రూ.6 కోట్లు హాంఫట్ !
ఆరుగాలం కష్టించి.. విత్తనాలను ఉత్పత్తి చేస్తే గద్దల్లా తన్నుకుపోయిన డీలర్లు తీరా డబ్బులిచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారు. వారంరోజుల్లో డబ్బులిస్తామని చెప్పిన డీలర్లు నాలుగు నెలలు దాటినా స్పందించడం లేదు. ఆయా విత్తన కంపెనీలు డీలర్ల ఖాతాలో డబ్బులు జమ చేసినా.. సొంతానికి వాడుకుని అన్నదాతలను అష్టకష్టాలు పెడుతున్నారు. వందలుకాదు.. వేలు కాదు.. ఏకంగా రూ.6 కోట్లు చెల్లించాల్సి ఉన్నా.. తప్పించుకుతిరుగుతున్నారు.
వీణవంక :
తెలంగాణలో విత్తనోత్పత్తి(సీడ్) (ఆడ, మగ)కి జిల్లా అనువైన ప్రాంతం. ఇక్కడ పండిన ధాన్యాన్ని రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్‌తోపాటు, చైనా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు విత్తనాలుగా ఎగుమతి చేస్తారు. దీంతో జిల్లాలో 42 రకాల విత్తన కంపెనీలు 22 ఏళ్లుగా జిల్లా రైతులను నమ్మించి విత్తనోత్పత్తి చేయిస్తున్నాయి. ఇందుకు డీలర్లను నియమించుకుని వారి ద్వారా సాగు చేయిస్తున్నాయి. సాధారణ రకం కంటే సీడ్ ధాన్యానికి అధిక డబ్బులు చెల్లిస్తామని డీలర్లు నమ్మించడంతో గత రబీలో జిల్లా రైతులు సుమారు లక్ష ఎకరాల్లో సాగు చేశారు. వాతావరణం అనుకూలించడంతో ధాన్యం దిగుబడి అధికంగా వచ్చింది. గత ఏప్రిల్‌లో కల్లాల వద్దనే కొనుగోలు చేసిన డీలర్లు ధాన్యాన్ని కంపెనీలకు తరలించారు. వారంలోపు డబ్బులిస్తామన్న డీలర్ల మాట ను నమ్మి ధాన్యాన్ని కంపెనీకి ముట్టజెప్పారు.
నాలుగునెలలుగా అందని డబ్బులు
ఏప్రిల్‌లో రైతుల నుంచి ధాన్యాన్ని తీసుకెళ్లిన డీలర్లు డబ్బులు చెల్లించడంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించా రు. రైతులు నిలదీస్తే కంపెనీల నుంచి రాలేదని, రాగానే ఇస్తామని నమ్మిస్తూ వచ్చారు. అయినా డబ్బు లు రాకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. రైతుల ఇబ్బందులను ‘సాక్షి’ వరుస కథనాల రూపం లో ప్రచురించగా.. స్పందించిన మంత్రి ఈటెల రాజేందర్ ఆయా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. వెంటనే డబ్బులు చెల్లించాలని ఆదేశించారు.
సొంతానికి వాడుకున్న డీలర్లు
మంత్రి ఆదేశాల మేరకు ఆయా కంపెనీలు విత్తనోత్పత్తి డబ్బులను డీలర్లఖాతాలో జమ చేయగా వారు కొందరికే చెల్లించారు. డబ్బులు అందని రైతులు కంపెనీలను సంప్రదిస్తే డీలర్లకు ఎప్పుడో ఇచ్చామంటున్నారు.డీలర్లు సొంతానికి వాడుకున్నట్లు తెలుసుకున్న రైతులుమళ్లీ మంత్రి వద్దకు వెళ్తున్నారు.
అంతా డీలర్లే..
జిల్లాలోని ఓ మూడు మల్టీనేషనల్ కంపనీలు మాత్ర మే రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేశా యి. మిగతా కంపెనీలు డీలర్లకు అప్పగిస్తున్నాయి. కంపెనీలు క్వింటాల్‌కు రూ.ఆరు వేల నుంచి రూ.8 వేల వరకు చెల్లిస్తుండగా.. డీలర్లు మాత్రం క్వింటాల్‌కు రూ.500 నుంచి రూ.వెయ్యివరకు కోత పెట్టి ఇస్తున్నారు. ఈ మొత్తం సుమారు రూ.6 కోట్ల మేర ఉంటుందని సమాచారం. అడిగితే తేమ, తరుగు అం టున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ డబ్బులు ఇచ్చేందుకు కూడా రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు.
మంత్రి వద్దకు పంచాయితీ
డీలర్ల మాయాజాలంపై రైతులు మంత్రి రాజేందర్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. వారం రోజుల క్రితం జమ్మికుం ట మండల నాగంపేటకు చెందిన ఓ రైతు తాను వీణవంక మండలం బేతిగల్‌కు చెందిన ఓ డీలరుకు రెండే ళ్ల క్రితం ధాన్యం విక్రయించానని, రూ.మూడు లక్షల కు ఇంతవరకు చిల్లిగవ్వ ఇవ్వలేదని వాపోయాడు. మండలంలో మరో ఇద్దరు డీలర్లు రూ.80లక్షలు రైతు లకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న విషయం కూడా మంత్రి దృష్టికి వెళ్లడంతో మంత్రి సదరు డీలర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా.. డీలర్లలో మాత్రం మార్పు రావడంలేదు. తమకు డబ్బులు ఇప్పించాలని కోరుతూ జిల్లాతోపాటు వరంగల్, మెదక్ జిల్లాల రైతులు మంత్రి వద్దకు వస్తున్నారంటే డీలర్ల మాయాజాలం అర్థం చేసుకోవచ్చు.