కోడూరు మండలం విశ్వనాథపల్లిలోని అపరాల పొలంలో ఎలుకలు పడుతున్న దృశ్యం
రెండో పంటకు నీరివ్వడం.. తెగుళ్ల బెడద తక్కువగా ఉండడంతో రబీలో దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని రైతులు నమ్మకంతో ఉన్నారు. కానీ వారి ఆశలపై మూషికాలు నీళ్లు చల్లుతున్నాయి. సాధారణంగా వర్షాకాలంలో పంటలపై ఎక్కువగా దాడి చేసే ఎలుకలు రబీలో కూడా విజృంభిస్తున్నాయి. ఏపుగా పెరిగిన అపరాలతో పాటు వరిపంటను కూడా దెబ్బతీస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ఎలుకల నుంచి కాపాడుకునేందుకు అన్నదాతలు నానాతంటాలు పడుతున్నారు.
సాక్షి, మచిలీపట్నం: ఖరీఫ్‌లోనే కాదు.. రబీలో కూడా మూషికాలు అన్నదాతలను వణికిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి రబీలో తెగుళ్ల బెడద పెద్దగా లేకున్నప్పటికీ ఎలుకల బెడద మాత్రం చాలా ఎక్కువగా ఉంది. జిల్లాలో రబీ సాధారణ విస్తీర్ణం 5,01,481 ఎకరాలు కాగా, దాంట్లో ఇప్పటివరకు 4,77,959 ఎకరాల్లో పంటలు పడ్డాయి. బోర్ల కింద ఈసారి 63,450 ఎకరాల్లో వరి సాగవ్వాల్సి ఉండగా, ఈసారి రెండో పంటకు నీరివ్వడంతో కనీసం లక్షన్నరవేల ఎకరాలకు పైగా సాగవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 90వేల ఎకరాల్లో రెండో పంట సాగైంది. ఇక మిగిలిన పంటల విషయానికి వస్తే 38,318 ఎకరాల్లో మొక్కజొన్న, 6,593 ఎకరాల్లో శనగలు, 12,645 ఎకరాల్లో పెసలు, 3,10,528 ఎకరాల్లో మినుములు సాగయ్యాయి. రబీలో వరితో పాటు మినుము, పెసలు, శనగలు, మొక్కజొన్న పంటలపై ఎలుకల ప్రభావం ఎక్కువగా ఉంది.
తినేది తక్కువే అయినా..
ఎలుకలు తినేది తక్కువ.. నష్టం చేసేది ఎక్కువ. సాధారణంగా ఖరీఫ్ సీజన్‌లో ఎక్కువగా పంటలను నాశనం చేసే ఎలుకలు ఈసారి రబీలో కూడా తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. అపరాలు, వరికి ఎలుకలు చేసే నష్టం అపారంగా ఉంటోంది. ఊడ్పులు, పిలకలు, పొట్ట దశలో పంటను కోసుకుంటూ పోతున్నాయి. తద్వారా ఎకరాకు 3 నుంచి 4 బస్తాల దిగుబడిపై ప్రభావం చూపుతోంది. ఎలుకల దాడి నుంచి పంటను రక్షించుకునేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు. బందరు, అవనిగడ్డ, కోడూరు, మోపిదేవి, మొవ్వ, నాగాయలంక, చల్లపల్లి, ఘంటసాల, పామర్రు గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, కైకలూరు, నాగాయలంక తదితర పాంతాల్లో ఎలుకుల బెడద ఎక్కువగానే కనిపిస్తుంది.
ఎకరాకు రెండున్నరవేలకు పైగా భారం
ఎలుకల నిర్మూలనకు రైతులు సంప్రదాయ పద్ధతులనే పాటిస్తున్నారు. బొరియల్లో పొగబెట్టడం, బుట్టలు వాడటం, పురుగు మందులు వినియోగించడం ద్వారా నివారణా చర్యలు చేపడుతున్నారు. కొన్నిచోట్ల ఎలుకులను పట్టే వారికి రప్పించి వాటిని మట్టుబెట్టేందుకు యత్నిస్తున్నారు. ఒక్కో దానికి రూ.15ల నుంచి రూ.20లు, కళ్లుతెరవని పిల్లలైతే మూడింటికి రూ.20లు చొప్పున తీసుకుంటున్నారు. ఎలుకల ఉధృతిని బట్టి పూత దశ నుంచి కాయ దశ వరకు రెండు నుంచి నాలుగుసార్లు ఎలుకలు బుట్టలు పెట్టాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. దుబ్బులను కొరికివేయడంతో పంటకు నష్టం వాటిల్లి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం ఎలుకల నిర్మూలనకు ఎకరాకు సుమారు రూ.రెండున్నర వేలకు పైగా రైతులపై ఆర్థిక భారం పడుతోంది.
నివారణ ఇలా..
బ్రోమో డయోలిన్‌ను 0.25 శాతం పొడి మందును ఎర పదార్థాలతో కలిపి పేపరుతో 10 గ్రాముల పొట్లాలుగా కట్టి ఎలుకుల కన్నాల్లో వేయాలి. దీన్ని తింటే నాలుగు రోజుల తర్వాత ఎలుక చని పోతుంది. బ్రోమోడయోలిన్ మందును ప్రభుత్వం అందిస్తుంది. దానిలో కలిపేందుకు అవసరమ య్యే నూకలు, ఆయిల్‌ను పంచాయతీ అధికారులు సమకూర్చుతున్నారు. ఆయా అవకాశాలను సద్వినియోగం చేసుకుని రైతులు ఎలుకల సమస్య నుంచి బయటపడాలని అధికారులు సూచిస్తు న్నారు. రైతులు సామూహికంగా ఎలుకల నివారణను చేపడితే పూర్తిస్థాయిలో వాటి సమస్యను పరిష్కరించవచ్చు. దీనిపై పొలంబడి, ఇతర కార్యక్రమాల ద్వారా అన్నదాతలకు వ్యవసాయశాఖాధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment