
సాక్షి, హైదరాబాద్: సాగుకు యోగ్యం కాని భూముల్లో సరికొత్త వ్యవసాయ పద్ధతులను అనుసరించి పలు రకాల పంటలు పండించిన కేంద్రీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ (క్రీడా) శాస్త్రవేత్తల బృందానికి ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీర్స్ (ఐఎస్‌ఏఈ) అత్యుత్తమ పురస్కారాన్ని అందించింది. వారణాసిలో జరిగిన ఐఏఎస్‌ఈ 53వ వార్షిక సదస్సుల్లో భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ త్రిలోచన్ మహాపాత్ర చేతుల మీదుగా క్రీడా ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కె.శ్రీనివాస్‌రెడ్డి బృందం ఈ అవార్డును అందుకుంది.
నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలంలోని చెంచు కాలనీల్లో సాగుకు యోగ్యం కాని భూములను అభివృద్ధి చేసి వివిధ రకాల పంటల సాగు కోసం శ్రీనివాస్‌రెడ్డి బృందం పలురకాల పరిశోధనలను చేసింది. కనీస నీటి సామర్థ్యం లేకపోవడంతోపాటు అత్యధిక వర్షాభావ పరిస్థితులున్న ఆ ప్రాంతంలో మెట్ట పంటలు, కూరగాయల సాగు కోసం సరికొత్త వ్యవసాయ పద్ధతులను అనుసరించేలా స్థానిక రైతాంగానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేలా సాంకేతిక సహకారాన్ని అందించింది. దాదాపు 60 కుటుం బాలకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ఇచ్చి ప్రోత్సహించింది. ఈ నేపథ్యంలో వీరి సేవలను గుర్తించిన ఐఏఎస్‌ఈ 2018 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు ఎంపిక చేసింది.