ఇక విత్తనాలు 40 ఏళ్లు భద్రం | Gubba group opens germplasm bank | Sakshi
Sakshi News home page

ఇక విత్తనాలు 40 ఏళ్లు భద్రం

Published Thu, Jan 29 2015 1:41 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

ఇక విత్తనాలు 40 ఏళ్లు భద్రం - Sakshi

ఇక విత్తనాలు 40 ఏళ్లు భద్రం

రూ. 4 కోట్లతో గుబ్బా గ్రూప్ నుంచి జెర్మ్‌ప్లాజమ్ బ్యాంక్...
* నెలకు అద్దె రూ. 20,000 నుంచి రూ. 25,000
* ఆదర్శ రైతులకు ఉచితంగా దాచుకునే అవకాశం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అరుదైన, నాణ్యమైన విత్తనాలను భవిష్యత్తు అవసరాల కోసం దీర్ఘకాలం దాచుకోవడానికి విత్తన బ్యాంక్ అందుబాటులోకి వచ్చింది. రైతులు, విత్తన కంపెనీలు, శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన విత్తనాలను దాచుకునే విధంగాప్రైవేటు రంగంలో మొట్ట మొదటి జెర్మ్‌ప్లాజమ్ బ్యాంక్‌ను గుబ్బా గ్రూపు హైదరాబాద్‌కు సమీపంలో రూ. 4 కోట్ల పెట్టుబడితో 90 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది.

దీనికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్రిశాట్ అందించింది. బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఈ జెర్మ్‌ప్లాజమ్ బ్యాంక్‌ను సినీ నటి అమల అక్కినేని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుబ్బా కోల్డ్ స్టోరేజ్ సీఈవో కిరణ్ మాట్లాడుతూ విత్తనాలను 5 నుంచి 40 ఏళ్ళ వరకు దాచుకోవచ్చన్నారు. వాక్యూమ్ ప్యాక్‌లో ఈ విత్తనాలను -20 డిగ్రీల అతి శీతల వాతావరణంలో భద్రపరుస్తారు.

అగ్ని ప్రమాదాలు, భూకంపాలను తట్టుకునే విధంగా అభివృద్ధి చేసిన ఈ బ్యాంకులో 57 లాకర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ లాకర్లలో విత్తనాలను భద్రపర్చుకున్నవారు నెలకు సుమారు రూ. 20,000 నుంచి రూ. 25,000 వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఈ బ్యాంకులో విత్తనాలు దాచుకోవడానికి సంబంధించి సుమారు 200 కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని, వచ్చే నెలల నుంచి ఈ బ్యాంకు వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తుందన్నారు.

లాభాపేక్ష లేకుండా ఆదర్శ రైతులు అభివృద్ధి చేసిన విత్తనాలను ఉచితంగా భద్రపరుస్తామన్నారు. విత్తనాలు, ఆకులు, చెట్ల కొమ్మల్లో ఉండే సహజమైన జన్యుపదార్థంలో ఎటువంటి మార్పులు లేకుండా దీర్ఘకాలం భద్రపర్చుకోవడానికి ఈ జెర్మ్‌ప్లాజమ్ బ్యాంకులు ఉపయోగపడతాయి.
 
కోల్డ్ స్టోరేజ్ విస్తరణ
కోల్డ్‌స్టోరేజ్ వ్యాపారంలో ఉన్న గుబ్బా గ్రూపు ఈ ఏడాది మరో రెండు కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ముంబై, బెంగళూరు, చెన్నైలతో పాటు గుంటూరులను పరిశీలిస్తున్నట్లు గుబ్బా కోల్డ్‌స్టోరేజ్ ఎండీ జి.నాగేందర్ రావు తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్థ తెలంగాణలో ఆరు కోల్డ్‌స్టోరేజ్ యూనిట్లతో గతేడాది రూ. 28 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement