సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం సీజన్‌లో ఇప్పటివరకు 57.24 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, 46.06 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. వాస్తవంగా గతేడాది వానాకాలం సీజన్లో ఇదే సమయానికి 53.66 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.
అంతకంటే ఇప్పుడు ఎక్కువ సాగు కావడం విశేషం. ఇటీవల వర్షాలు పుంజుకోవడంతో వ్యవసాయ పంటల సాగు ఊపు మీద ఉంది. కాగా, పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 37.98 లక్షల ఎకరాల్లో (75.07%) సాగైంది. ఇక వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 7.94 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి.
పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 9.43 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.04 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.05 లక్షల ఎకరాల్లో (98.21%) సాగైంది. మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 7.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3 లక్షల ఎకరాల్లో సాగైంది.
ఆదిలాబాద్ జిల్లాల్లో 103 శాతం...
రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా పంటలు సాగయ్యాయి. ఆ జిల్లాలో ఏకంగా 103.81 శాతం విస్తీర్ణంలో పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 91.55 శాతం, వికారాబాద్ జిల్లాలో 74.30 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో కేవలం 3.93 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి.
కాగా, రాష్ట్రంలో సంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్, మహబూబాబాద్, ఖమ్మం, నాగర్‌కర్నూలు, వనపర్తి, సూర్యాపేట, జోగుళాంబ జిల్లాల్లో వర్షపాతం తక్కువ నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని వ్యవసాయశాఖ వెల్లడించింది. జూన్‌లో 44 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, జూలైలో ఇప్పటివరకు 34.32శాతం అధిక వర్షపాతం నమోదైందని వెల్లడించింది.
అందుబాటులో ఎరువులు, విత్తనాలు: నిరంజన్ రెడ్డి
ఆలస్యమైనా వర్షాలు సాగుకు సహకరిస్తున్నాయని, ఆశాజనకంగా వ్యవసాయం సాగవుతోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.. సచివాలయంలో బుధవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు కొండిబ పాల్గొన్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది కొత్తగా వచ్చిన ఐదు జిల్లాలతో కలిపి 2.30 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment