
పదేపదే పరీక్షలు వాయిదా
ఎస్వీ వర్సిటీ దూరవిద్య పరీక్షలపై గందరగోళం
గడిచిన రెండు నెలల్లో మూడుసార్లు షెడ్యూల్ విడుదల
ఏదో ఒక సాకుతో వాయిదా... తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు అడ్డు
అధికారుల నిర్లక్ష్యం... విద్యార్థుల పాలిట శాపం
వివిధ కారణాలతో చదువుకోలేకపోయిన వారికి దూరవిద్య ఓ మంచి అవకాశంగా మారింది. తమకు నచ్చిన కోర్సుల్లో డిగ్రీ చేసి, వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో చాలామంది ఈ బాట పడుతున్నారు. కానీ.. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో దూరవిద్యలో చేరిన అభ్యర్థులకు మాత్రం విద్య ‘దూర’మయ్యే పరిస్థితి ఏర్పడింది. సమయానికి పరీక్షలు నిర్వహించకపోవడంతో డిగ్రీలు ఎప్పటికి చేతికొస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. – సాక్షి, అమరావతి
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ దూరవిద్య పరీక్షల్లో గందరగోళం నెలకొంది. గడిచిన విద్యా సంవత్సరానికి సంబంధించి పరీక్షల షెడ్యూల్ ఆలస్యంగా ఇచ్చారు. అంతేకాకుండా పదేపదే మార్పులు చేస్తున్నారు. జనవరి, ఫిబ్రవరిలో పరీక్షల తేదీలను మూడుసార్లు ప్రకటించి.. వివిధ కారణాలతో వాయిదా వేయడం వర్సిటీ అధికారుల నిర్లక్ష్య వైఖరిని స్పష్టం చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వర్సిటీల పాలన దిగజారింది. అప్పటి వరకు ఉన్న వీసీలతో బలవంతంగా రాజీనామా చేయించడం, అనంతరం వీసీల నియామకంలో ఆలస్యం జరిగింది. ఇప్పటికీ వైస్‌చాన్సలర్‌లను నియమించడంలో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.
విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలు
ఎస్వీ వర్సిటీ దూర విద్య ద్వారా అందించే యూజీ, పీజీ, ఎంబీఏ వంటి కోర్సుల్లో రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులూ ప్రవేశాలు పొందారు. అలా 2023–24 విద్యా సంవత్సరానికి సుమారు 32 వేలమందికి పైగా అభ్యర్థులు వివిధ దశల్లో పరీక్షలు రాయాల్సి ఉంది. గతేడాది ఎన్నికల కారణంగా పరీక్షల షెడ్యూల్‌నే ప్రకటించలేదు. ఈ కారణంగా సెపె్టంబర్‌లో దూరవిద్య పరీక్షలు జరగాల్సి ఉండగా కూటమి ప్రభుత్వ కనుసన్నల్లో నడిచిన వర్సిటీ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. అభ్యర్థుల నుంచి ఒత్తిడి పెరగడంతో జనవరిలో పరీక్షలంటూ డిసెంబర్ చివరిలో షెడ్యూల్ విడుదల చేసింది.
అయితే యూజీసీ కమిటీ పర్యటన కారణంగా పరీక్షలను సంక్రాంతి తర్వాత అంటూ వాయిదా వేసింది. అనంతరం ఫిబ్రవరి మొదటివారం మరో షెడ్యూల్ ఇచ్చింది. దాన్ని కూడా వాయిదా వేసింది. తాజాగా ఫిబ్రవరి 24 నుంచి పరీక్షలంటూ షెడ్యుల్ ఇచ్చింది. అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. పరీక్ష పత్రాలు ఎగ్జామ్ సెంటర్‌కు కూడా చేరిపోగా... ఒక్కరోజు ముందు ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా వాయిదా వేస్తున్నామంటూ వర్సిటీ ప్రకటించింది.
పరీక్షలు నిర్వహించే ఉద్దేశమే లేదు
ఎస్వీ వర్సిటీ అధికారులకు దూరవిద్య పరీక్షలను నిర్వహించే ఉద్దేశమే లేదని అభ్యర్థులు మండిపడుతున్నారు. పదేపదే పరీక్షల షెడ్యూల్ వాయిదా వేయడంతో ఇబ్బందులు గురవుతున్నామని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టభద్రులై బయటకు వస్తే ఉద్యోగాలు వచ్చేంత వరకు వారందరినీ నిరుద్యోగులుగా గుర్తించాలని... దీంతో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుందనే దురుద్దేశంతో కూటమి ప్రభుత్వం పరీక్షలను అడ్డుకుంటోందని మండిపడుతున్నారు. వ్యయప్రయాసల కోర్చి, ఫీజులు చెల్లించి... సకాలంలో డిగ్రీ పూర్తి చేయాల్సిన తాము.. ఎనిమిదినెలలకు పైగా ఆలస్యంగా పరీక్షలు రాసి... డిగ్రీలు పొంది ప్రయోజనమేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరీక్షల కోసం ఆత్మహత్యాయత్నం
వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఓ ఏఎన్‌ఎం ఎస్వీ వర్సిటీ దూరవిద్యలో చేరారు. ఈనెల 24 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని వైద్యాధికారిని సెలవులు అడిగారు. కానీ సెలవు మంజూరు చేయకపోవడంతో తాను పరీక్షలు రాయలేనన్న బాధతో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించారు.
దూరవిద్యలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్థులు
వాస్తవానికి దూర విద్య కోర్సులను అభ్యసించే వారిలో సాధారణ విద్యార్థులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో వివిధ స్థాయిల్లో ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకునే వాళ్లు అధికంగా ఉంటారు. వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులూ ఉన్నారు. వర్సిటీ దూరవిద్య పరీక్షల షెడ్యూల్ ఫిబ్రవరి 24న ప్రకటించడంతో చాలామంది ఉద్యోగులు సెలవులు పెట్టుకుని మరీ పరీక్షలకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. తీరా పరీక్షలు వాయిదా పడటంతో గందరగోళానికి గురయ్యారు.
అయోమయంలో ఒడిశా అభ్యర్థులు
మరోవైపు ఒడిశా రాష్ట్రానికి చెందిన దాదాపు 30మంది అభ్యర్థులు రెండేళ్ల క్రితం ఎస్వీ యూనివర్సిటీ దూరవిద్యలో పీజీ కోర్సులో చేరారు. వారంతా ఈనెల 24నుంచి పరీక్షలుండటంతో చిత్తూరు చేరుకున్నారు. తీరా 22న పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ ప్రకటించింది. ఎప్పుడు నిర్వహించేది చెప్పలేదు. దీంతో వారంతా ఏపీలో ఉండాలో... ఒడిశా వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment