భారీ వర్షం.. అపార నష్టం
ఆత్మకూరు :
మండలంలో బుధవారం భారీ వర్షం కురిసింది. వాన పడింది గంట సేపే అయినా భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. నర్సరీలు, పంటలు నీట మునిగాయి. దీంతో నిర్వాహకులు, రైతుల జీవనాధారం అతలాకుతలమైంది. స్థానిక ఉన్నత పాఠశాల వద్ద ఉన్న ఐదు నర్సరీల్లోకి వర్షపు నీరు చేరడంతో దాదాపు 10 లక్షల మొక్కలు నీట మునిగి పోయాయని బాధితులు లబోదిబోమన్నారు. ప్రస్తుతం టమాట, మిపర మొక్కలకు మంచి డిమాండ్ ఉంది.
ఒక్కో మొక్క 40 నుంచి 50 పైసలు దాకా నర్సరీల్లో విక్రయిస్తున్నారు. వర్షం దెబ్బతో దాదాపు రూ.5 లక్షల వరకు నష్టం జరిగిందని నిర్వాహకులు వాపోయారు. నీటిలో కొట్టుకు పోతున్న మొక్కల్ని వదిలేయలేక ఓ నర్సరీ నిర్వహకురాలు వాటిని వర్షంలోనే ఏరి భద్ర పర్చింది. అలాగే స్థానిక ఆర్‌డీటీ కార్యాలయం, మైదానం నీట మునిగాయి. కార్యాలయ ప్రహరీ కూలి పోయింది. ప్రభుత్వ కార్యాలయాల నుంచి అధికారులు, సిబ్బంది గంట పాటు బయటకు రాలేక ఇబ్బంది పడ్డారు.
కాగా గతంలో ఆత్మకూరు చెరువు తెగిపోయినా ఎవరూ పట్టించుకోక పోవడంతో, ప్రస్తుత వర్షానికి బయటికి వచ్చిన నీరు రోడ్డు మధ్యగా 2 గంటల పాటు భారీగా ప్రవహించింది. దీంతో వాహనాల రాకపొకలకు తీవ్ర ఆటంకం కలిగింది. చెరువు పక్కనే పంచాయతీ కార్యాలయం ఉండడంతో పింఛన్ల కోసం వచ్చిన వృద్ధులు, వికలాంగులు రోడ్డు దాటడానికి నానా అవస్థలు పడ్డారు. పరస్పరం చేతులు పట్టుకుని రోడ్డు దాటారు.
గతంలో వర్షం కురిసినపుడు కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదురైనా... చెరువు మరమ్మతులపై అధికారులు దృష్టి సారించలేదు. దీంతో ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అలాగే చెరువు పక్కన ఉన్న పొలాల్లోని పంటలు కూడా నాశనమయ్యాయి. బంతి పూల మొక్క లు నీటిలో కొట్టుకొని వస్తుంటే బాధిత రైతు గుండె తల్లడిల్లిపోయింది. ఆర్థికంగా తమను ఆదుకోవాలని రైతు లు, నర్సరీ నిర్వహకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.