సాక్షి, హైదరాబాద్: అనుమతి లేని విత్తనాలు అమ్మడమే కాదు, నిబంధనలకు విరుద్ధంగా నగదు తీసుకుని దానికి లెక్క చూపించకుండా పన్ను ఎగవేతలోనూ విత్తన కంపెనీలు పోటీ పడుతున్నాయి. తెలంగాణ, ఏపీ, కర్ణాటకతో పాటు గుజరాత్‌లో ఇటీవల ఆదాయపన్ను శాఖ నిర్వహించిన దాడులలో ఇది తేటతెల్లమైంది. రైతులకు విక్రయించిన విత్తనాలకు లావాదేవీల సొమ్మును డీలర్లు నగదు రూపంలో తీసుకున్నా, కంపెనీకి చెల్లించేటప్పుడు రూ.2 లక్షలు దాటితే చెక్కురూపంలో చెల్లించాలి.
కానీ, విత్తన కంపెనీలు కోట్ల రూపాయలను అక్రమంగా తీసుకుంటున్నాయి. రైతాంగం నుంచి తక్కువ మొత్తంలో వచ్చిన మొత్తం డీలర్ల దగ్గరకు వచ్చేసరికి లక్షల్లో అవుతుంది. కానీ, విత్తన కంపెనీల యాజమాన్యాలు ఇచ్చే పారితోషకాలను దృష్టిలో ఉంచుకుని విత్తన వ్యాపారులు, ఆథరైజ్డ్ డీలర్లు 70 నుంచి 80 శాతం మొత్తంను నగదు రూపంలో చెల్లిస్తున్నట్లు తాజా దాడులలో వెల్లడైంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాదిన బీటీ పత్తి విత్తనాలు విక్రయించడంలో నంబర్–1గా నిలిచిన ఓ కంపెనీ ఏకంగా రూ.330 కోట్ల మేర నగదు స్వీకరించినట్లు తెలిసింది.
దాదాపు నాలుగు రోజులపాటు ఈ కంపెనీ డాక్యుమెంట్లు పరిశీలించిన ఆదాయపన్ను శాఖ బృందం ఈ మేరకు అంచనా వేసినట్లు అత్యున్నత అధికార వర్గాలు తెలియజేశాయి. గ్రామాలవారీగా విత్తనాలు అమ్మి రైతుల నుంచి సేకరించిన నగదు మొత్తాన్ని విత్తన వ్యాపారులు లేదా డీలర్లు బ్యాంక్‌లలో డీడీ తీయడమో లేదా చెక్కు రూపంలో ఆయా కంపెనీలకు జమ చేయాలి. అలాకాకుండా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో విత్తనాలు విక్రయించిన వ్యాపారులు, డీలర్లు రూ.2 లక్షలు దాటిన లావాదేవీలను కూడా నగదు రూపంలో తీసుకున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment