ఎలక ఎక్కిరించె!
ఎలక ఎక్కిరించె!
Published Sun, Oct 23 2016 10:01 PM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM
– ఫలితం ఇవ్వని ఎలుకల నిర్మూలన కార్యక్రమం
– రూ.20 లక్షలు వృథా
– పంటలపై ఎలుక దాడి ఉధృతం
– చేసేది లేక రైతులు సొంతంగా ఖర్చు చేసుకుంటున్న వైనం
ఉండి : పిల్లి గుడ్డిదైతే ఎలక ఎక్కిరించిందన్నది సామెత. ఈ ఏడాది సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం ఫలితం చూస్తే ఈ సామెత గుర్తుకురాకమానదు. జిల్లావ్యాప్తంగా మూషికాల నిర్మూలనకు వ్యవసాయ శాఖ రూ.20 లక్షలు ఖర్చు చేయగా పంచాయతీలు ఇంకా ఎక్కువగా ఖర్చు చేశాయి. ఫలితం మాత్రం శూన్యం. సామూహిక ఎలుకల నిర్మూలన పేరుతో ప్రభుత్వం చేసిన హంగామా అంతాఇంతా కాదు. వారం ముందు నుంచి వారం తరువాత వరకు ప్రచారం చేస్తూనే ఉన్నారు. రైతును ఆదుకుటున్నాం అంటూ ఊదరగొట్టారు. తీరా చూస్తే ప్రయోజనం శూన్యం. ఆగస్ట్ 21, 22 తేదీల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. దీని కోసం జిల్లావ్యాప్తంగా 52 మండలాల్లో 903 గ్రామాల్లో ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని రైతులకు రూ.20 లక్షల ఖర్చుతో వ్యవసాయ శాఖ ఎలుకల మందును అందించింది. అంతే కాకుండా సొసైటీలు ఉచితంగా నూకలు అందించాయి. అంతేకాకుండా గ్రామ పంచాయతీలు ఒక్కొక్కటి సుమారుగా రూ.2 వేల చొప్పున ఖర్చు చేశాయి. ఇలా జిల్లాలోని గ్రామ పంచాయతీలు సుమారు రూ.25 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం.
ఫలితం శూన్యం
సామూహికంగా ఎలుకల నిర్మూలన చేపట్టాలంటూ ప్రభుత్వం భారీగా ప్రచారం కూడా చేసింది. రైతులు ఎన్నో ఆశలతో ఈ కార్యక్రమం చేపట్టారు. జిల్లాలో 5.50 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుండగా పూర్తిస్థాయిలో ఎలుకల మందును వినియోగించారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. ప్రస్తుతం వరిచేలల్లో ఎలుకలు ఉధతి విపరీతంగా ఉంది. ప్రభుత్వం సరఫరా చేసిన ఎలుకల మందు ఏమాత్రం ఫలితం ఇవ్వలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. దాదాపు 3 లక్షల ఎకరాల్లో ఎలుకల ఉధతి ఎక్కువగా ఉంది. ప్రభుత్వం అందించిన ఎలుకల మందు పెట్టాము కదా అనే ఆలోచనలో ఉన్న రైతన్నలకు ఎలుకలు సామూహికంగా దాడి చేసి విపరీతమైన పంట నష్టాన్ని కలిగిస్తున్నాయి. దీంతో చేసేది లేక రైతులు తమ సొంత ఖర్చులతో ఎలుకలను పట్టిస్తున్నారు. సొంత రైతులు అయితే కొంతమేర ఇబ్బంది లేదు గాని కౌలు రైతులు అధిక ఖర్చుతో అల్లాడిపోతున్నారు. రైతులంతా ఒకేసారి ఈ కార్యక్రమం చేపట్టడంతో ఎలుకలు పట్టుకునే వారికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఒక్కో ఎలుకకు రైతుల నుంచి రూ.40 నుంచి రూ.50 వసూలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నమ్మి ఎలుకల మందును వాడినందుకు తగిన ఫలితాన్ని అనుభవించాము అని రైతులు వాపోతున్నారు.
ఏమాత్రం ప్రయోజనం లేదు
ప్రభుత్వం అందించిన ఎలుకల మందు వాడటం వల్ల పెద్దగా ప్రభావం చూపడం లేదు. చెప్పినంతగా ఫలితాలు రావడం లేదు. ఎలుకల ఉధతి పంటపై తీవ్రంగా ఉండడంతో సొంత ఖర్చుతో నిర్మూలించుకోవాల్సి వస్తోంది. దీంతో ఖర్చు తడిసిమోపెడవుతోంది.
– పీవీ గోపాలకష్ణంరాజు, రైతు, యండగడి
అధిక వర్షాల వల్లే..
సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో కొంత మేర ఫలితాలు వచ్చాయి. వర్షాలు అధికంగా కురవడంతో ఎలుకల మందు అంతగా ఫలించలేదు. అయితే రైతులంతా సామూహికంగా ఎలుకల నిర్మూలన చేపడితే మంచి ఫలితాలు ఉంటాయి.
– వై.సాయిలక్ష్మీశ్వరి, జేడీ, వ్యవసాయ శాఖ
Advertisement