సాక్షి, హైదరాబాద్: ఆదాయపు పన్ను ఎగవేసేందుకు విత్తన కంపెనీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. రైతుల పేరుతో కోట్ల రూపాయలు పన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్నాయి. తామే సొంతంగా రైతుల అవతారమెత్తినట్లు బడా కంపెనీలు నాటకమాడుతున్న తీరు ఆదాయపు పన్ను శాఖను విస్మయానికి గురి చేస్తోంది. రాష్ట్రంలో కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో వందలాది విత్తన ఉత్పత్తి కంపెనీలున్నాయి. అనుకూలమైన వాతావరణం ఉండటంతో పాటు అనువైన పంట భూములు, రవాణా సదుపాయాలుండటంతో ఈ ప్రాంతంలో విత్తన ఉత్పత్తి కంపెనీల వ్యాపారం వర్ధిల్లుతోంది. విత్తన కంపెనీలు తమకు అవసరమయ్యే పంట ఉత్పత్తులను రైతుల నుంచి కొనుగోలు చేసి.. నాణ్యమైన విత్తనాలను తయారు చేస్తాయి. ప్రయోగ దశలో కొన్ని ప్రాంతాల్లో కంపెనీలే రైతుల పొలాల్లో అవసరమైన పంట వేయించి విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి.
రైతుల పేరిట నాటకం..
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రైతులు, వ్యాపారుల నుంచి ఓ బడా కంపెనీ రూ.500 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల విలువైన పత్తిని కొనుగోలు చేస్తోంది. రైతులు తమ భూముల్లో పండించే పంట ద్వారా వచ్చిన ఆదాయానికి ఐటీ మినహాయింపు ఉంది. కంపెనీల పెట్టుబడులు, రైతుల నుంచి పంట ఉత్పత్తులు కొనుగోలు చేసే వ్యాపారం ఐటీ పరిధిలోకి వస్తాయి. అందుకే సదరు కంపెనీ సొంతంగా 2 వేల ఎకరాల వ్యవసాయ భూమి లీజుకు తీసుకున్నట్లు తప్పుడు రికార్డులు సృష్టించినట్లు తెలిసింది. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈ భూములున్నాయని, అక్కడ పండించిన పంట నుంచే తాము విత్తనాలను ఉత్పత్తి చేసినట్లు వ్యాపారం చేస్తోంది. విత్తనాల తయారీకి తాము పెట్టిన పెట్టుబడి ఐటీ పరిధిలోకి రాదంటూ నాటకానికి తెర తీసింది. ఇటీవల ఈ కంపెనీ టర్నోవర్‌కు, పన్ను చెల్లింపునకు భారీ వ్యత్యాసం ఉండటంతో ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన సోదాల్లో ఈ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. విత్తన ప్రయోగ క్షేత్రాలు 50 ఎకరాల్లో లేకున్నా.. వేలాది ఎకరాలు లీజుకు తీసుకున్నట్లు విత్తన కంపెనీలు ఎగవేసిన సొమ్ము గడిచిన ఐదేళ్లలో దాదాపు రూ.1,000 కోట్లకు పైగా ఉంటుందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
నగదు పేరిట మరో మోసం..
నిబంధనలకు విరుద్ధంగా నగదు తీసుకుని దానికి లెక్క చూపించకుండా పన్ను ఎగవేతలోనూ విత్తన కంపెనీలు పోటీ పడుతున్నాయి. తెలంగాణ, ఏపీ, కర్ణాటకతో పాటు గుజరాత్‌లో ఇటీవల ఆదాయ పన్ను శాఖ దాడులు నిర్వహించింది. రైతులు నగదు చెల్లించి డీలర్లు, వ్యాపారుల నుంచి విత్తనాలు కొనుగోలు చేయటం సర్వసాధారణం. కానీ డీలర్లు, వ్యాపారులు సంబంధిత కంపెనీలకు నగదు చెల్లించటం కుదరదు. తమ వ్యాపార లావాదేవీలు రూ.2 లక్షలు దాటితే చెక్కు లేదా డీడీ రూపంలో చెల్లించాలి. కానీ కంపెనీలు నగదు రూపంలోనే తమకు డబ్బు చెల్లించాలని డీలర్లను ప్రోత్సహిస్తున్నాయి. నగదు చెల్లిస్తే ప్రోత్సాహకాలు, పారితోషికం కూడా ఇస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. దీంతో తెలంగాణలోని విత్తన వ్యాపారులు, ఆథరైజ్డ్ డీలర్లు దాదాపు 70 నుంచి 80 శాతం లావాదేవీలను నగదు రూపంలోనే నిర్వ హిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీటీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఓ టాప్ కంపెనీ దాదాపు రూ.300 కోట్లకు పైగా నగదు స్వీకరించినట్లు తెలిసింది.
విత్తన కంపెనీల మాయాజాలం
Published Wed, Jan 24 2018 1:01 AM | Last Updated on Mon, Oct 1 2018 2:16 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment