seed companies
-
స్టార్టప్‌ల కోసం ‘భాస్కర్’ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: అంకుర సంస్థలు, ఇన్వెస్టర్లు తదితర వర్గాలకు కేంద్ర హబ్‌గా ఉపయోగపడే భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ (BHASKAR) ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. స్టార్టప్‌లు, మదుపరులు, సర్వీస్ ప్రొవైడర్లు, ప్రభుత్వ శాఖలు పరస్పరం సహకరించుకోవడానికి, ఆలోచనలు పంచుకోవడానికి ఈ పోర్టల్ ఒక వేదికగా ఉపయోగపడగలదని మంత్రి చెప్పారు. ఇందులో రిజిస్టర్ చేసుకునేవారికి ప్రత్యేకంగా భాస్కర్ (BHASKAR) ఐడీ కేటాయిస్తారు. వనరులు, భాగస్వాములు, అవకాశాల వివరాలను యూజర్లు సులువుగా పొందేందుకు, వేగవంతంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడేలా ఇందులో సెర్చ్ ఫీచరును శక్తిమంతంగా తీర్చిదిద్దారు. స్టార్టప్ ఇండియా కింద చేపట్టే అన్ని కార్యక్రమాలు, సంస్థలను ఒకే గొడుగు కిందికి తెచ్చే విధంగా కంపెనీల చట్టంలోని సెక్షన్ 8 కింద లాభాపేక్షరహిత కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. ఇన్వెస్ట్ ఇండియా తరహాలో పరిశ్రమ వర్గాల పర్యవేక్షణలోనే ఉండే ఈ సంస్థలో నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా భాగమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అటు, భాస్కర్ పోర్టల్‌ను మరింత పటిష్టంగా మార్చేందుకు పరిశ్రమవర్గాలన్నీ ముందుకు రావాలని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో 1,46,000 పైచిలుకు ప్రభుత్వ గుర్తింపు పొందిన అంకురాలు ఉండగా రాబోయే రోజుల్లో వీటి సంఖ్య 50 లక్షలకు పెంచే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది జనవరి 16 నాటికి దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక స్టార్టప్ ఉంటుందని భాటియా చెప్పారు. -
దిగుబడి తగ్గినా.. విత్తన కంపెనీదే బాధ్యత
సాక్షి, హైదరాబాద్ : పంట దిగుబడి తక్కువైనా విత్తన కంపెనీలే బాధ్యత వహించడంతోపాటు రైతులకు నష్ట పరిహారం చెల్లించేలా చూడాలని కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయశాఖ కీలక ప్రతిపాదన చేసింది. కేంద్ర విత్తన ముసాయిదా బిల్లు–2019పై ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. ప్రైవేటు కంపెనీలు విత్తనాల సామర్థ్యంపై చేస్తున్న అధిక ప్రచారం వల్ల రైతులు వాటిని కొనుగోలు చేసి పంటలపై ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారని సర్కారు పేర్కొంది. తీరా పంట దిగుబడి తక్కువయ్యే సరికి అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని వ్యవసాయశాఖ ఆ సమావేశంలో ప్రస్తావించింది. అందువల్ల నిర్ధారించిన మేరకు పంట దిగుబడి రాకపోతే కంపెనీలు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్రం కోరింది. దీనివల్ల కంపెనీల ఇష్టారాజ్య ప్రచారానికి అడ్డుకట్ట వేయొచ్చనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. మరోవైపు విత్తనం ద్వారా పంట నష్టం జరిగితే పరిహారాన్ని వినియోగదారుల రక్షణ చట్టం–1986 ప్రకారం ఆయా కోర్టుల్లో నిర్ధారించాలని ముసాయిదా బిల్లులో పేర్కొన్నారని, దీనివల్ల పరిహారం ఆలస్యమవుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ అభిప్రాయపడింది. దానికి బదులుగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉండే వ్యవసాయ నిపుణుల కమిటీలు నష్ట పరిహారాన్ని నిర్ధారించాలని కేంద్రానికి ప్రతిపాదించింది. నకిలీ విత్తన దందా అడ్డుకట్టకు అనుమతి అక్కర్లేదు... నకిలీ విత్తనాలు విక్రయించే ముఠాలపై దాడులు చేయడం, ఆయా విత్తనాలను స్వాధీనం చేసుకోవడానికి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని కేంద్ర విత్తన ముసాయిదాలో ప్రస్తావించడాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ తప్పుబట్టింది. మండల వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అనుమతిని అప్పటికప్పుడు తీసుకోవడం కష్టమని, దీనివల్ల నకిలీ విత్తన విక్రయదారులు తప్పించుకునే ప్రమాదముందని అభిప్రాయపడింది. అందువల్ల ప్రత్యేకంగా అనుమతి అవసరంలేదని సూచించింది. ముసాయిదాపై జరిగిన సమావేశంలో పాల్గొన్న పలు బడా కంపెనీలు కంపెనీకి, ప్రతి విత్తన వెరైటీకి ప్రతి రాష్ట్రంలోనూ రిజిస్ట్రేషన్ చేయాలన్న నిబంధనను ఎత్తేయాలని కోరగా రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనను అంగీకరించొద్దని స్పష్టంచేసింది. దేశవ్యాప్తంగా అన్ని వెరైటీ విత్తనాలు అన్ని రాష్ట్రాల వాతావరణానికి తగ్గట్లుగా ఉండవని, అన్నిచోట్లా పండవని, కాబట్టి ప్రతి రాష్ట్రంలోనూ తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందేనని కేంద్రాన్ని కోరింది. ధరల నియంత్రణపై అస్పష్టత విత్తన ధరల నియంత్రణపై ముసాయిదా బిల్లులో అస్పష్టత నెలకొంది. అవసరమైతే విత్తన ధరలను నియంత్రిస్తామని మాత్రమే ముసాయిదాలో ఉంది. దీనివల్ల ధరల నియంత్రణ సక్రమంగా జరిగే అవకాశం ఉండదు. విత్తన ధరలపై స్పష్టమైన నియంత్రణ లేకపోతే కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలను పెంచే అవకాశముంది. దీనిపై ముసాయిదాలో మార్పులు చేయాలని కోరుతాం. – డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణుడు ఇకపై అన్ని విత్తనాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి... ఇకపై అన్ని రకాల విత్తనాలు, వెరైటీలకు రిజిస్ట్రేషన్ తప్పనసరి చేయడాన్ని ముసాయిదా బిల్లులో ప్రస్తావించడం మంచి పరిణామమని రాష్ట్ర వ్యవసాయశాఖ అభిప్రాయపడింది. ప్రస్తుతం ప్రైవేటు హైబ్రిడ్ విత్తనాల రిజిస్ట్రేషన్ జరగట్లేదని, కొత్త నిబంధన వల్ల ఇది తప్పనసరి అవుతుందని పేర్కొంది. ఖరీఫ్‌లో అన్ని పంటల కంటే పత్తి, మొక్కజొన్నను తెలంగాణలో ఎక్కువగా సాగు చేస్తారని, అవన్నీ ప్రైవేటు హైబ్రిడ్ విత్తనాలేనని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి ఆయా ప్రైవేటు విత్తనాల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయడం వల్ల కంపెనీలకు బాధ్యత ఏర్పడుతుందని అంటున్నారు. మామిడి, మిరప, టమాట తదితర అన్ని రకాల నర్సరీలు కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనని ముసాయిదాలో పేర్కొన్నారని వ్యవసాయశాఖ తెలిపింది. -
‘పథకాలను చూసి ఆశ్చర్యపడ్డారు’
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా సీడ్ పార్క్‌ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. సోమవారం అయోవా యూనివర్శిటీ ప్రతినిధులతో మంత్రి కన్నబాబు, సీఎం కార్యాలయం అధికారులు భేటీ అయ్యారు. కర్నూలు జిల్లా సీడ్ పార్క్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విత్తన కంపెనీలకు మేలు చేసేలా కాకుండా.. రైతులకు మేలు చేసేలా విత్తనాభివృద్ధి జరగాలని కోరారు. అదే విషయాన్ని ఆయోవా ప్రతినిధులకు సూచించినట్లు వెల్లడించారు. సీడ్‌పార్క్ ప్రతిపాదనలను రిడిజైన్ చేయాలని చెప్పామన్నారు. రాష్ట్రంలో పరిస్థితులకు అనుగుణంగా విత్తనాభివృద్ధి చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన రైతు పథకాలను చూసి అయోవా ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. విత్తనాలు అందించడానికి ల్యాబ్‌లను పెడుతున్నామని తెలిపారు. -
విత్తు.. చిత్తు
మెదక్‌జోన్ : పలు విత్తన కంపెనీలకు చెందిన ఏజెంట్లు ఇష్టారీతిగా రైతులతో విత్తనోత్పత్తి చేయిస్తున్నారు. కానీ ఆయా కంపెనీలతో ముందస్తు ఒప్పందం చేసుకోవడం లేదు. విత్తనాలను సాగు చేస్తున్నప్పుడు ఏదైనా సమస్య ఉత్పన్నమైతే ఒప్పందం సాగును చట్టబద్ధం చేస్తూ రైతులకు నష్టం రాకుండా రాష్ట్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. కానీ వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖల పర్యవేక్షణ కొరవడడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. నూతన చట్టం ప్రకారం కంపెనీ లేదా వ్యక్తి రైతుతో పంటను పండించాలనుకుంటే మార్కెటింగ్‌శాఖ వద్ద లైసెన్స్ తీసుకోవాలి. పండించాలనుకున్న పంట విస్తీర్ణం రైతులతో చేసుకున్న ధరల ఒప్పందం వంటివన్నీ ప్రభుత్వ అధికారులకు నెల రోజుల్లోపు సమర్పించాలి. ప్రభుత్వ మద్దతు ధరకన్నా తక్కువ ధరకు కొనకూడదు. పంట పండిన తరువాత ఒప్పందం ప్రకారం రైతుకు డబ్బులు చెల్లించాలి. రైతుల భూములపై ఆయా కంపెనీలకు ఎలాంటి అధికారాలు ఉండవు. ఏవైనా వివాదాలు తలెత్తితే మార్కెటింగ్‌శాఖ సంచాలకుడికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. తద్వారా అధికారులు పరిశీలించి నెల రోజుల్లోపు సమస్యను పరిష్కరించాలి. రబీలో ఒప్పందసాగు అధికంగా ఉంది కాబట్టి కంపెనీలన్నీ ఒప్పంద లైసెన్స్ పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి. కానీ ఇప్పటి వరకు జిల్లాలో పెద్ద ఎత్తున విత్తన పంటలు వేసినా ఎవరూ ఒప్పందం చేసుకోలేదు. దీంతో రైతులకు చట్టంతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. చాలాకాలంగా సాగు.. మెదక్ జిల్లాలో చిన్నశంకరంపేట, రామాయంపేట, వెల్దుర్తి, మెదక్, హవేలిఘణాపూర్, చేగుంట, నార్సింగ్‌తోపాటు పలు మండలాల్లో విత్తన కంపెనీదారులు చాలా కాలంగా రైతులతో విత్తనాలను ఉత్పత్తి చేయించి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా వరి పంటల రకాలను అధికంగా సాగు చేస్తున్నారు. విత్తనోత్పత్తి ద్వారా ఎకరాకు రూ. 8 నుండి రూ. 10 వేల వరకు అదనపు ఆదాయం వస్తుండడంతో రైతులు కూడా విత్తనోత్పత్తికి మొగ్గుచూపుతున్నారు. సాధారణ పరిస్థితుల్లో హైబ్రిడ్ వరితోపాటు టేక్మాల్, రేగోడు, అల్లాదుర్గం, పెద్దశంకంపేట తదితర మండలాల్లో పత్తి, మొక్కజొన్నలాంటి విత్తనాలను సాగు చేయిస్తున్నారు. విత్తనోత్పత్తి సాగు సమయంలో వాతావరణం అనుకూలించకపోతే దిగుబడి తగ్గిపోయి రైతులు నష్టాల పాలవుతున్నారు. ఈ క్రమంలో రైతుతో ముందుగా కంపెనీ యజమాని ఒప్పందం చేసుకున్న ప్రకారం డబ్బులను చెల్లించడం లేదనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా సదరు కంపెనీలు రైతులకు డబ్బులు తక్కువగా చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏజెంట్ల మాయాజాలం.. విత్తనోత్పత్తి విషయంలో వివిధ కంపెనీల ఏజెంట్లు రైతులతో ఒప్పందం చేసుకున్న విధంగా డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయి. 2013వ సంవత్సరంలో చేగుంట మండలంలోని మాసాయిపేటలో ఓ రైతు ఐదు ఎకరాల పొలంలో వరి విత్తన రకాన్ని సదరు కంపెనీ యజమాని సూచన మేరకు సాగు చేశాడు. కానీ వాతావరణ మార్పులతో పంటకు తెగులు సోకింది. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేక పోవడంతో విత్తన కంపెనీ ఏజెంట్ పత్తాలేకుండా పోవడంతో బాధిత రైతు నెత్తీనోరు బాదుకున్నాడు. ఈ విషయాన్ని అప్పట్లో వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకొచ్చాడు. అయినా రాతపూర్వకంగా ఎలాంటి ఒప్పంద పత్రం లేకపోవడంతో తాము ఏమీ చేయలేమని అధికారులు చేతులు ఎత్తివేశారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో కోకొల్లలు. వెయ్యి ఎకరాల్లో సాగు.. జిల్లావ్యాప్తంగా 20 వేల హెక్టార్లలో సాధారణ వరి పంటలు సాగు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 18 వేల హెక్టార్లలో సాగయ్యాయి. జిల్లా వ్యాప్తంగా విత్తన కంపెనీదారులు సుమారు 1000 ఎకరాల్లో వరి విత్తనాలను సాగు చేయించినట్లు తెలిసింది. ఒప్పంద పత్రం రాసుకుని సాగు చేయిస్తేనే రైతులకు న్యాయం జరుగుతుంది. పాటించాల్సిన నిబంధనలు... విత్తనోత్పత్తి చేసే కంపెనీలు రైతుతో సాగు చేయించే విత్తనాలను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు. విత్తిన తరువాత రైతుల పొలాలను ఎన్నిసార్లు పరిశీలించారు. పంట చేతికందే సమయంలో నిబంధనలు పాటించడంతోపాటు ఎప్పటికప్పుడు విత్తనాల నమూనా పరీక్షలు చేసి ప్యాకింగ్ వరకు సంబంధిత అధికారులు పర్యవేక్షించి సీడ్ సర్టిఫికెట్ ట్యాగ్ లేబుల్, సీళ్లను ఇస్తారు. అధికారుల పర్యవేక్షణ లేకపోతే మోసగాళ్లకు ఆడిందే ఆటగా మారుతుంది. ఈ క్రమంలో రైతులను నిండా ముంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాతపూర్వక ఒప్పందం చేసుకోవాలి.. కంపెనీలు రైతులతో విత్తనోత్పత్తి చేయాలనుకుంటే ముందుగానే బాండ్ పేపర్‌పై రాతపూర్వకంగా ఒప్పందం చేసుకోవాలి. వాతావరణ మార్పుల కారణంగా లేదా మరేమైనా కారణాలతో పంటలు నష్టపోయిన సందర్భాల్లో ఒప్పందం మేరకు రైతుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. లేనట్లయితే సదరు కంపెనీలపై కేసు వేసే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ప్రతీ కంపెనీదారుడు తప్పని సరిగా నిబంధనల ప్రకారం లైసెన్స్ తీసుకోవాలి.– జిల్లా వ్యవసాయ అధికారి పరుశురాం -
విత్తన కంపెనీల మాయాజాలం
సాక్షి, హైదరాబాద్: ఆదాయపు పన్ను ఎగవేసేందుకు విత్తన కంపెనీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. రైతుల పేరుతో కోట్ల రూపాయలు పన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్నాయి. తామే సొంతంగా రైతుల అవతారమెత్తినట్లు బడా కంపెనీలు నాటకమాడుతున్న తీరు ఆదాయపు పన్ను శాఖను విస్మయానికి గురి చేస్తోంది. రాష్ట్రంలో కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో వందలాది విత్తన ఉత్పత్తి కంపెనీలున్నాయి. అనుకూలమైన వాతావరణం ఉండటంతో పాటు అనువైన పంట భూములు, రవాణా సదుపాయాలుండటంతో ఈ ప్రాంతంలో విత్తన ఉత్పత్తి కంపెనీల వ్యాపారం వర్ధిల్లుతోంది. విత్తన కంపెనీలు తమకు అవసరమయ్యే పంట ఉత్పత్తులను రైతుల నుంచి కొనుగోలు చేసి.. నాణ్యమైన విత్తనాలను తయారు చేస్తాయి. ప్రయోగ దశలో కొన్ని ప్రాంతాల్లో కంపెనీలే రైతుల పొలాల్లో అవసరమైన పంట వేయించి విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. రైతుల పేరిట నాటకం.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రైతులు, వ్యాపారుల నుంచి ఓ బడా కంపెనీ రూ.500 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల విలువైన పత్తిని కొనుగోలు చేస్తోంది. రైతులు తమ భూముల్లో పండించే పంట ద్వారా వచ్చిన ఆదాయానికి ఐటీ మినహాయింపు ఉంది. కంపెనీల పెట్టుబడులు, రైతుల నుంచి పంట ఉత్పత్తులు కొనుగోలు చేసే వ్యాపారం ఐటీ పరిధిలోకి వస్తాయి. అందుకే సదరు కంపెనీ సొంతంగా 2 వేల ఎకరాల వ్యవసాయ భూమి లీజుకు తీసుకున్నట్లు తప్పుడు రికార్డులు సృష్టించినట్లు తెలిసింది. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈ భూములున్నాయని, అక్కడ పండించిన పంట నుంచే తాము విత్తనాలను ఉత్పత్తి చేసినట్లు వ్యాపారం చేస్తోంది. విత్తనాల తయారీకి తాము పెట్టిన పెట్టుబడి ఐటీ పరిధిలోకి రాదంటూ నాటకానికి తెర తీసింది. ఇటీవల ఈ కంపెనీ టర్నోవర్‌కు, పన్ను చెల్లింపునకు భారీ వ్యత్యాసం ఉండటంతో ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన సోదాల్లో ఈ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. విత్తన ప్రయోగ క్షేత్రాలు 50 ఎకరాల్లో లేకున్నా.. వేలాది ఎకరాలు లీజుకు తీసుకున్నట్లు విత్తన కంపెనీలు ఎగవేసిన సొమ్ము గడిచిన ఐదేళ్లలో దాదాపు రూ.1,000 కోట్లకు పైగా ఉంటుందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. నగదు పేరిట మరో మోసం.. నిబంధనలకు విరుద్ధంగా నగదు తీసుకుని దానికి లెక్క చూపించకుండా పన్ను ఎగవేతలోనూ విత్తన కంపెనీలు పోటీ పడుతున్నాయి. తెలంగాణ, ఏపీ, కర్ణాటకతో పాటు గుజరాత్లో ఇటీవల ఆదాయ పన్ను శాఖ దాడులు నిర్వహించింది. రైతులు నగదు చెల్లించి డీలర్లు, వ్యాపారుల నుంచి విత్తనాలు కొనుగోలు చేయటం సర్వసాధారణం. కానీ డీలర్లు, వ్యాపారులు సంబంధిత కంపెనీలకు నగదు చెల్లించటం కుదరదు. తమ వ్యాపార లావాదేవీలు రూ.2 లక్షలు దాటితే చెక్కు లేదా డీడీ రూపంలో చెల్లించాలి. కానీ కంపెనీలు నగదు రూపంలోనే తమకు డబ్బు చెల్లించాలని డీలర్లను ప్రోత్సహిస్తున్నాయి. నగదు చెల్లిస్తే ప్రోత్సాహకాలు, పారితోషికం కూడా ఇస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. దీంతో తెలంగాణలోని విత్తన వ్యాపారులు, ఆథరైజ్డ్ డీలర్లు దాదాపు 70 నుంచి 80 శాతం లావాదేవీలను నగదు రూపంలోనే నిర్వ హిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీటీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఓ టాప్ కంపెనీ దాదాపు రూ.300 కోట్లకు పైగా నగదు స్వీకరించినట్లు తెలిసింది. -
విత్తన కంపెనీల బాగోతం
సాక్షి, హైదరాబాద్: అనుమతి లేని విత్తనాలు అమ్మడమే కాదు, నిబంధనలకు విరుద్ధంగా నగదు తీసుకుని దానికి లెక్క చూపించకుండా పన్ను ఎగవేతలోనూ విత్తన కంపెనీలు పోటీ పడుతున్నాయి. తెలంగాణ, ఏపీ, కర్ణాటకతో పాటు గుజరాత్లో ఇటీవల ఆదాయపన్ను శాఖ నిర్వహించిన దాడులలో ఇది తేటతెల్లమైంది. రైతులకు విక్రయించిన విత్తనాలకు లావాదేవీల సొమ్మును డీలర్లు నగదు రూపంలో తీసుకున్నా, కంపెనీకి చెల్లించేటప్పుడు రూ.2 లక్షలు దాటితే చెక్కురూపంలో చెల్లించాలి. కానీ, విత్తన కంపెనీలు కోట్ల రూపాయలను అక్రమంగా తీసుకుంటున్నాయి. రైతాంగం నుంచి తక్కువ మొత్తంలో వచ్చిన మొత్తం డీలర్ల దగ్గరకు వచ్చేసరికి లక్షల్లో అవుతుంది. కానీ, విత్తన కంపెనీల యాజమాన్యాలు ఇచ్చే పారితోషకాలను దృష్టిలో ఉంచుకుని విత్తన వ్యాపారులు, ఆథరైజ్డ్ డీలర్లు 70 నుంచి 80 శాతం మొత్తంను నగదు రూపంలో చెల్లిస్తున్నట్లు తాజా దాడులలో వెల్లడైంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాదిన బీటీ పత్తి విత్తనాలు విక్రయించడంలో నంబర్–1గా నిలిచిన ఓ కంపెనీ ఏకంగా రూ.330 కోట్ల మేర నగదు స్వీకరించినట్లు తెలిసింది. దాదాపు నాలుగు రోజులపాటు ఈ కంపెనీ డాక్యుమెంట్లు పరిశీలించిన ఆదాయపన్ను శాఖ బృందం ఈ మేరకు అంచనా వేసినట్లు అత్యున్నత అధికార వర్గాలు తెలియజేశాయి. గ్రామాలవారీగా విత్తనాలు అమ్మి రైతుల నుంచి సేకరించిన నగదు మొత్తాన్ని విత్తన వ్యాపారులు లేదా డీలర్లు బ్యాంక్‌లలో డీడీ తీయడమో లేదా చెక్కు రూపంలో ఆయా కంపెనీలకు జమ చేయాలి. అలాకాకుండా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో విత్తనాలు విక్రయించిన వ్యాపారులు, డీలర్లు రూ.2 లక్షలు దాటిన లావాదేవీలను కూడా నగదు రూపంలో తీసుకున్నట్లు తెలిసింది. -
రేపటి నుంచి విత్తన కార్పొరేషన్ల సదస్సు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థను బలోపేతం చేస్తామని ఆ సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్రావు తెలిపారు. ఈ మేరకు ఈ నెల 6, 7 తేదీల్లో జరగనున్న వివిధ రాష్ట్రాల విత్తన కార్పొరేషన్ల సదస్సును వినియోగించుకోనున్నట్లు చెప్పారు. బుధవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ డాక్టర్ ఎం.జగన్మోహన్తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్పొరేషన్ ద్వారా విత్తనోత్పత్తి చేపట్టడంతో పాటు పరిశోధనలు, మార్కెటింగ్ సౌకర్యాలను విస్తృత పరచుకోనున్నట్లు తెలిపారు. విత్తన సదస్సుకు మహారాష్ట్ర, ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల విత్తన కార్పొరేషన్లతో పాటు జాతీయ విత్తన కార్పొరేషన్, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ప్రతినిధులు రానున్నారని వెల్లడించారు. సదస్సులో ఆయా రాష్ట్రాలు రైతులకు నాణ్యమైన విత్తనాలను సకాలంలో అందిస్తున్న పద్ధతులను అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. మార్కెటింగ్, విత్తనోత్పత్తికి పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. ప్రారంభోత్సవంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ముగింపు సదస్సులో మంత్రి తుమ్మల పాల్గొంటారన్నారు. పార్థసారధి మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం నుంచి పంపిణీ చేసే విత్తనాలకు టెండర్ విధానం లేకుండా మన రాష్ట్రంలోనే హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేపట్టే చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అనేక పరిశోధన కేంద్రాలు ఉన్నాయని, వీటన్నింటిని వినియోగించుకుని విత్తనోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు విదేశాలకు, ఇతర దేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. నకిలీ విత్తన నిరోధానికి చట్టం తీసుకురావాలనుకున్నప్పటికీ, ఈ అంశం కేంద్రం పరిధిలో ఉండటం, జాతీయ స్థాయిలో నూతన విత్తన చట్టం తీసుకువచ్చే సూచనలు కనిపించడంతో ఆ విధానానికి అనుగుణంగా ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. -
పత్తి విత్తన కంపెనీలు మోసగించాయి..
- నష్టపరిహారం ఇవ్వడంలేదని రైతుల ఆందోళన - వ్యవసాయ కమిషనరేట్‌లో 3 గంటలపాటు ధర్నా సాక్షి, హైదరాబాద్: పత్తి రైతులు మళ్లీ ఆందోళనబాట పట్టారు. విత్తన కంపెనీలు నష్టపరిహారం చెల్లించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహికో, నూజివీడు తదితర పత్తి కంపెనీల చేతుల్లో మోసపోయి పంట కోల్పోయిన రంగారెడ్డి జిల్లా రైతులు శుక్రవారం హైదరాబాద్‌లోని వ్యవసాయశాఖ కమిషనరేట్‌లో ఆందోళన చేశారు. వ్యవసాయ శాఖ డెరైక్టర్ ప్రియదర్శిని చాంబర్ ముందు 3 గంటలపాటు ధర్నా చేశారు. నినాదాలతో కమిషనరేట్ ప్రాంగణం హోరెత్తింది. రంగారెడ్డి జిల్లా నవాబుపేట, వికారాబాద్ సహా ఇతర మండలాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ధర్నాకు తరలివచ్చారు. రైతులు, నేతలను డెరైక్టర్ తన ఛాంబర్‌కు పిలిచి మాట్లాడారు. గత ఖరీఫ్‌లో ఆయా కంపెనీల పత్తి విత్తనాలు వేశామని, ఏపుగా పెరిగినా కాయ కాయలేదని రైతులు పేర్కొన్నారు. నష్టపరిహారం కోసం ఇదివరకు ఆందోళన చేయగా దీనిపై కమిటీని ఏర్పాటు చేశారని చెప్పారు. నష్టపరిహారంగా ఎకరానికి రూ. 24 వేలు ఇవ్వాలని కమిటీ నిర్ణయించినా కంపెనీలు ఒక్క పైసా ఇవ్వలేదని, కేవలం రూ. 6 వేలు మాత్రమే ఇస్తామని చెబుతున్నాయని రైతులు విమర్శించారు. కంపెనీలతో మాట్లాడి 15 రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తానని డెరైక్టర్ హామీఇచ్చారు. కానీ, 8 రోజుల్లోగా పరిష్కరించాలని, తర్వాత మళ్లీ కమిషనరేట్‌కు వస్తామని రైతులు తేల్చి చెప్పారు. ధర్నాలో భారత కిసాన్ సంఘ్ అధ్యక్షుడు టి.అంజిరెడ్డి, ప్రధానకార్యదర్శి ఎం.శ్రీధర్‌రెడ్డి, కోశాధికారి రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
ఇక విత్తనాలు 40 ఏళ్లు భద్రం
రూ. 4 కోట్లతో గుబ్బా గ్రూప్ నుంచి జెర్మ్ప్లాజమ్ బ్యాంక్... * నెలకు అద్దె రూ. 20,000 నుంచి రూ. 25,000 * ఆదర్శ రైతులకు ఉచితంగా దాచుకునే అవకాశం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అరుదైన, నాణ్యమైన విత్తనాలను భవిష్యత్తు అవసరాల కోసం దీర్ఘకాలం దాచుకోవడానికి విత్తన బ్యాంక్ అందుబాటులోకి వచ్చింది. రైతులు, విత్తన కంపెనీలు, శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన విత్తనాలను దాచుకునే విధంగాప్రైవేటు రంగంలో మొట్ట మొదటి జెర్మ్ప్లాజమ్ బ్యాంక్‌ను గుబ్బా గ్రూపు హైదరాబాద్‌కు సమీపంలో రూ. 4 కోట్ల పెట్టుబడితో 90 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది. దీనికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్రిశాట్ అందించింది. బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఈ జెర్మ్ప్లాజమ్ బ్యాంక్‌ను సినీ నటి అమల అక్కినేని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుబ్బా కోల్డ్ స్టోరేజ్ సీఈవో కిరణ్ మాట్లాడుతూ విత్తనాలను 5 నుంచి 40 ఏళ్ళ వరకు దాచుకోవచ్చన్నారు. వాక్యూమ్ ప్యాక్‌లో ఈ విత్తనాలను -20 డిగ్రీల అతి శీతల వాతావరణంలో భద్రపరుస్తారు. అగ్ని ప్రమాదాలు, భూకంపాలను తట్టుకునే విధంగా అభివృద్ధి చేసిన ఈ బ్యాంకులో 57 లాకర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ లాకర్లలో విత్తనాలను భద్రపర్చుకున్నవారు నెలకు సుమారు రూ. 20,000 నుంచి రూ. 25,000 వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఈ బ్యాంకులో విత్తనాలు దాచుకోవడానికి సంబంధించి సుమారు 200 కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని, వచ్చే నెలల నుంచి ఈ బ్యాంకు వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తుందన్నారు. లాభాపేక్ష లేకుండా ఆదర్శ రైతులు అభివృద్ధి చేసిన విత్తనాలను ఉచితంగా భద్రపరుస్తామన్నారు. విత్తనాలు, ఆకులు, చెట్ల కొమ్మల్లో ఉండే సహజమైన జన్యుపదార్థంలో ఎటువంటి మార్పులు లేకుండా దీర్ఘకాలం భద్రపర్చుకోవడానికి ఈ జెర్మ్ప్లాజమ్ బ్యాంకులు ఉపయోగపడతాయి. కోల్డ్ స్టోరేజ్ విస్తరణ కోల్డ్‌స్టోరేజ్ వ్యాపారంలో ఉన్న గుబ్బా గ్రూపు ఈ ఏడాది మరో రెండు కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ముంబై, బెంగళూరు, చెన్నైలతో పాటు గుంటూరులను పరిశీలిస్తున్నట్లు గుబ్బా కోల్డ్‌స్టోరేజ్ ఎండీ జి.నాగేందర్ రావు తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్థ తెలంగాణలో ఆరు కోల్డ్‌స్టోరేజ్ యూనిట్లతో గతేడాది రూ. 28 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. -
రూ.6 కోట్లు హాంఫట్ !
ఆరుగాలం కష్టించి.. విత్తనాలను ఉత్పత్తి చేస్తే గద్దల్లా తన్నుకుపోయిన డీలర్లు తీరా డబ్బులిచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారు. వారంరోజుల్లో డబ్బులిస్తామని చెప్పిన డీలర్లు నాలుగు నెలలు దాటినా స్పందించడం లేదు. ఆయా విత్తన కంపెనీలు డీలర్ల ఖాతాలో డబ్బులు జమ చేసినా.. సొంతానికి వాడుకుని అన్నదాతలను అష్టకష్టాలు పెడుతున్నారు. వందలుకాదు.. వేలు కాదు.. ఏకంగా రూ.6 కోట్లు చెల్లించాల్సి ఉన్నా.. తప్పించుకుతిరుగుతున్నారు. వీణవంక : తెలంగాణలో విత్తనోత్పత్తి(సీడ్) (ఆడ, మగ)కి జిల్లా అనువైన ప్రాంతం. ఇక్కడ పండిన ధాన్యాన్ని రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్‌తోపాటు, చైనా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు విత్తనాలుగా ఎగుమతి చేస్తారు. దీంతో జిల్లాలో 42 రకాల విత్తన కంపెనీలు 22 ఏళ్లుగా జిల్లా రైతులను నమ్మించి విత్తనోత్పత్తి చేయిస్తున్నాయి. ఇందుకు డీలర్లను నియమించుకుని వారి ద్వారా సాగు చేయిస్తున్నాయి. సాధారణ రకం కంటే సీడ్ ధాన్యానికి అధిక డబ్బులు చెల్లిస్తామని డీలర్లు నమ్మించడంతో గత రబీలో జిల్లా రైతులు సుమారు లక్ష ఎకరాల్లో సాగు చేశారు. వాతావరణం అనుకూలించడంతో ధాన్యం దిగుబడి అధికంగా వచ్చింది. గత ఏప్రిల్‌లో కల్లాల వద్దనే కొనుగోలు చేసిన డీలర్లు ధాన్యాన్ని కంపెనీలకు తరలించారు. వారంలోపు డబ్బులిస్తామన్న డీలర్ల మాట ను నమ్మి ధాన్యాన్ని కంపెనీకి ముట్టజెప్పారు. నాలుగునెలలుగా అందని డబ్బులు ఏప్రిల్‌లో రైతుల నుంచి ధాన్యాన్ని తీసుకెళ్లిన డీలర్లు డబ్బులు చెల్లించడంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించా రు. రైతులు నిలదీస్తే కంపెనీల నుంచి రాలేదని, రాగానే ఇస్తామని నమ్మిస్తూ వచ్చారు. అయినా డబ్బు లు రాకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. రైతుల ఇబ్బందులను ‘సాక్షి’ వరుస కథనాల రూపం లో ప్రచురించగా.. స్పందించిన మంత్రి ఈటెల రాజేందర్ ఆయా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. వెంటనే డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. సొంతానికి వాడుకున్న డీలర్లు మంత్రి ఆదేశాల మేరకు ఆయా కంపెనీలు విత్తనోత్పత్తి డబ్బులను డీలర్లఖాతాలో జమ చేయగా వారు కొందరికే చెల్లించారు. డబ్బులు అందని రైతులు కంపెనీలను సంప్రదిస్తే డీలర్లకు ఎప్పుడో ఇచ్చామంటున్నారు.డీలర్లు సొంతానికి వాడుకున్నట్లు తెలుసుకున్న రైతులుమళ్లీ మంత్రి వద్దకు వెళ్తున్నారు. అంతా డీలర్లే.. జిల్లాలోని ఓ మూడు మల్టీనేషనల్ కంపనీలు మాత్ర మే రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేశా యి. మిగతా కంపెనీలు డీలర్లకు అప్పగిస్తున్నాయి. కంపెనీలు క్వింటాల్‌కు రూ.ఆరు వేల నుంచి రూ.8 వేల వరకు చెల్లిస్తుండగా.. డీలర్లు మాత్రం క్వింటాల్‌కు రూ.500 నుంచి రూ.వెయ్యివరకు కోత పెట్టి ఇస్తున్నారు. ఈ మొత్తం సుమారు రూ.6 కోట్ల మేర ఉంటుందని సమాచారం. అడిగితే తేమ, తరుగు అం టున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ డబ్బులు ఇచ్చేందుకు కూడా రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. మంత్రి వద్దకు పంచాయితీ డీలర్ల మాయాజాలంపై రైతులు మంత్రి రాజేందర్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. వారం రోజుల క్రితం జమ్మికుం ట మండల నాగంపేటకు చెందిన ఓ రైతు తాను వీణవంక మండలం బేతిగల్‌కు చెందిన ఓ డీలరుకు రెండే ళ్ల క్రితం ధాన్యం విక్రయించానని, రూ.మూడు లక్షల కు ఇంతవరకు చిల్లిగవ్వ ఇవ్వలేదని వాపోయాడు. మండలంలో మరో ఇద్దరు డీలర్లు రూ.80లక్షలు రైతు లకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న విషయం కూడా మంత్రి దృష్టికి వెళ్లడంతో మంత్రి సదరు డీలర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా.. డీలర్లలో మాత్రం మార్పు రావడంలేదు. తమకు డబ్బులు ఇప్పించాలని కోరుతూ జిల్లాతోపాటు వరంగల్, మెదక్ జిల్లాల రైతులు మంత్రి వద్దకు వస్తున్నారంటే డీలర్ల మాయాజాలం అర్థం చేసుకోవచ్చు.