కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధర ఉందని యాప్‌లో అలర్ట్ వస్తే వెంటనే చర్చించి, తగిన చర్యలు తీసుకోవాలి. పంటలకు కనీస ధరలు ఉన్నాయా? లేవా? అనే సమాచారం ప్రతిరోజూ 10,641 ఆర్బీకేల ద్వారా కచ్చితంగా రావాలి. దానిని ప్రతి రోజూ పరిశీలించాలి. కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోళ్లు జరుగుతున్నాయనే మాట రాకూడదు.
ఆర్బీకేల్లో ప్రదర్శించిన పంటల కనీస మద్దతు ధరలు అమలయ్యేలా చూడాలి. ధరలు తక్కువగా ఉన్న చోట్ల జేసీలు, ఆర్బీకేల్లోని అగ్రికల్చర్ అసిస్టెంట్లతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలి.
– సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కన్నా తక్కువ ధరలకు పంటల కొనుగోళ్లు జరక్కూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పంటలు అమ్ముకోవడంలో రైతులు ఇబ్బంది పడరాదని స్పష్టం చేశారు. ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరలుంటే ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ప్రత్యామ్నాయ మార్కెట్ చూపాలని, లేదంటే ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పారు. అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్ ప్రాజెక్ట్, ఈ–మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్స్‌తో పాటు సీఎం యాప్ (కాంప్రహెన్సివ్ మానిటరింగ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్‌మెంట్) పనితీరుపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి, వేరుశనగ, పత్తిలాంటి పంటలను అమ్ముకోవడంలో రైతులు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మద్దతు ధర, కొనుగోళ్లపై వ్యవసాయ శాఖ మంత్రి నేతృత్వంలో ప్రతి రోజూ సమీక్ష చేయాలని ఆదేశించారు. కొనుగోళ్లకు సంబంధించి రైతులకు 10 రోజుల్లోగా పేమెంట్ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఖరీఫ్‌లో 1,09,24,524 మెట్రిక్ టన్నుల పంటలు వస్తాయని అంచనాగా ఉందని, 5,812 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమీక్షలో సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.
యుద్ధ ప్రాతిపదికన మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల పనులు
– ప్రతి ఆర్బీకే పరిధిలో మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటులో భాగంగా గోడౌన్లు, కోల్డ్ రూమ్స్, డ్రైయింగ్ ప్లాట్‌ఫామ్స్, ఆక్వా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్.. ఆర్బీకే, మండల పరిధిలో వ్యవసాయ యంత్ర పరికరాలు, ప్రొక్యూర్‌మెంట్ సెంటర్లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, ఆక్వా బజార్, ప్రి ప్రాసెసింగ్ ప్లాంట్లు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఇ–మార్కెటింగ్ ప్లాట్‌ఫాం ఉంటుంది. ఇందుకు దాదాపు రూ.9,093 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.
– మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. అన్ని పనులు ఏకకాలంలో యుద్ధప్రాతిపదికన ముందుకు సాగాలి. క్షేత్ర స్థాయిలో పనుల పురోగతి కనిపించాలి.
– పేమెంట్ గేట్‌వే, సెక్యూరిటీ కూడా చాలా ముఖ్యం. బయ్యర్లు, రైతుల మధ్య పేమెంట్ల చెల్లింపు సక్రమంగా ఉండేలా పటిష్ట విధానం ఉండాలి. బయ్యర్ ఆర్డర్ చేయగానే 3–4 రోజుల్లో ఆ పంట డెలివరీ అయ్యేలా చూడాలి. పంటను అత్యంత నాణ్యమైన విధానాల్లో ప్రాసెసింగ్ చేసి, క్వాలిటీ ప్రాడక్టు ఇవ్వడంపై దృష్టి పెట్టాలి.
మహిళలకు మేలు జరగాలి
– రాష్ట్రంలో పాడి పరిశ్రమాభివృద్ధి, మహిళా ఆర్థికాభివృద్ధి కోసం ఉద్దేశించిన అమూల్‌తో అవగాహన ఒప్పందం అమలు గురించి సమీక్షిస్తూ.. వైఎస్సార్ చేయూత ద్వారా లబ్ధి పొందిన మహిళలు పోషిస్తున్న పాడి పశువుల నుంచి తప్పకుండా పాల సేకరణ జరగాలని, తద్వారా వారికి మేలు కలగాలని సీఎం ఆదేశించారు.
– రైతుల నుంచి పాల సేకరణ, బల్క్ మిల్క్ యూనిట్ల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులు సీఎంకు వివరించారు. మహిళలకు పాడి పశువుల పంపిణీ కొనసాగుతోందన్నారు.
– నవంబర్ 25 నుంచి కొన్ని బీఎంసీల్లో.. ఒంగోలు, మదనపల్లి డెయిరీల ద్వారా కార్యకలాపాలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వీలైంతన త్వరగా అన్ని చోట్లా కార్యకలాపాలు ప్రారంభం కావాలని సీఎం ఆదేశించారు.
– ఈ సమీక్షలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి కురసాల కన్నబాబు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment