మెదక్‌జోన్ : పలు విత్తన కంపెనీలకు చెందిన ఏజెంట్లు ఇష్టారీతిగా రైతులతో విత్తనోత్పత్తి చేయిస్తున్నారు. కానీ ఆయా కంపెనీలతో ముందస్తు ఒప్పందం చేసుకోవడం లేదు. విత్తనాలను సాగు చేస్తున్నప్పుడు ఏదైనా సమస్య ఉత్పన్నమైతే ఒప్పందం సాగును చట్టబద్ధం చేస్తూ రైతులకు నష్టం రాకుండా రాష్ట్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. కానీ వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖల పర్యవేక్షణ కొరవడడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. నూతన చట్టం ప్రకారం కంపెనీ లేదా వ్యక్తి రైతుతో పంటను పండించాలనుకుంటే మార్కెటింగ్‌శాఖ వద్ద లైసెన్స్ తీసుకోవాలి. పండించాలనుకున్న పంట విస్తీర్ణం రైతులతో చేసుకున్న ధరల ఒప్పందం వంటివన్నీ ప్రభుత్వ అధికారులకు నెల రోజుల్లోపు సమర్పించాలి. ప్రభుత్వ మద్దతు ధరకన్నా తక్కువ ధరకు కొనకూడదు. పంట పండిన తరువాత ఒప్పందం ప్రకారం రైతుకు డబ్బులు చెల్లించాలి. రైతుల భూములపై ఆయా కంపెనీలకు ఎలాంటి అధికారాలు ఉండవు. ఏవైనా వివాదాలు తలెత్తితే మార్కెటింగ్‌శాఖ సంచాలకుడికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. తద్వారా అధికారులు పరిశీలించి నెల రోజుల్లోపు సమస్యను పరిష్కరించాలి. రబీలో ఒప్పందసాగు అధికంగా ఉంది కాబట్టి కంపెనీలన్నీ ఒప్పంద లైసెన్స్ పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి. కానీ ఇప్పటి వరకు జిల్లాలో పెద్ద ఎత్తున విత్తన పంటలు వేసినా ఎవరూ ఒప్పందం చేసుకోలేదు. దీంతో రైతులకు చట్టంతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది.
చాలాకాలంగా సాగు..
మెదక్ జిల్లాలో చిన్నశంకరంపేట, రామాయంపేట, వెల్దుర్తి, మెదక్, హవేలిఘణాపూర్, చేగుంట, నార్సింగ్‌తోపాటు పలు మండలాల్లో విత్తన కంపెనీదారులు చాలా కాలంగా రైతులతో విత్తనాలను ఉత్పత్తి చేయించి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా వరి పంటల రకాలను అధికంగా సాగు చేస్తున్నారు. విత్తనోత్పత్తి ద్వారా ఎకరాకు రూ. 8 నుండి రూ. 10 వేల వరకు అదనపు ఆదాయం వస్తుండడంతో రైతులు కూడా విత్తనోత్పత్తికి మొగ్గుచూపుతున్నారు. సాధారణ పరిస్థితుల్లో హైబ్రిడ్ వరితోపాటు టేక్మాల్, రేగోడు, అల్లాదుర్గం, పెద్దశంకంపేట తదితర మండలాల్లో పత్తి, మొక్కజొన్నలాంటి విత్తనాలను సాగు చేయిస్తున్నారు. విత్తనోత్పత్తి సాగు సమయంలో వాతావరణం అనుకూలించకపోతే దిగుబడి తగ్గిపోయి రైతులు నష్టాల పాలవుతున్నారు. ఈ క్రమంలో రైతుతో ముందుగా కంపెనీ యజమాని ఒప్పందం చేసుకున్న ప్రకారం డబ్బులను చెల్లించడం లేదనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా సదరు కంపెనీలు రైతులకు డబ్బులు తక్కువగా చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఏజెంట్ల మాయాజాలం..
విత్తనోత్పత్తి విషయంలో వివిధ కంపెనీల ఏజెంట్లు రైతులతో ఒప్పందం చేసుకున్న విధంగా డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయి. 2013వ సంవత్సరంలో చేగుంట మండలంలోని మాసాయిపేటలో ఓ రైతు ఐదు ఎకరాల పొలంలో వరి విత్తన రకాన్ని సదరు కంపెనీ యజమాని సూచన మేరకు సాగు చేశాడు. కానీ వాతావరణ మార్పులతో పంటకు తెగులు సోకింది. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేక పోవడంతో విత్తన కంపెనీ ఏజెంట్ పత్తాలేకుండా పోవడంతో బాధిత రైతు నెత్తీనోరు బాదుకున్నాడు. ఈ విషయాన్ని అప్పట్లో వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకొచ్చాడు. అయినా రాతపూర్వకంగా ఎలాంటి ఒప్పంద పత్రం లేకపోవడంతో తాము ఏమీ చేయలేమని అధికారులు చేతులు ఎత్తివేశారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో కోకొల్లలు.
వెయ్యి ఎకరాల్లో సాగు..
జిల్లావ్యాప్తంగా 20 వేల హెక్టార్లలో సాధారణ వరి పంటలు సాగు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 18 వేల హెక్టార్లలో సాగయ్యాయి. జిల్లా వ్యాప్తంగా విత్తన కంపెనీదారులు సుమారు 1000 ఎకరాల్లో వరి విత్తనాలను సాగు చేయించినట్లు తెలిసింది. ఒప్పంద పత్రం రాసుకుని సాగు చేయిస్తేనే రైతులకు న్యాయం జరుగుతుంది.
పాటించాల్సిన నిబంధనలు...
విత్తనోత్పత్తి చేసే కంపెనీలు రైతుతో సాగు చేయించే విత్తనాలను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు. విత్తిన తరువాత రైతుల పొలాలను ఎన్నిసార్లు పరిశీలించారు. పంట చేతికందే సమయంలో నిబంధనలు పాటించడంతోపాటు ఎప్పటికప్పుడు విత్తనాల నమూనా పరీక్షలు చేసి ప్యాకింగ్ వరకు సంబంధిత అధికారులు పర్యవేక్షించి సీడ్ సర్టిఫికెట్ ట్యాగ్ లేబుల్, సీళ్లను ఇస్తారు. అధికారుల పర్యవేక్షణ లేకపోతే మోసగాళ్లకు ఆడిందే ఆటగా మారుతుంది. ఈ క్రమంలో రైతులను నిండా ముంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
రాతపూర్వక ఒప్పందం చేసుకోవాలి..
కంపెనీలు రైతులతో విత్తనోత్పత్తి చేయాలనుకుంటే ముందుగానే బాండ్ పేపర్‌పై రాతపూర్వకంగా ఒప్పందం చేసుకోవాలి. వాతావరణ మార్పుల కారణంగా లేదా మరేమైనా కారణాలతో పంటలు నష్టపోయిన సందర్భాల్లో ఒప్పందం మేరకు రైతుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. లేనట్లయితే సదరు కంపెనీలపై కేసు వేసే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ప్రతీ కంపెనీదారుడు తప్పని సరిగా నిబంధనల ప్రకారం లైసెన్స్ తీసుకోవాలి.– జిల్లా వ్యవసాయ అధికారి పరుశురాం
Comments
Please login to add a commentAdd a comment