడంతో వా రు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. సోమవారం విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో జరిగిన 59వ కిసాన్ మేళా సందర్భంగా ఈఘటన జరిగింది. ఈ మేళాకు మంత్రి సోమిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదిక ఎక్కే ముందు కార్మికులు ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు.
కార్మికులకు 42 నెలలుగా జీతాల్లేవని, ఇటీవల ఎన్‌ఎంఆర్ కార్మికులను తొలగిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. మంత్రి మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, రైతులకు తాము భరోసా ఇస్తామని చెప్పి ప్రసంగం ముగించారు. మంత్రి ప్రసంగం పూర్తయిన వెంటనే కార్మికుల సమస్యలపై మాట్లాడాలంటూ సీపీఎం నేత బాలకృష్ణ, ప్రజా రాజకీయ ఐక్యవేదిక కన్వీనర్ కనిశెట్టి సురేశ్‌బాబు, ఆమ్‌ఆద్మీ పార్టీ నేత కొణతాల హరనాథబాబులు నినాదాలు చేశారు. సమస్యలను ప్రస్తావిస్తానంటూనే మంత్రి వేదిక దిగి వెళ్లిపోయారు.
మంత్రి తమ గురించి మాట్లాడతారని ఎదురుచూసిన ఎన్‌ఎంఆర్ కార్మికులు నిరాశ చెంది నినాదాలు చేశారు. స్పందించిన మంత్రి సోమిరెడ్డి ఎన్‌ఎంఆర్ కార్మిక నేత నర్సింగరావును పిలిచి ఏం అరుస్తున్నావ్ అని అడిగారు. తమ కష్టాల గురించి స్పందించలేదంటూ నర్సింగరావు ఆవేదన వ్యక్తం చేస్తూనే.. జీతాలను ఇప్పించాలని కోరారు. దీంతో గట్టిగా అరిస్తే జీతాలు రానీయకుండా చేస్తాననడంతో కార్మికులు అసంతృప్తికి గురయ్యారు. కార్మికులకు భరోసా ఇచ్చేలా మాట్లాడకుండా మంత్రి వ్యవహరించడం దారుణమని ప్రజా సంఘాల నేతలు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment