రైతును మరిచి రాజకీయమా? | Harish rao comments over congress party | Sakshi
Sakshi News home page

రైతును మరిచి రాజకీయమా?

Published Sat, Mar 23 2024 1:32 AM | Last Updated on Sat, Mar 23 2024 1:32 AM

Harish rao comments over congress party - Sakshi

కాంగ్రెస్‌ ప్రభుత్వ ఖడ్గం మొదటి వేటు రైతన్న మీదనే పడ్డది. ఘనత వహించిన కాంగ్రెస్‌ సోకాల్డ్‌ ప్రజా పాలనలో రైతన్నల బతుకులు గాలిలో దీపాలు అయిపోయినయి. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా అన్నదాతల ఆక్రందనలు, ఆర్తనాదాలే వినిపిస్తున్నయి. మొన్నటి దాకా పొలాల్లో నీళ్లు పారితే, ఇప్పుడు రైతుల కళ్లల్లో కన్నీళ్లు కారుతున్నయి. మూడు నెలల్లోనే పరిస్థితి ఎందుకు తలకిందులైంది? బీఆర్‌ఎస్‌ పరిపాలనలో ఆత్మవిశ్వాసంతో మెరిసి పోయిన రైతన్నల ముఖాల్లో ఎందుకు ఇప్పుడు నిస్సహాయత, ఆందోళన కనిపిస్తున్నది? అటు ఎండిపోయి దెబ్బతిన్న పంటలకు, ఇటు వడగండ్లతో నష్టపోయినపంటకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలి. ఆరు గ్యారెంటీల్లో చెప్పిన 13 అంశాలను చిత్తశుద్ధితో త్వరగా అమలు చేయాలి.

నీళ్లు లేక పంటలు ఎండిపోతున్న బాధలు ఒకవైపు, కొద్దోగొప్పో పండిన పంట వడగండ్ల వానకు సర్వనాశనమై పోయిన ఘోష మరొకవైపు... రైతన్న బతుకు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా అయిపోయింది. వడ గండ్ల వాన దెబ్బకు రాష్ట్రంలో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయంటే పరిస్థితి తీవ్రతను అంచనా వేయొచ్చు. నేల రాలిన పంటను చూసి రైతులు భోరుభోరున ఏడుస్తున్న దృశ్యాలు హృదయాలను కలచి వేస్తున్నాయి. అంత దుఃఖంలోనూ కేసీఆర్‌ ఉండగా, మా పరి స్థితి ఇంత అగాథంగా లేకుండేనని చెబుతూ మరి కంటతడి పెట్టుకుంటున్నారు. 

ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో చలనమే లేదు. ఏమీ జరగనట్లుగానే ఎన్నికల ప్రచారాల్లో, రాజకీయ ప్రసంగాలను దట్టించి కొడుతున్నరు కాంగ్రెస్‌ పాలకులు. రైతు గుండె చీరుకపోయి విలవిల లాడుతుంటే, ముఖ్యమంత్రి గారు మాత్రం పక్క పార్టీ నాయకుల చేరికల మీద పూర్తి దృష్టిని కేంద్రీకరించారు. ప్రాజెక్టుల గేట్లు ఎత్తే సౌభాగ్యం లేని సర్కారు, పార్టీ గేట్లు ఎత్తి నాయకులను చేర్చుకుంటున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలో తాగునీరు గతిలేక మహిళలు ఖాళీ బిందెల ప్రదర్శనలు చేశారు. ముఖ్యమంత్రి అటువైపు తొంగి చూసిన పాపాన కూడా పోలేదు. పేగులు మెడలో వేసుకుంటా అనే రాక్షస వ్యాఖ్యలే తప్ప, పొలాలకు నీళ్లు మలుపుతా, ప్రజల గొంతు తడుపుతా అనే మానవీయ వ్యాఖ్యలు ఈ ముఖ్యమంత్రి నోటి వెంట రావడం లేదు.

రైతులు విధిలేని పరిస్థితుల్లో వేల రూపాయలు ఖర్చు పెట్టి ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు పెట్టుకుంటున్నరు. సాగునీళ్లు లేక,కరెంట్‌ సరిగా రాక రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోయింది. ఎండిన పంట చేలల్లో పశువులను మేపుతున్న దీనస్థితి కనిపిస్తున్నది. తెలంగాణ పల్లెల్లో మాయమైన బోరు బండ్లు మళ్లా దర్శనమిస్తున్నవి. పూడిక తీసే క్రేన్లకు గిరాకీ పెరిగింది. లో ఓల్టేజీ కరెంట్‌తో మోటార్లు కాలిపోతున్నయి. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతు న్నయి. మోటారు వైండింగ్‌ మెకానిక్‌ల షాపులు కళకళలాడుతుంటే, మునుపటి కాంగ్రెస్‌ రాజ్యం మళ్లా కళ్లకు కడుతున్నది. బీఆర్‌ఎస్‌ పరి పాలనలో ఎండాకాలంలో సైతం చెరువు, చెక్‌ డ్యాంకులు మత్తళ్లుదుంకిన మంచిరోజులను ప్రజలు పదే పదే గుర్తు చేసుకుంటున్నరు. ఆ రోజు నిండుగా పారిన కాల్వలు ఈ రోజు ఎండిపోయి ఎక్కిరిస్తు న్నయి. బీఆర్‌ఎస్‌ 24 గంటల కరెంట్‌తో రైతు ఇంట్ల కాలు మీద కాలేసుకొని కూర్చొన్నా పొలం పారింది.

నేడు అర్ధరాత్రి కరెంట్‌ పెట్టేందుకు బాయి కాడికి పోవాల్సిన బాధ మళ్లా మొదలైంది. బీఆర్‌ఎస్‌ పరిపాలనలో రైతులు నిరందిగ ఉన్నరు. ఇప్పుడు కరెంట్‌ కోత మల్లా ఒక సమస్యగా వ్యవసాయం వాకిట్లో నిలిచింది. బీఆర్‌ఎస్‌ పరిపాల నలో స్థిరపడ్డ వ్యవసాయం కాంగ్రెస్‌ పుణ్యమా అని మెల్లమెల్లగా చెదిరిపోతున్నది. ఇప్పటి వరకు అందుతున్న లెక్కల ప్రకారం,కాంగ్రెస్‌ తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం మూడు నెలల వ్యవధిలో 180 మంది రైతుల ఉసురు తీసింది. ఇటీవల కురిసిన వడగండ్ల వాన పంట నష్టాన్ని అంచనా వేసే పని కూడా కాంగ్రెస్‌ ఇప్పటికీ ప్రారంభించలేదు. అదే పనిగా బీఆర్‌ఎస్‌ వెంట పడితే, అప్పుడు సోయి తెచ్చుకొని అయిష్టంగానే ఎకరాకు రూ. 10 వేల పంట నష్టపరిహారం ఇస్తామని గాలి మాటలు చెబుతున్నరు.

అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్‌ 9న ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి, అధికారానికి రాగానే మాట మార్చారు. వంద రోజులు దాటినా రుణమాఫీ ఊసెత్తకుండా కాలం గడిపేస్తు న్నారు. నమ్మి రుణాలు తెచ్చుకున్న రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. రైతు బంధును రైతు భరోసాగా మార్చి, ఎకరాకు ఇచ్చే పెట్టుబడిని రూ. 15 వేలకు పెంచుతామని బడాయిలు చెప్పిన ప్రభుత్వం, పెంచడం మాట అటుంచి అసలు పెట్టుబడి సాయం ఇప్ప టికీ ఎంతోమంది ఖాతాల్లో జమ చేయనేలేదు. పెంచేదెప్పుడో చెప్పడం లేదు. రైతు బంధు సాయాన్ని కౌలు రైతులకు కూడా అంది స్తామని అబద్ధపు హామీలు గుప్పించారు. అసలు ఇప్పటి వరకు కౌలు రైతులను ఎలా గుర్తిస్తారో, వాళ్లకు పెట్టుబడి సాయం ఏ విధంగా చేస్తారో మార్గదర్శకాలు రూపొందించే పనికి కూడా పూనుకోవడం లేదు.

ఇగ రైతులను, కౌలు రైతులను మోసగించిన కాంగ్రెస్‌ పార్టీ, రైతు కూలీలను మాత్రం విడిచి పెడుతుందా? వాళ్లకు ఇచ్చిన హామీకి అదే గతి పట్టిచ్చింది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వ్యవ సాయ కూలీలకు 12 వేలు అందించే పథకం ప్రారంభిస్తామని చెప్పి, ఆ పథకం అమలు గురించిన ప్రస్తావన కూడా చేయడం లేదు. అంటే రైతు కూలీలకు ఇచ్చిన హామీకి కూడా ఎగనామం పెట్టిందనే అను మానాలకు తావిస్తున్నారు. ఈ పథకం అమలు కోసం బడ్జెట్‌లో కేటాయింపులే లేకపోవడం ఈ అనుమానాలను మరింత బలపర్చు తుంది. రాతపూర్వకంగా ఇచ్చిన గ్యారెంటీలకే దిక్కు లేకుండాపోతుంటే, పంట నష్టం పదివేలు ఇస్తాననే నోటి మాటకు విలువె క్కడిది?

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే విధంగా అకాల వర్షాలతోపంట నష్టపోతే ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు స్వయంగా పంటలు దెబ్బతిన్న ఊర్లు పర్యటించారు. అప్పటికప్పుడు ఎకరాకు రూ. 10 వేల నష్టపరిహారాన్ని ప్రకటించి, వేగంగా అమలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అటువంటి ప్రయత్నమేది కనిపించడం లేదు. అసలు కాంగ్రెస్‌ అంటేనే ఒక చెడగొట్టు వాన లాంటిదని రైతులు మాట్లాడుకుంటున్నరు. సమైక్య పాలనలో విధ్వంసమైపోయిన తెలంగాణ వ్యవసా యాన్ని  తిరిగి నిలబెట్టడానికి బీఆర్‌ఎస్‌ ఎంతో శ్రమించింది. పదేండ్లలో వ్యవసాయాన్ని పండుగగా మార్చింది. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించింది. 24 గంటలు నాణ్యమైన ఉచిత కరెంట్‌ సరఫరా చేసింది. కొత్త ప్రాజెక్టులు నిర్మించి నీటిని ఎత్తిపోసి చెరువులు, కుంటలు నింపింది. భారీ రిజర్వాయర్లు నిర్మించి నిండుగా నింపింది.

వాగుల్లోకి, వంకల్లోకి నీళ్లు వదిలితే భూగర్భ జలాలు మిక్కుటంగా పెరిగినయి. దుక్కి దున్ని నాటిన నుంచి పంట కొనుగోళ్ల దాకా అడుగడుగునా రైతుకు అండగా నిలిచింది. రైతు బంధుతో పెట్టుబడికి పైకమిచ్చింది. పండిన పంటనంతా మద్దతు ధరనిచ్చి కొనుగోలు చేసింది. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే సీన్‌ రివర్సై పోయింది.ఎండాకాలం రాకముందే చెరువులు ఎండిపోయినయి. భూగర్భ జలాలు పడిపోయినయి. బోర్లు ఎత్తి పోయినయి. రైతు బతుకు దిగ జారడం మొదలైంది. ఇదీ కాంగ్రెస్‌ పార్టీ తెచ్చిన మార్పు. మార్పు మార్పు అని చెప్పి రైతుల బతుకుల్లో మంట పెట్టిన్రు. రైతులు హాహాకారాలు చేస్తుంటే, భ్రష్ట రాజకీయాలతో పొద్దు పుచ్చడం ప్రమాదకరం. కాంగ్రెస్‌ ప్రభుత్వ నైజాన్ని ప్రజలు గుర్తిస్తు న్నారు.

ఆదిలోనే హంసపాదులా తయారైన విధానాన్ని తిట్టుకుంటున్నారు. ఇకనైనా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కళ్లు తెరవాలి. అటు ఎండి పోయి దెబ్బతిన్న పంటలకు, ఇటు వడగండ్లతో నష్టపోయిన పంటకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలి. చిత్తశుద్ధితో ఆరు గ్యారెంటీల్లో చెప్పిన 13 అంశాలను త్వరగా అమలు చేయాలి. ధైర్యం కోల్పో తున్న రైతు గుండెల్లో భరోసాను నింపాలి. రాక్షస వ్యాఖ్యలు చేయడం మాని రైతులను రక్షించుకునే విధానాన్ని చేపట్టాలి. లేని పక్షంలో తెలంగాణ రైతాంగం ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్‌ మరొక మహోద్య మానికి శ్రీకారం చుట్టడం ఖాయం. 

- వ్యాసకర్త మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే
-తన్నీరు హరీశ్‌ రావు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement