
సాక్షి, అమరావతి: పశుపోషణను లాభసాటిగా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పం మేరకు శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం (ఎస్వీవీయూ) పెద్ద ఎత్తున విస్తరణ కార్యక్రమాలు చేపడుతోంది. పశుఆరోగ్య పరిరక్షణ, యాజమాన్య పద్దతులపై శాస్త్రీయ విషయ పరిజ్ఞానం కల్పించడం, శాస్త్రవేత్తల సూచనల మేరకు ఆధునిక పశుపోషణపై అవగాహన పెంచి ఇతర వృత్తులకు దీటుగా ఆదాయం పెంచడమే లక్ష్యంగా టోల్‌ఫ్రీ నంబరు 1800–120–4209తో ఏర్పాటు చేసిన కిసాన్ కాల్‌సెంటర్ పాడిరైతులు, విద్యార్థుల అవసరాలను తీరుస్తోంది. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తున్న ఈ కాల్‌సెంటర్‌లో కేవీకే సిబ్బంది సేవలందిస్తున్నారు.
పాడిపశువుల పోషణ, యాజమాన్యం, పునరుత్పత్తి, పశుగ్రాసాల సాగు, వ్యాధులు–నివారణ, విలువ ఆధారిత పదార్థాల తయారీ తదితర అంశాలపై రైతుల సందేహాలను నివృత్తి చేయడమేగాక పశువైద్య కళాశాలల్లో కొత్త కోర్సులు, ప్రవేశాలపై విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. కాల్‌సెంటర్ ద్వారా గడిచిన ఏడాదిన్నరలో 3,429 మంది సమస్యలను పరిష్కరించారు. పునరుత్పత్తి, గర్భకోశ సంబంధిత వ్యాధుల నివారణ కోసం 759, ఇతర వ్యాధుల నివారణ కోసం 593, పశుపోషణ, యాజమాన్య పద్ధతుల కోసం 370, చేపల పెంపకంపై 106, పాలు, మాంస పదార్థాల తయారీ కోసం 287, అడ్మిషన్స్ కోసం 1,314 మంది కిసాన్ కాల్‌సెంటర్‌కు ఫోన్‌చేశారు. ఫోన్‌లో విషయం చెప్పగానే క్షణాల్లో వారి సమస్యలకు పరిష్కారమార్గాలు చూపారు.
Comments
Please login to add a commentAdd a comment