న్యూఢిల్లీ: ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం కింద ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని ఆరంభ మద్దతుగానే పరిశ్రమ చూడాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రానున్న రోజుల్లో పరిశ్రమ మరింత వృద్ధి చెందాలంటే పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. పీఎల్‌ఐ పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు, దీని కింద ప్రయోజనం పొందిన సంస్థలు నిర్మాణాత్మక విమర్శలు, అభిప్రాయాలను పంచుకోవాలని కోరారు.
భారత్‌ను తయారీ కేంద్రంగా మలచాలన్నది ప్రభుత్వ యోచన అని, ఈ విషయంలో అసలైన సుదీర్ఘ ప్రయాణం ముందున్నట్టు చెప్పారు. పీఎల్‌ఐ పథకంపై నిర్వహించిన కార్యక్రమంలో వందలాది భాగస్వాములు, అధికారులు పాల్గొన్నారు. ‘‘ప్రభుత్వ సబ్సిడీలపై ఆధారపడే విధంగా మిమ్మల్ని మార్చాలని కోరుకోవడం లేదు. మీ కృషిని ఆరంభించేందుకు ప్రోత్సాహంగానే (కిక్‌స్టార్ట్) దీన్ని చూడాలి. కానీ, అంతిమంగా పోటీయే నిలుస్తుంది.
ఒకరితో మరొకరు, ప్రపంచంతోనూ పోటీ పడి రాణించాల్సి ఉంటుంది’’అని గోయల్ చెప్పారు. సౌకర్యమని చెప్పి దేశీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా, పరిశ్రమ క్రమంగా అంతర్జాతీయ మార్కెట్లపై దృష్టి సారించాలని సూచించారు. భారత్‌ను తయారీ శక్తిగా మలిచేందుకు ప్రభుత్వం, లబ్దిదారులు (కంపెనీలు) మధ్య సహకారం అవసరమని, ఒకరికొకరి మద్దతు కూడా కీలకమన్నారు.
విలువ జోడించాలి..
భారత తయారీలో స్థూల విలువ జోడింపు (జీవీఏ/విడిభాగాలు కూడా ఇక్కడే తయారైనవి) కేవలం 17.4 శాతమే ఉందని, అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు, మరింత మంది ఉపాధి కల్పనకు ఇది చాలదని డీపీఐఐటీ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ అన్నారు. పరిశ్రమ మరింత విలువను జోడించడంపై దృష్టి సారించాలని సూచించారు.
మొబైల్, వైట్‌గూడ్స్‌లో దేశీయంగా ఉత్పత్తుల తయారీకి విలువ తోడవుతున్నట్టు తెలిపారు. పీఎల్‌ఐ పథకం విషయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయని, వీటి పరిష్కారానికి ప్రభుత్వం పనిచేస్తున్నట్టు చెప్పారు. 10 ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీలు, 14పీఎల్‌ఐ పథకాలకు సంబంధించి రంగాల వారీ ముఖ్య సంస్థలు ఈ సమావేశానికి హాజరయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment