పత్తి విత్తన కంపెనీలు మోసగించాయి..
- నష్టపరిహారం ఇవ్వడంలేదని రైతుల ఆందోళన
- వ్యవసాయ కమిషనరేట్‌లో 3 గంటలపాటు ధర్నా
సాక్షి, హైదరాబాద్: పత్తి రైతులు మళ్లీ ఆందోళనబాట పట్టారు. విత్తన కంపెనీలు నష్టపరిహారం చెల్లించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహికో, నూజివీడు తదితర పత్తి కంపెనీల చేతుల్లో మోసపోయి పంట కోల్పోయిన రంగారెడ్డి జిల్లా రైతులు శుక్రవారం హైదరాబాద్‌లోని వ్యవసాయశాఖ కమిషనరేట్‌లో ఆందోళన చేశారు. వ్యవసాయ శాఖ డెరైక్టర్ ప్రియదర్శిని చాంబర్ ముందు 3 గంటలపాటు ధర్నా చేశారు. నినాదాలతో కమిషనరేట్ ప్రాంగణం హోరెత్తింది. రంగారెడ్డి జిల్లా నవాబుపేట, వికారాబాద్ సహా ఇతర మండలాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ధర్నాకు తరలివచ్చారు.
రైతులు, నేతలను డెరైక్టర్ తన ఛాంబర్‌కు పిలిచి మాట్లాడారు. గత ఖరీఫ్‌లో ఆయా కంపెనీల పత్తి విత్తనాలు వేశామని, ఏపుగా పెరిగినా కాయ కాయలేదని రైతులు పేర్కొన్నారు. నష్టపరిహారం కోసం ఇదివరకు ఆందోళన చేయగా దీనిపై కమిటీని ఏర్పాటు చేశారని చెప్పారు. నష్టపరిహారంగా ఎకరానికి రూ. 24 వేలు ఇవ్వాలని కమిటీ నిర్ణయించినా కంపెనీలు ఒక్క పైసా ఇవ్వలేదని, కేవలం రూ. 6 వేలు మాత్రమే ఇస్తామని చెబుతున్నాయని రైతులు విమర్శించారు. కంపెనీలతో మాట్లాడి 15 రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తానని డెరైక్టర్ హామీఇచ్చారు. కానీ, 8 రోజుల్లోగా పరిష్కరించాలని, తర్వాత మళ్లీ కమిషనరేట్‌కు వస్తామని రైతులు తేల్చి చెప్పారు. ధర్నాలో భారత కిసాన్ సంఘ్ అధ్యక్షుడు టి.అంజిరెడ్డి, ప్రధానకార్యదర్శి ఎం.శ్రీధర్‌రెడ్డి, కోశాధికారి రంగారావు తదితరులు పాల్గొన్నారు.