నేల ఉంది నీరు లేదు. చేవ ఉంది సాగు లేదు. బీజం ఉంది జీవం లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆకలి తీరేదెలా? మనిషి బతికేదెలా? ఏడాదిలో ఎప్పుడో ఓసారి పడీపడనట్లు పడే నాలుగు వాన చుక్కలతోనే జీవం పోసుకోవాలి. మబ్బు ఎంతిస్తే నేల అంతే తీసుకోవాలి. అంతకంటే వేరే ఆధారం లేదు. కరెంటు బోర్లు లేవు, పంట కాలువలు లేవు. నేలలో ఇంకిన నాలుగు నీటి చుక్కలతోనే జీవం పోసుకోగలిగిన గింజలను నమ్ముకోవాలి. అందులోనే పచ్చదనాన్ని వెతుక్కోవాలి... బతుకు చిత్రాన్ని దిద్దుకోవాలి. జహీరాబాద్‌లోని గిరిజన తండాలు ఇప్పుడు ఈ ‘దిద్దుబాట’లోనే పండుగ సంతోషాన్ని వెతుక్కుంటున్నాయి. పంటల జాతర చేసుకుంటున్నాయి. మెదక్ జిల్లా జహీరాబాద్‌లోని గిరిజన తండాల ప్రజలు నది తీరంలో ఏమీ జీవించడం లేదు. ప్రాజెక్టు సాగు కింద లేదు వాళ్ల భూమి. ఎర్రటి ప్రచండభానుడి తీక్షణ దృక్కుల కింద ఉంది వాళ్ల జీవితం.
ఆ నేలలో తల్లిని చూశారు వాళ్లు. పొద్దు పొడవక ముందు నుంచి పొద్దు కుంకే వరకు రెక్కలు ముక్కలు చేసుకున్నారు. మట్టిని నమ్ముకుంటే బతుకు పండుతుందని నిరూపిస్తున్నారు. పండుగ చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ అంటే పంటల పండుగ. పంట లక్ష్మి ఇంటికి వచ్చిన లక్షణమైన పండుగ. ఈ లక్షణాలను అందరూ పుణికిపుచ్చుకోవాలని ఊరూరా తిరిగి చెబుతున్నారు. ‘దేవుడమ్మ దేవుడు... మా ఊరి దేవుడు... మీ ఊరికొచ్చాడు’ అని జాతర చేస్తూ ఇరుగుపొరుగు తండాలకు చెబుతున్నారు. పంటల జాతరలో ఊళ్లకు ఊళ్లు కలిసి సంబరం చేసుకుంటున్నాయి.మెదక్ జిల్లా, జహీరాబాద్ మండలంలోని లక్ష్మణ్ నాయక్ పంచాయతీలోని మూడ్‌తండాలో మొదలైంది ఈ పంటల జాతర.
ఈ నెల 14వ తేదీన భోగిపండుగ రోజున లంబాడా సంప్రదాయ ఆటపాటలతో మొదలైన ఈ జాతర బండ్లు ఇప్పుడు ఇరుగుపొరుగు తండాలలో పర్యటిస్తున్నాయి. ఈ పంటల బండ్లు ఫిబ్రవరి 13వ తేదీ నాటికి ఝరాసంఘం మండలంలోని మాచ్‌నూర్ గ్రామం చేరుకుంటాయి. మొత్తం 23 గ్రామాల్లో డెబ్బైకి పైగా తండాల జనాలకు తాము పండించిన పంటలను ఊరేగిస్తారు. మాచ్‌నూర్‌లో ఆటపాటలతో ముగింపు వేడుక చేసుకుంటారు.ప్రకృతిని దైవంగా పూజించడం ప్రాచీనంగా వస్తున్న ఆచారమే, నేలకు మొక్కే కల్చర్ మనది. చెట్టును ప్రేమించే సంప్రదాయం మనది.
చెట్టు కోసం ప్రాణాలర్పించే బిష్ణోయి గిరిజనులున్నారు రాజస్తాన్‌లో, మచ్చిక చేసుకున్న మృగాన్ని అక్కున చేర్చుకుని స్తన్యమిచ్చి ఆకలి తీర్చే తల్లులు ఆ గిరిజన మహిళలు. తోటి వారి ఆకలి తీర్చే సంప్రదాయంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చారు అర్జున్ నాయక్ తండా గిరిజన మహిళలు. తాము పండించిన పంటలనే దేవుళ్లుగా కొలుస్తున్నారు. ఆ పంటలకే జాతర చేస్తున్నారు. అంకాళమ్మ, పోలేరమ్మ వంటి గ్రామ దేవతల జాతర్లలో వేడుక చేసుకున్నట్లే పంటల జాతరనూ ఊరు ఊరంతా కలిసి సంతోషాల పంటగా మలుచుకున్నారు. ఒకరి దగ్గరున్న గింజలను మరొకరికి పంచుతారు. అందరూ నేలనిండుగా పంటలు పండించుకోవాలని కోరుకుంటారు.
ఇన్ని రకాల ధాన్యాలా!
వరి పండని నేలలో పండే ప్రతి గింజనూ అపురూపంగా దాచుకున్నారీ మహిళలు. తమకున్న కొద్ది నేలలోనే మడులు కట్టారు. జొన్నలు, రాగులు, సజ్జలు, అరికెలు, వరిగెలు, కొర్రలు, నువ్వులు, అవిశెలు, సాయిజొన్న, కందులు, పెసలు, అండుకొర్రలు, సామలు... ఇలా దేనికది విడిగా పంటలు పెట్టారు. ఇన్ని పంటలెందుకంటే... ‘‘ఒకటి పోయినా ఒకటి పండుతుంది. ఏడాదికి కడుపు నింపుతుంది. ఒకటి వానకు తట్టుకునే పంట, ఒకటి ఎండకు తట్టుకునే రకం, ఒకటి మంచుకు పట్టే తెగుళ్లను తట్టుకుంటుంది. ఇలా కలిపి పెట్టుకుంటే ఒక పంట మరో పంటకు ఎరువవుతుంది’’ అంటారు.
ఒక్కొక్కరు పది రకాలకు తక్కువ లేకుండా పండిస్తున్నారు. మొత్తం ఎనభై రకాల చిరుధాన్యాలు పండిస్తున్నారు. ఇంకా ‘‘వాన నీళ్లు, నేల మట్టి సారంతోనే పండుతాయి. మందుల్లేవు, ఎరువుల్లేవు మా పంటలకు. మేము గంపలో గింజను నిల్వ చేస్తే మూడేళ్లకు నేల మీద చల్లినా మొలకలొస్తాయి. పెద్ద కంపెనీలు మా దగ్గర తీసుకెళ్లి సరిగ్గా నిల్వ చేయకుండా బస్తాల్లో నింపి వాళ్ల పేర్లు వేసి (లేబిల్) అమ్ముతారు. వాటిలో సగం మొలకలొస్తే అదే చాలా ఎక్కువ. అందుకే మా తండాల్లో ఆడవాళ్లందరికీ ధాన్యాన్ని గింజ కట్టడం నేర్పిస్తున్నాం. మేము పండించిన ధాన్యానికి మరొకరు గింజకట్టి వ్యాపారం చేయడమేంటి, వాళ్ల దగ్గర మేము గింజలను కొనడమేంటి’’ అని ఎదురు ప్రశ్నించారు వాళ్లు.
పలకా బలపం çపట్టని గిరిజన మహిళలు... దేశం బహుళ జాతి విత్తనాల కంపెనీల బారిన పడకుండా స్వయంసమృద్ధి సాధన దిశగా నడిపిస్తున్నారు. దేశీయ గింజను కాపాడటం ఎంత గొప్ప పని అనేది వాళ్లకు తెలియదు. వాళ్లకు తెలిసిందల్లా... బిష్ణోయిలు ప్రకృతిని కాపాడటానికి తమ ప్రాణాలను అడ్డువేసినట్లే, కన్నబిడ్డకూ, జింకపిల్లకూ స్తన్యమిచ్చి కాపాడినట్లే... తమతోపాటు తోటి వారి జీవితాలనూ పరిరక్షించుకోవడం. అలాగే... వ్యవసాయంలో జీవ వైవిధ్యతను కాపాడటానికి రెక్కలు ముక్కలు చేసుకోవడం, తాము జీవిస్తూ తోటి వారికి జీవికనివ్వడం కూడా.
– వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment