న్యూఢిల్లీ: అంకుర సంస్థలు, ఇన్వెస్టర్లు తదితర వర్గాలకు కేంద్ర హబ్‌గా ఉపయోగపడే భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ (BHASKAR) ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. స్టార్టప్‌లు, మదుపరులు, సర్వీస్ ప్రొవైడర్లు, ప్రభుత్వ శాఖలు పరస్పరం సహకరించుకోవడానికి, ఆలోచనలు పంచుకోవడానికి ఈ పోర్టల్ ఒక వేదికగా ఉపయోగపడగలదని మంత్రి చెప్పారు.
ఇందులో రిజిస్టర్ చేసుకునేవారికి ప్రత్యేకంగా భాస్కర్ (BHASKAR) ఐడీ కేటాయిస్తారు. వనరులు, భాగస్వాములు, అవకాశాల వివరాలను యూజర్లు సులువుగా పొందేందుకు, వేగవంతంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడేలా ఇందులో సెర్చ్ ఫీచరును శక్తిమంతంగా తీర్చిదిద్దారు. స్టార్టప్ ఇండియా కింద చేపట్టే అన్ని కార్యక్రమాలు, సంస్థలను ఒకే గొడుగు కిందికి తెచ్చే విధంగా కంపెనీల చట్టంలోని సెక్షన్ 8 కింద లాభాపేక్షరహిత కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు.
ఇన్వెస్ట్ ఇండియా తరహాలో పరిశ్రమ వర్గాల పర్యవేక్షణలోనే ఉండే ఈ సంస్థలో నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా భాగమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అటు, భాస్కర్ పోర్టల్‌ను మరింత పటిష్టంగా మార్చేందుకు పరిశ్రమవర్గాలన్నీ ముందుకు రావాలని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అమర్‌దీప్ సింగ్ భాటియా తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో 1,46,000 పైచిలుకు ప్రభుత్వ గుర్తింపు పొందిన అంకురాలు ఉండగా రాబోయే రోజుల్లో వీటి సంఖ్య 50 లక్షలకు పెంచే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది జనవరి 16 నాటికి దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక స్టార్టప్ ఉంటుందని భాటియా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment