సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) నుంచే ఉద్యాన పంటల విత్తనాలు, మొక్కలు రైతులకు సరఫరా చేసేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాల పంటల విత్తనాలు, మొక్కలు ఆర్‌బీకేల ద్వారా సరఫరా చేసేందుకు అనుమతి
ఇవ్వాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే ఆయన వ్యవసాయ, ఉద్యాన శాఖ కమిషనర్లు, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ, ఏపీ ఆగ్రోస్, అన్ని జిల్లాల వ్యవసాయ, అనుబంధ విభాగాల్ని సంప్రదించారు.
దీనికి సంబంధించిన విధివిధానాలు ఇలా ఉండనున్నాయి...
► కూరగాయల సాగులో పాల్పంచుకుంటున్న కంపెనీలతో ఆగ్రోస్ ఎండీ అవగాహన ఒప్పందం చేసుకుంటారు.
► ఆర్బీకేల నుంచి ఆర్డరు చేసిన విత్తనాలను సమీపంలోని హబ్‌లకు పంపి రైతులకు నేరుగా పంపిణీ అయ్యేలా చూస్తారు
► ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్లు ఆయా ప్రాంతాల్లోని రైతులకు కావాల్సిన విత్తనాలను గుర్తించి వంగడాల జాబితాలను ఆగ్రో స్‌కు పంపిస్తారు.
► కూరగాయలు, సుగంధ ద్రవ్యాల విత్తనాల విషయంలో స్థానిక వ్యవసాయాధికారి, ఉద్యాన అధికారులు ఆయా ప్రాంతాల్లో ఎంత మొత్తం కావాలో అంచనా వేస్తారు.
► తమ ప్రాంతాల్లోని విస్తీర్ణం ఆధారంగా గ్రామ ఉద్యాన, వ్యవసాయ సహాయకులు విత్తన అవసరాన్ని గుర్తిస్తారు.
► ఆర్డరు అందిన 48 గంటల్లోపు సరఫరా చేసేలా ఏపీ ఆగ్రోస్ చర్యలు తీసుకుంటుంది
► ప్రస్తుత నర్సరీల చట్టం ప్రకారం ఉద్యాన శాఖ అన్ని పంటల నారుమళ్లను నమోదు చేసి పర్యవేక్షిస్తుంది.
► నారుమళ్ల నాణ్యతలో లోపాలుంటే సంబంధిత సంస్థపై చర్య తీసుకుంటారు.
► రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీవోలు) సైతం విత్తనాల సేకరణకు ఆర్బీకేలతో కలిసి పని చేయాలి.
► ఆర్బీకేల నుంచే కూరగాయల విత్తనాలు, మిర్చి, బొప్పాయి, టిష్యూ కల్చర్ అరటి, పుచ్చ, కర్బూజ పంటల మొక్కలు, విత్తనాల పంపిణీ.
► పొలంబడి కార్యక్రమంలో ఉద్యాన శాఖ పండ్లు, కూరగాయల పంటల సాగుపై రైతులకు మెళకువలు నేర్పించి మంచి దిగుబడులు వచ్చేలా చూస్తుంది.
► పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పూల మొక్కలను నర్సరీల నుంచి సేకరించి ఆర్బీకేల ద్వారా సరఫరా చేసేందుకు ఎవరితో కలిసి పని చేయాలో ఉద్యాన శాఖ ప్రణాళికను ఖరారు చేస్తుంది.
► ఇలా చేయడం వల్ల ఉద్యాన రైతులు నష్టపోవాల్సి ఉండదని ఉద్యాన శాఖ స్పష్టం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment