
జాతీయ రహదారిపై జగమర్ల రోడ్డువైపునకు వెళుతున్న ఏనుగు
పలమనేరు: చెన్నై – బెంగళూరు జాతీయ రహదారిపై మొగిలిఘాట్ ప్రాంతంలో మంగళవారం ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. దీంతో వాహనచోదకులు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగించారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఎలిఫెంట్ ట్రాకర్ల సహాయంతో ఎనుగుల గుంపును దారి మళ్లించేందుకు యత్నించారు. అయితే అవి జగమర్ల దారిని దాటుకుని జాతీయ రహదారి పక్కనే సంచరిస్తున్నాయి. బంగారుపాళెం మండలంలో ఇటీవల విద్యుదాఘాతంతో ఓ మదపుటేనుగు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏనుగులు ఆగ్రహంతో ఉన్నాయని, మనుషులపై దాడికి దిగే ప్రమాదముందని ఎఫ్‌ఆర్‌ఓ మదన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అందుకే అప్రమత్తంగా వాటి కదలికలను గమనిస్తున్నామన్నారు. వాటిని కాలువపల్లె బీట్ మీదుగా మోర్ధనా అటవీ ప్రాంతానికి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. మరోవైపు మొగిలిఘాట్‌లో వెళ్లే వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.