బంగారుపాళెం: శేషాపురంలో ఏనుగుల దాడిలో ధ్వంసమైన కంచె
అంతరిస్తున్న అడవులు.. మేత, నీరు కరువు.. గజరాజులకు తీరని ఆకలి, దప్పిక.. వెరిసి అరణ్యం నుంచి జనారణ్యంలోకి దూసుకువస్తున్న ఏనుగులు.. పంటపొలాలు, రైతులపై దాడులు.. దీనికి అడ్డుకట్ట వేయడానికి సోలార్ ఫెన్సింగ్, ట్రెంచ్‌ల ఏర్పాటు.. అయినా ఫలితం శూన్యం. ఆగని దాడులు.. సాగుకు అన్నదాత దూరం. ఇదీ పలమనేరు, కుప్పం ప్రాంతంలోని కర్షకుల దుస్థితి.
చిత్తూరు, పలమనేరు: జిల్లాలోని పలమనేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలో దశాబ్దాలుగా గజరా జుల దాడులతో రైతులు నష్టపోతూనే ఉన్నారు. గజ దాడుల నుంచి పంటల పరిరక్షణకు అటవీ శాఖ సోలార్ ఫెన్సింగ్, ఎలిఫెంట్ ట్రెంచ్‌లు ఏ ర్పాటు చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. గజ దాడుల్లో ఏటా వేలాది ఎకరాల పంట నష్టం తోపాటు రైతుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. కంచె దాటి బయటకొచ్చే క్రమంలో ఏనుగులు సైతం మృతువాత పడుతున్నాయి.
సోలార్ ఫెన్సింగ్, ఎలిఫెంట్ ట్రెంచ్‌లు వృథా గజ దాడుల నుంచి పంట రక్షణ కోసం ప్రభుత్వం 1984లో ఏర్పాటు చేసిన కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీ పూర్తి స్థాయిలో ప్రయోజనం లేకుండా పోతోంది. రూ.లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సోలార్ ఫెన్సింగ్ నిర్వహణ కొండెక్కింది. దీంతో లక్ష్యం నీరుగారిపోతోంది. పలమనేరు, కుప్పం పరిధిలోని కౌండిన్య అభయారణ్యం 250 కి.మీ మేర వ్యాపించి ఉంది. ఇందులో 36 ఏనుగులున్నట్లు అటవీశాఖ చెబుతోంది. ఇవి పలమనేరు కౌండిన్యలో మూడు గుంపులుగా, కుప్పం ప్రాంతంలో రెండు గుంపులుగా విడిపోయి అటవీప్రాంతంలో సంచరిస్తున్నాయి. ఇవి అడవిని దాటి బయటకు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం బంగారుపాళెం మండలం నుంచి కుప్పం వరకు 264 కి.మీ మేర సోలార్ ఫెన్సింగ్‌ను రెండు దఫాలుగా ఏర్పాటు చేశారు. ఆ ఫెన్సింగ్ ఇప్పటికే దెబ్బతింది. దీంతో ఏనుగులు పంటపొలాల్లోకి వస్తున్నాయి. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఎలిఫెంట్ ట్రెంచ్ పనులను చేశారు. పైన మూడు మీటర్ల వెడల్పు, లోపల రెండు మీటర్ల వెడల్పు, మూడు మీటర్ల లోతు వీటిని తవ్వారు. అయినా ఏనుగులు ట్రెంచ్‌లను దాటి బయటకొస్తున్నాయి. ఈ క్రమంలో గజదాడుల్లో 8 మంది మృతి చెందగా 12 మంది గాయపడ్డారు. అలాగే 9 ఏనుగులు చనిపోయాయి.
ఎలిఫెంట్ కారిడార్‌ను మరిచిన బాబు
ఏనుగుల సమస్యకు మూడు రాష్ట్రాల్లో కారిడార్ నిర్మాణం ఒక్కటే పరిష్కార మార్గంగా కనిపిస్తోంది. కర్ణాటకలోని బన్నేరుగట్ట, తమిళనాడులోని కృష్ణగిరి, హోసూరు, కావేరిపట్నం, మోర్ధనా తదితర ప్రాంతాల నుంచి కౌండిన్యలోకి తరచూ ఏనుగులు రావడంతోనే రైతులకు ఎక్కువ నష్టం వాటిల్లుతోంది. శాశ్వత పరిష్కారంలో భాగంగా మూడు రాష్ట్రాల్లోని అడవిలో ఓ కారిడార్‌ను నిర్మించేందుకు స్థానిక అధికారులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైల్డ్ అనిమల్ ప్రొటెక్ట్‌కు నివేదిక పంపినా పనులు ముందుకు సాగలేదు. పొరుగురాష్ట్రాల ముఖ్యమంత్రులతో రాష్ట్ర సీఎం సంప్రదించి సమస్యను పరిష్కరించాల్సి ఉంది. అయితే ఎప్పుడు కుప్పం, పలమనేరుకు వచ్చినా అదిగో ఇదిగో అంటున్నారే తప్ప సమస్యను గురించి పట్టించుకోలేదు.
పంటపొలాలపై ఏనుగుల దాడులు
మండలంలోని శేషాపురంలో మంగళవారం రాత్రి పంటపొలాలపై ఏనుగులు దాడులు చేశాయి. గ్రామ సమీపంలోని మోతకుంట అటవీ ప్రాంతం నుంచి మూడు ఏనుగులు పంటలపై దాడి చేసినట్లు బాధిత రైతులు తెలిపారు. ఏనుగులు గ్రామానికి చెందిన రైతు లక్ష్మీపతినాయుడు పొలం చుట్టూ వేసిన ఇనుప కంచెను ధ్వంసం చేసి పొలంలోకి ప్రవేశించాయి. జామ తోటలో చెట్లను తొక్కివేశాయి. డ్రిప్ పైపులను ధ్వంసం చేశాయి. మునికృష్ణకు చెందిన చెరకు తోట, నాగభూషణంనాయుడి అరటి చెట్లను తొక్కివేసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మొగిలి, మొగిలివారిపల్లె, గౌరీశంకరపురం గ్రామాల్లో ఏనుగులు వరుస దాడులు చేసి పంటలను తీవ్రంగా నష్టపరుస్తున్నాయని తెలి పారు. ఏనుగులు ధ్వంసం చేసిన పంటలను బు ధవారం అటవీశాఖ అధికారులు పరిశీలించారు. దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలని కోరుతూ బాధిత రైతులు రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. పంటలపైకి ఏనుగులు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment